Begin typing your search above and press return to search.

గల్లా అడ్డంగా బుక్ అయ్యారా?

By:  Tupaki Desk   |   23 July 2016 5:01 AM GMT
గల్లా అడ్డంగా బుక్ అయ్యారా?
X
గుంటూరు తెలుగుదేశం పార్టీ ఎంపీ.. పారిశ్రామికవేత్త కమ్ ప్రిన్స్ మహేశ్ బాబు బావ కలగలిపి గల్లా జయదేవ్ తాజాగా వివాదంలో చిక్కుకున్నారు. తాను అద్దెకు ఉన్న భవనాన్ని తనకున్న పలుకుబడితో తక్కువ ధరకే సొంతం చేసుకోవాలనుకున్నారన్న ఆరోపణ ఆయనపై పడింది. తమకున్న ఇబ్బందుల్ని అసరాగా చేసుకొని తమ ఆస్తిని కాజేయాలని చూస్తున్నట్లుగా విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ వ్యవహారం చిలికి చిలికి పెద్దదై.. చివరకు ముఖ్యమంత్రి చంద్రబాబు వరకూ వెళ్లింది. ఈ మొత్తం వ్యవహారంలోకి వెళితే..

గుంటూరు బృందావన్ గార్డెన్స్ లో 300 గజాల్లో గుంటుపల్లి శ్రీనివాసరావు.. పద్మజ దంపతులకు మూడంతస్తుల భవనం ఉంది. 2013లో ఆంధ్రాబ్యాంకులో తాకట్టు పెట్టి రూ.2.30కోట్లు రుణం తీసుకున్నారు. ఆర్థికంగా దెబ్బ తినటంతో చెల్లించాల్సిన వాయిదాల్ని సకాలంలో చెల్లించలేకపోయారు. అదే సమయంలో 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో గల్లా జయదేవ్ ఈ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. ఇక్కడి వరకూ వ్యవహారం బాగానే ఉన్నా.. ఇక్కడి నుంచే పలు మలుపులు తిరిగింది.

గల్లా జయదేవ్ మీదున్న ఆరోపణ ఏమిటంటే.. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తమ పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకున్న గల్లా జయదేవ్.. బ్యాంకు అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి వేలానికి తెచ్చారని.. బ్యాంక్ డీజీఎంతో కుమ్మక్కై.. రిజర్వ్ ధర మరీ తక్కువ ఉండేలా చక్రం తిప్పినట్లుగా ఆరోపిస్తున్నారు.

ప్రస్తుతం మార్కెట్లో రూ.7.5కోట్ల విలువ ఉన్న సదరు ఆసక్తిని రూ.2.8 కోట్లుగా నిర్ణయించిన బ్యాంకు ఇటీవలే వేలానికి ప్రకటన జారీ చేసిందని పద్మజ దంపతులు ఆరోపిస్తున్నారు. తాను చెల్లించాల్సిన రూ.1.98 కోట్లు చెల్లించటానికి కొంత గడువు కావాలని కోరుతున్న పద్మజ భర్త శ్రీనివాసరావు మాట్లాడుతూ.. తాను డెట్ రికవరీ ట్రిబ్యునల్ ను ఆశ్రయించినప్పుడు జూన్ 24 లోపు రూ.కోటి మొత్తాన్ని చెల్లిస్తే.. మిగిలిన మత్తాన్ని చెల్లించటానికి అవసరమైన సహేతుకమైన సమయం ఇవ్వాలని ట్రిబ్యునల్ చెప్పిందన్నారు. అయితే.. ఈ ఆదేశాల్ని బుట్టలోపడేసిన బ్యాంకు అధికారులు.. తక్కువ ధరకే తమ భవనాన్ని ఎంపీ గల్లాకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా ఆరోపిస్తున్నారు.

మరోవైపు ఈ వాదనను గల్లా కొట్టిపారేస్తున్నారు. బ్యాంకుకు పద్మజ దంపతులు రూ.2.8కోట్లు బకాయిలు పడ్డారని.. తాను రూ.3.09 కోట్లు చెల్లించి బ్యాంకు వేలంలో కొనుగోలు చేశానని.. ఇందులో కబ్జా మాటకు అవకాశం లేదన్నారు. మరోవైపు.. తమకు జరిగిన అన్యాయంపై పద్మజ దంపతులు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును నాయుడ్ని కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. సొంత పార్టీ ఎంపీ గురించి కబ్జా ఆరోపణలు చేసిన ఉదంతంపై ముఖ్యమంత్రి ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.