Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ ను నాశనం చేసేది గాంధీ కుటుంబమేనా?

By:  Tupaki Desk   |   27 Aug 2020 1:30 AM GMT
కాంగ్రెస్ ను నాశనం చేసేది గాంధీ కుటుంబమేనా?
X
100 ఏళ్ల కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు గాంధీ కుటుంబమే భారమవుతోందా? వారసత్వ రాజకీయాలు ఇంకా నేటి ఆధునిక భారతంలో చెల్లవని వారికి అర్థం కావడం లేదా? సమర్థ నాయకత్వం లేని గాంధీలు.. బయటి వారిని పార్టీలో ఎదగనీయడం లేదా? అందుకే కాంగ్రెస్ పార్టీ కునారిల్లుతోందా? అంటే ఔననే అంటున్నాయి ఢిల్లీ వర్గాలు. ఇప్పుడు మీడియా అంతా కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలపై గాంధీ కుటుంబం వైఖరియే కారణమని ఆడిపోసుకుంటున్నాయి.

పార్టీకి సమర్థ నాయకత్వం అవసరమని భావించిన 23 మంది కాంగ్రెస్ సీనియర్లు.. అంతర్గత ప్రజాస్వామ్యం బలపడాలని.. పార్టీ పదవులన్నింటికి ఎన్నికలు నిర్వహించాలని కోరారు. దీంతో ప్రియాంక గాంధీ కూడా కాంగ్రెస్ కు గాంధీయేతరుడు అధ్యక్షుడు కావాలని.. తన మద్దతు ప్రకటించారు.

ఈ క్రమంలోనే గాంధీల నాయకత్వం కాంగ్రెస్ పై పోతుందని.. కొత్త రక్తం పార్టీకి వస్తుందని అంతా భావించారు. కానీ సోనియా గాంధీ మాత్రం ఇది గాంధీల కుటుంబంపై నిర్మాణాత్మక దాడిగా అనుమనించిందని ఢిల్లీ వర్గాలు అంటున్నాయి.

అందుకే రాజీనామాకు సోనియా వెనకడుగు వేయడం.. సీనియర్లు నిప్పులు చెరిగి తమ సీట్లకు ముప్పు వాటిల్లుతుందని తెలిసి మౌనం దాల్చడంతో అందరూ కుక్కిన పేనులా ఆధిపత్యం అధికారం కోసం సైలెంట్ అయిపోయారని తెలుస్తోంది.

కాంగ్రెస్ కు కొత్త అధ్యక్షుడైతే పార్టీపై గాంధీ కుటుంబం ముద్రపోతుందని.. పాలన, పగ్గాలు చేజారిపోతాయని సోనియాకు బాగా తెలుసు. నిజానికి గాంధీ కుటుంబం తలుచుకుంటే పీవీ నరసింహారావు, సీతారాం కేసరి లాంటి బలమైన నేతలకు పగ్గాలు అప్పగించవచ్చు. కానీ అదే జరిగితే గాంధీ ప్రాబల్యం తగ్గుతుంది. వారి ముద్ర పోతుంది.

అందుకే బయటకు నాయకత్వ మార్పు అని హల్ చల్ చేసి ఆ తరువాత తమనే అధ్యక్షులుగా కొనసాగడం గాంధీల కుటుంబానికి పరిపాటిగా మారింది. అందుకే వ్యూహాత్మకంగా ఎంత గొడవ జరిగినా సోనియానే మళ్లీ అధ్యక్షులుగా కొనసాగారన్న చర్చ సాగుతోంది. కాంగ్రెస్ కు గాంధీ కుటుంబమే భారమని.. పార్టీ ఓటమికి వారి వారసత్వ రాజకీయాలే కారణమన్న విమర్శలు ఢిల్లీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.