Begin typing your search above and press return to search.

షాకింగ్ గా ఆ రాష్ట్ర బడ్జెట్ కవర్ పేజీ

By:  Tupaki Desk   |   7 Feb 2020 11:09 AM GMT
షాకింగ్ గా ఆ రాష్ట్ర బడ్జెట్ కవర్ పేజీ
X
దేశంలో రాజకీయ దుమారం అంతకంతకూ ఎక్కువ అవుతోంది. ప్రతి విషయంలోనూ రాజకీయ ప్రత్యర్థులకు షాకిచ్చేలా నిర్ణయాలు తీసుకుంటున్న పార్టీల తీరుతో.. కొత్త కలకలాలు తెర మీదకు వస్తున్నాయి. తాజాగా కేరళలో చోటు చేసుకున్న ఉదంతం ఈ కోవకు చెందిందే. కేరళ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశ పెట్టిన బడ్జెట్ పెను దుమారంగా మారింది.

ఎందుకంటే.. బడ్జెట్ పుస్తకం కవర్ పేజీపై మహాత్మా గాంధీజీ హత్య ఫోటోను ముద్రించటం ఇప్పుడు కొత్త వివాదంగా మారింది. మలయాళ ఆర్టిస్టు గీసిన మహాత్మాగాంధీ హత్య దృశ్యాన్ని అచ్చేశారు. శరీరంపై రక్తపు గుర్తులు.. బుల్లెట్ గాయాలతో గాంధీజీ కింద పడిపోయి ఉంటే.. ఆయన అనుచరులు చుట్టూ చేరి రోదిస్తున్నారు. ఈ పుస్తకాన్ని కేరళ ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్ అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు.

గాంధీజీని ఎవరు చంపారో వారిని తాము ఇంకా మరిచిపోలేదన్న సందేశాన్ని ఇవ్వటం కోసమే కవర్ పేజీపై ఫోటోను ప్రింట్ చేసినట్లుగా పేర్కొన్నారు. గాంధీని హిందూ అతివాదులు హత్య చేసినట్లుగా కాంగ్రెస్ ఆరోపిస్తూ ఉంటుంది. ఇంకాస్త వివరంగా చెప్పాలంటే నాథూరాం గాడ్సే సంఘ్ కు చెందిన వ్యక్తిగా కాంగ్రెస్ ఆరోపించటం.. తమకు.. గాడ్సేకు సంబంధం లేదని కొట్టిపారేయటం ఎప్పటినుంచో ఉన్నదే.

బీజేపీని గాంధీ హత్య చేసిన వ్యక్తి వారసుల పార్టీగా కాంగ్రెస్ ఆరోపిస్తూ ఉంటుంది. దీనికి తగ్గట్లే ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో గాంధీని హత్య చేసింది హిందూ అతివాదులు.. అందునా బీజేపీకి చెందిన వారే అన్న విషయాన్ని పరోక్షంగా చెప్పేందుకు వీలుగా తమ ఏలుబడిలో ఉన్న కేరళ రాష్ట్ర బడ్జెట్ ప్రతిని ఈ రీతిలో రూపొందించారని చెప్పాలి.

ఈ వాదనకు బలం చేకూరేలా కేరళ రాష్ట్ర ఆర్థిక మంత్రి థామస్ వ్యాఖ్యలు ఉన్నాయి. గాంధీజీని హిందూ మతోన్మాదులు చంపేశారు. మహాత్ముడిని చంపిన వారే ఇప్పుడు కేంద్రంలో ఉన్నారు. గాంధీ హత్యను మరిచిపోలేదన్న సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే బడ్జెట్ కవర్ పేజీపై ఫోటోను ప్రింట్ చేయించామని ఆయన పేర్కొన్నారు. దీనిపై బీజేపీ వర్గాలు మండిపడుతున్నాయి. చూస్తుంటే.. ఈ వ్యవహారం రానున్న రోజుల్లో మరిన్ని రాజకీయ పరిణామాలకు తెర తీయటం ఖాయమని చెప్పక తప్పదు.