Begin typing your search above and press return to search.

గండేపల్లి ఘోర దుర్ఘటనన అప్ డేట్స్

By:  Tupaki Desk   |   14 Sep 2015 6:49 AM GMT
గండేపల్లి ఘోర దుర్ఘటనన అప్ డేట్స్
X
ఒక రోడ్డు ప్రమాదంలో 16 మంది మరణించటం అంత చిన్న విషయమేమీ కాదు. ఈ ప్రమాదానికి సంబంధించి విస్మయాన్ని రేకెత్తించే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. విషాదకరమైన విషయం ఏమిటంటే.. ఈ ప్రమాదానికి సరిగ్గా గంట ముందు.. పోలీసుల దృష్టిలో ఈ లారీ కంటపడటం.. దాన్ని ఆపి హెచ్చరించిన అంశం వెలుగులోకి వచ్చింది. నిలువెత్తు నిర్లక్ష్యం.. బాధ్యతారాహిత్యమే ఈ ఘోర ప్రమాదానికి కారణంగా చెబుతున్నారు. ఈ ఘోర దుర్ఘటనకు సంబంధించి అప్ డేట్స్ చూస్తే..

1. గుండేపల్లి ఘటన జరగటానికి గంట ముందు ఈ లారీని తనిఖీల్లో భాగంగా పోలీసులు ఆపారట. ఉండాల్సిన దాని కంటే ఎక్కువ లోడ్ తో వెళ్లటంపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేసి.. ఇంత లోడ్ అయితే ప్రమాదం కదా? అని ప్రశ్నించినట్లు చెబుతున్నారు. అయితే.. కొంతదూరం వెళ్లి వాహనాన్ని నిలిపివేస్తానని డ్రైవర్ చెప్పటంతో పంపేశారట. మోతాదు మించిన లోడ్ తో పాటు.. నిద్రమత్తుతో ఉన్న డ్రైవర్ నిర్లక్ష్యం పెద్ద ఎత్తున ప్రాణాలు పోయేలా చేసింది. ఒకవేళ లారీని పోలీసులు ఆపేసినా ఇంత ప్రమాదం జరిగేది కాదన్న వాదన ఉంది.

2. గండేపల్లి వద్ద బోల్తా పడ్డ లారీ దుర్ఘటనలో ఇప్పటివరకూ 16 మంది మృతదేహాల్ని వెలికి తీశారు. మరో పదహారు మంది ఆసుపత్రికి వెళ్లగా.. మిగిలిన ముగ్గురు ఏం అయ్యారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

3. ఇంత భారీగా మృతులు ఉండటానికి కారణం.. లారీలో ధూళి లోడ్ ఎక్కువగా ఉండటం.. అదుపు తప్పిన లారీ రోడ్డు పక్కనున్న పంటపొలాల్లో పడిపోయింది. లారీలో ప్రయాణిస్తున్న కూలీలపై లారీలోని మట్టి పడిపోవటంతో మృతుల సంఖ్య పెరగటానికి కారణంగా చెబుతున్నారు.

4. ఈ ఘోర ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్.. క్లీన్ ఘటనాస్థలం నుంచి పరారు కావటం తెలిసిందే. వారు విశాఖ జిల్లా నక్కపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లి డ్రైవర్ జోగి శ్రీను లొంగిపోయాడు.

5. గండేపల్లి లారీ బోల్తా ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తామని.. ఈ ఘటనకు బాధ్యులైన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదని ఏపీ హోం మంత్రి చినరాజప్ప ప్రకటించారు.

6. హోం మంత్రి లెక్క ప్రకారం ఈ ఘటనలో 16 మంది మృతి చెందినట్లుగా వెల్లడించారు. అయితే.. మరో ముగ్గురు ఆచూకీ లభించకపోవటం గమనార్హం.

7. గండేపల్లి ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు రూ.2లక్షలు.. ప్రతి ఇంటికో ఉద్యోగం ఇవ్వనున్నట్లు ఏపీ ఆర్థిక మంత్రి యనమల ప్రకటించారు.

8. గండేపల్లి ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు.. విపక్ష నేత వైఎస్ జగన్ తీవ్ర దిగ్భాంత్రిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.