Begin typing your search above and press return to search.

నాటి జ‌గ‌న్ మాట‌లే.. నేటి గ‌ల్లా వాద‌న‌లు

By:  Tupaki Desk   |   21 July 2018 5:02 AM GMT
నాటి జ‌గ‌న్ మాట‌లే.. నేటి గ‌ల్లా వాద‌న‌లు
X
మోడీ స‌ర్కారుపై పెట్టిన అవిశ్వాస తీర్మానం వీడిపోవ‌చ్చు కానీ.. ఈ సంద‌ర్భంగా ఏపీకి జ‌రిగిన అన్యాయం జాతీయ స్థాయిలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఏపీని విభ‌జించిన తీరును ఎండ‌గ‌ట్ట‌ట‌మే కాదు.. విభ‌జ‌న జ‌రిపిన తీరు అశాస్త్రీయంగా ఉండ‌ట‌మే కాదు.. రాజ‌కీయం ఐదు కోట్ల జీవితాల్ని ఎలా ప్ర‌భావితం చేసింద‌న్న విష‌యం తాజా చ‌ర్చ‌లో క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లుగా క‌నిపించింది.

అయితే.. ఇంత ప్ర‌భావ‌వంతంగా వాద‌న‌ను వినిపించ‌టానికి అవ‌స‌ర‌మైన ముడిస‌రుకును అందించింది ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అన్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు. ప్ర‌త్యేక హోదా ఇచ్చే విష‌యంలో ఏపీని మోస‌గిస్తున్న కేంద్రం తీరును బ‌ట్ట‌బ‌య‌లు చేసిన గల్లా ప్ర‌సంగంలో ప్ర‌స్తావించిన ప‌లు అంశాలు జ‌గ‌న్ గ‌తంలో చేసిన వాద‌న‌లే కావ‌టం గ‌మ‌నార్హం.

జ‌య‌దేవ్ మాట‌ల్ని గ‌మ‌నిస్తే.. ముందు నుంచి హోదా విష‌యంలో వైఎస్సార్ కాంగ్రెస్ వినిపించిన వాద‌న‌నే అనుస‌రించిన‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతుంది. అంతేనా.. అవిశ్వాసంపై మోడీ తీరును త‌ప్పు ప‌ట్టిన చంద్ర‌బాబు సైతం.. జ‌గ‌న్ వ్యాఖ్య‌ల్ని త‌న మాట‌లుగా చెప్పుకోవ‌టం క‌నిపిస్తుంది.

ప్ర‌త్యేక హోదాకు 14వ ఆర్థిక సంఘం నిబంధ‌న‌లు అడ్డు వ‌చ్చాయ‌ని మోడీ చెప్ప‌టం స‌రికాద‌ని బాబు మండిప‌డ్డారు. రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా సాధించుకోవ‌టంలో టీడీపీ అనుస‌రిస్తున్న మెత‌క వైఖ‌రిని ప్ర‌శ్నిస్తూ 2015 సెప్టెంబ‌రులో జ‌రిగిన అసెంబ్లీ స‌మావేశాల సంద‌ర్భంగా ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ త‌ప్పు ప‌ట్టారు.ఈ సంద‌ర్భంగా కేంద్రం చేస్తున్న మోసాన్ని ఆయ‌న ప్ర‌స్తావించారు.

ప్ర‌త్యేక హోదాకు 14వ ఆర్థిక సంఘం ఎలాంటి అభ్యంత‌రం చెప్ప‌లేద‌ని.. అస‌లు ప్ర‌త్యేక హోదాను ర‌ద్దు చేయ‌మ‌ని తాము ఎక్క‌డా చెప్పింది లేద‌ని 14వ ఆర్థిక సంఘం ఛైర్మ‌న్ వైవీ రెడ్డి అనేక సంద‌ర్భాల్లో చెప్పిన వైనాన్ని ఆధారాల‌తో స‌హా జ‌గ‌న్ చూపించారు.

అంతేకాదు.. ప్ర‌త్యేక హోదాను ర‌ద్దు చేయాల్సిందిగా తాము ఎక్క‌డా సూచ‌న చేయ‌లేద‌న్న మాట‌ను క‌మిష‌న్ స‌భ్యులు అభిజిత్ సేన్ లేఖ రాసిన వైనాన్ని జ‌గ‌న్ ప్ర‌స్తావించారు. మ‌రో స‌భ్యుడు గోవింద‌రావు సైతం ఇదే విష‌యాన్ని స్ప‌ష్టం చేసిన‌ట్లుగా జ‌గ‌న్ వెల్ల‌డించారు. మూడేళ్ల క్రితం జ‌గ‌న్ ప్ర‌స్తావించిన అంశాల్నే.. తాజాగా ఆయుధాలుగా మార్చుకున్న గ‌ల్లా జ‌య‌దేవ్ మోడీ స‌ర్కారుపై విమ‌ర్శ‌నాస్త్రాల్ని సంధించార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.