Begin typing your search above and press return to search.

వేసేయండి.. లేట్ చేయొద్దు

By:  Tupaki Desk   |   15 Feb 2019 4:28 PM GMT
వేసేయండి.. లేట్ చేయొద్దు
X
జమ్ముకశ్మీర్‌ లోని పుల్వామాలో 46మంది భారత జవాన్లను పాక్ టెర్రరిస్టులు బలి తీసుకున్న ఘటనపై దేశమంతటా ఆగ్రహావేశాలు ప్రజ్వరిల్లుతున్నాయి. ఈ భీకర దాడికి చలించిపోయిన భారత క్రికెటర్ గౌతమ్ గంభీర్ సీరియస్‌ గా స్పందించారు. పాకిస్తాన్‌ కు గుణపాఠం చెప్పి తీరాల్సిందేనని వ్యాఖ్యానించిన ఆయన ఇక మాటలు చెప్పడం మాని ఏమాత్రం ఆలస్యం చేయకుండా వారి పని పట్టాలంటూ తీవ్ర పదజాలంతో ట్వీట్ చేశారు.

పాకిస్థాన్‌ కు యుద్ధ రంగంలోనే బుద్ది చెప్పాల‌ని గంభీర్ సూచించాడు. ఇక మాటలు వ‌ద్ద‌ని… యుద్ధ‌మే ఉగ్ర‌వాద స‌మ‌స్య‌కు ప‌రిష్కారం అని వ్యాఖ్యానించాడు. వేర్పాటు వాదుల‌ను ఉపేక్షిస్తూ పోతే ఇలాంటి ఘ‌ట‌న‌లే జ‌రుగుతాయ‌న్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగింది చాల‌ని… ఇక‌పై వేర్పాటు వాదులు - పాకిస్థాన్‌ తో మాట‌లు… కేవ‌లం యుద్ధ భూమిలోనే ఉండాల‌న్నారు. గ‌దుల్లో సంభాష‌ణ‌ల‌కు స్వ‌స్తి ప‌ల‌కాల‌ని కోరారు.

మరోవైపు ఉగ్ర‌దాడిని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా తీవ్రంగా ఖండించారు. అమ‌రులైన వారి కుటుంబాల‌కు ప్ర‌గాడ సానుభూతి తెలియ‌జేశాడు.

అయితే.. మాజీ క్రికెటర్ - కాంగ్రెస్ నేత సిద్ధూ మాత్రం వివాదాస్పద రీతిలో స్పందించారు. ఉగ్రవాదానికి మతం - జాతి లేదన్నారు. కశ్మీర్‌ లో శాంతి నెలకొనాలంటే చర్చలే పరిష్కారం అని - అందుకు భారత్ సరైన చొరవ చూపడం లేదంటూ ఇలాంటి వేళ వ్యాఖ్యానించారు. దాంతో ఆయనపై నెటిజన్లు మండిపడుతున్నారు. గతంలో పాక్ ఆర్మీ చీఫ్‌ ను ఆలింగనం చేసుకున్న సిద్ధూ ఈసారి భారత్ తీవ్రంగా నష్టపోయిన వేళ భారత్‌కే బుద్ధులు చెప్పడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.