Begin typing your search above and press return to search.

మళ్లీ..మళ్లీ..మహేశ్ ను తెగ వాడేస్తున్న బావ!

By:  Tupaki Desk   |   2 April 2019 11:51 AM GMT
మళ్లీ..మళ్లీ..మహేశ్ ను తెగ వాడేస్తున్న బావ!
X
నాన్ లోకల్ అయినా గత ఎన్నికల్లో ప్రజలు గెలిపించారు. మరి ఈ ఐదేళ్లలో గుంటూరుకు తను ఏం చేసిందీ చెప్పి ఈ సారి ఓటు అడగాల్సిన ఎంపీ గల్లా జయదేవ్.. ఎన్నికల ప్రచారంలో తన బామ్మర్ధి మహేశ్ బాబు ప్రస్తావన చేస్తూ పోతున్నారు. ఇటీవల మహేశ్ బాబు వ్యవహారాలపై ఇన్ కమ్ ట్యాక్స్ దాడులు జరిగాయి. మహేశ్ ఆర్థిక వ్యవహారాలపై సోదాలు ఏవో జరిగాయి. వాటిల్లో ఏం జరిగిందో, అవకతవకలు ఏమిటో .. అనే అంశంపై రకరకాల వార్తలు వచ్చాయి. అయితే వాటిపై మహేశ్ బాబు ఎక్కడా పెదవి విప్పలేదు. మహేశ్ వాటిని ఏదోలా సెటిల్ చేసుకున్నాడని మాత్రం వార్తలు వచ్చాయి.

మహేశ్ బాబు అస్సలు మాట్లాడని ఆ అంశం మీద ఎన్నికల ప్రచారంలో ఆపకుండా మాట్లాడుతున్నారు గల్లా జయదేవ్. తను లోక్ సభలో ప్రసంగిస్తూ ‘మిస్టర్ ప్రైమ్ మినిస్టర్’ అనడం వల్లనే మహేశ్ బాబు మీద ఐటీ దాడులు జరిగినట్టుగా గల్లా జయదేవ్ చెప్పుకు తిరుగుతున్నారు. అదంతా తనపై కక్ష సాధింపు చర్యలు అని, తనను ఏం చేసుకోలేక మహేశ్ బాబు మీద ఐటీని ప్రయోగించారని, తన కుటుంబీకులను వేధించారని గల్లా జయదేశ్ చెప్పుకుంటున్నారు.

ఏదో ఒకసారి అలా చెప్పారంటే అదో కథ. అయితే ప్రచార కార్యక్రమంలో మళ్లీ మళ్లీ ఇదే మాటలు చెబుతున్నారాయన. ఇలా చెప్పుకోవడం కామెడీ అయిపోతోంది. బోడిగుండుకు మోకాలికి ముడిపెట్టినట్టుగా.. తన బామ్మర్ధి ఆర్థిక వ్యవహారాల పై ఐటీ రైడ్స్ జరగడానికి తను ఎంపీగా రాణించడానికి ముడి పెడుతూ ఉన్నారీయన అని జనాలు గొణుక్కుంటున్నారు. ఐదేళ్లలో గుంటూరుకు ఫలానావి చేసినట్టుగా చెప్పుకుని ఓటు అడగాల్సింది పోయి, ఇలా మహేశ్ బాబు పై జరిగిన ఐటీ దాడులను రాజకీయంగా వాడుకొంటూ గల్లా జయదేవ్ పలుచన అవుతున్నారని విశ్లేషకులు అంటున్నారు.

మరి ఈ మాటలను గుంటూరు జనాలు ఎలా తీసుకుంటారో చూడాల్సి ఉంది. మహేశ్ పై ఐటీదాడులు జరిగాయి కాబట్టి.. గల్లాను గెలిపిస్తారో, లేక ఎంపీగా ఈయన పనితీరుపై వారు ఎలాంటి జడ్జిమెంట్ ఇస్తారో ఫలితాలతో కానీ తెలియదు!