Begin typing your search above and press return to search.

ఈ లెక్క‌న ఫ్యాన్స్ వ‌ల్ల ప‌వ‌న్ త‌లదించుకోవాల్సిందే

By:  Tupaki Desk   |   4 May 2018 8:24 AM GMT
ఈ లెక్క‌న ఫ్యాన్స్ వ‌ల్ల ప‌వ‌న్ త‌లదించుకోవాల్సిందే
X
జ‌న‌సేన పార్టీ అధినేత‌, సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ఆయ‌న ఫ్యాన్సే పెద్ద బ‌లం. ఇంకా స్ప‌ష్టంగా చెప్పాలంటే పార్టీకి ఇప్ప‌టివ‌ర‌కు సంస్థాగ‌త నిర్మాణం లేక‌పోయిన‌ప్ప‌టికీ...`అన్ని స్థానాల్లోనూ రాబోయే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పోటీ చేస్తుంది` అని ప‌వ‌న్ చెప్ప‌గ‌లుగుతున్నారంటే...అందుకు కార‌ణం ఫ్యాన్సే. అయితే ఆ ఫ్యాన్స్ వ‌ల్లే ప‌వ‌న్ త‌లదించుకునే ప‌రిస్థితులు ఎదుర‌వుతున్నాయా?రాజ‌కీయంగా ప్రత్య‌ర్థులు ఎదురుదాడి చేసేందుకు అవ‌కాశం ఇవ్వ‌డం వ‌ల్లే ఈ కొత్త చ‌ర్చ జ‌రుగుతోందా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది.

కొద్దికాలంగా త‌మ‌కు ప‌క్క‌లో బ‌ల్లెం వ‌లే మారిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై టీడీపీ నేత‌లు విరుచుకుప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ఈ ఎపిసోడ్‌ లో మ‌రో అడుగు ముందుకు వేసి పవన్‌ తరహాలోనే ట్వీట్ట‌ర్‌ లో ‘సోషల్‌ వార్‌’ స్టార్ట్‌ చేశారు. ‘జగన్-పవన్ సినిమా త్వరలో విడుదల కాబోతుంది. ఈ చిత్రానికి రచన, దర్శకత్వం ప్రశాంత్ కిషోర్. మోడీ-అమిత్ షా నిర్మాణ సారథ్యంలో ఈ చిత్రం మీ ముందుకు రాబోతోంది’ అని ట్విట్ట‌ర్‌ ద్వారా విమ‌ర్శ‌లు చేశారు. అయితే దీనికి జ‌న‌సేనా సైతం కౌంట‌ర్ ఇచ్చింది. `వన్ డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లా ఒక్కసారి లోక్‌సభలో స్పెషల్ స్టేటస్‌పై మాట్లాడి మౌనం పాటిస్తున్న గల్లా గారు.. మీ మౌనం వెనుక కారణం ఏమిటో రెండు రాష్ట్రాలలోని తెలుగు ప్రజలకు తెలుసు సార్.. కొత్త సినిమా. కథ-డైరెక్షన్ వంటి బ్యాటరీ డౌన్ అయిన మాటలు మానేసి.. స్పెషల్ స్టేటస్ తెచ్చే మార్గాలను కాస్త ఆలోచించండి మాస్టారు..’’ అంటూ ఎదురుదాడి చేసింది. ఇది ఇక్క‌డితోనే స‌ద్దుమ‌ణిగింది అనుకునే ద‌శ‌లో...తాజాగా జ‌య‌దేవ్ చేసిన ట్వీట్ క‌ల‌క‌లం సృష్టిస్తోంది.

తన తల్లిపై నటి శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం, పలు మీడియా ఛానళ్లు ఆ వీడియోను పదే పదే చూపించడంతో సదరు మీడియా ఛానెళ్లు, వాటి అధినేతలపై పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ విషయం తెలిసిందే. ప‌వ‌న్ ఫ్యాన్స్ సైతం ఇదే దూకుడును ప్ర‌ద‌ర్శించారు. అదే రీతిలో జ‌య‌దేవ్ తీరుపై స్పందించిన‌ట్లు తెలుస్తోంది. దీంతో జ‌య‌దేవ్ స్పందించారు. పవన్ కళ్యాణ్ తన అభిమానులను కంట్రోల్ చేయలేకపోతున్నారని ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు. `పీకే గారూ.. మీపై వ్యక్తిగత విమర్శల దాడి జరిగిందని ఆరోపిస్తూ.. మీరు మీడియాపై దాడికి దిగారు. మీ అభిమానులు వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. తప్పుడు భాష వాడుతున్నారు.శ‌రీరాకృతి గురించి మాట్లాడుతున్నారు. కుటుంబసభ్యులను ప్రస్తావిస్తున్నారు. ఈ విషయంలో మీ మౌనం పరోక్షంగా దీనిని మీరు అగీకరిస్తున్నట్లు, ప్రోత్సహిస్తున్నట్లుగా అనిపిస్తోంది` అంటూ ప‌వ‌న్ డిఫెన్స్‌ లో ప‌డే కామెంట్లు చేశారు. అదే స‌మ‌యంలో త‌న పెద్ద‌రికం చాటుకునేలా జ‌య‌దేవ్ మ‌రో ట్వీట్ చేశారు. `నా అనుచరులు ఎవ్వరూ కూడా వ్యక్తిగత దాడులకు దిగవద్దు. బాడీ షేమింగ్‌కు పాల్పడవద్దు. వ్యక్తుల కుటుంబాలపై దూషణలు వద్దని, హింసకు చోటివ్వకూడదు. ఇంతకుముందు ఇలా చేయలేదు. ఇకపై కూడా అదే కొనసాగించాలి అని కోరుకుంటున్నా` అంటూ గల్లా జయదేవ్ మ‌రో ట్వీట్‌లో కోరారు. కాగా, జ‌యదేవ్ ఈ రెండు ట్వీట్ల‌తో `ప‌వ‌న్‌..నువ్వు నీ ఫ్యాన్స్‌కు స‌భ్య‌త గురించి చెప్ప‌ట్లేదు. వారు అదుపుతప్పినా స్పందించ‌ట్లేదు. కానీ నేను అలాకాదు` అనే సందేశాన్ని ఇచ్చార‌ని అంటున్నారు.