Begin typing your search above and press return to search.

జాతిపిత మనవడి దీనావస్థ ఇది!

By:  Tupaki Desk   |   5 Nov 2016 4:45 AM GMT
జాతిపిత మనవడి దీనావస్థ ఇది!
X
ఉప్పు సత్యాగ్రహంలో టైంలో దండి బీచ్‌ లో ఓ పదేళ్ల బాలుడు గాంధీజీ చేతికర్ర పట్టుకుని నడిపిస్తున్న చిత్రం దేశ విదేశాల్లోనూ చాలా ప్రత్యేకం. ఈ చిత్రాన్ని చిన్నప్పటి నుంటి అంతా చూస్తూనే ఉన్నారు... అయితే ఆ చిత్రంలోని పిల్లాడు ఎవరు? ఇప్పుడెక్కడున్నారు? ఎలా ఉన్నారు? అనే విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఈ చిత్రంలోని పిల్లాడి పేరు "కానూ రాందాస్ గాంధీ".. ఇతడు మహాత్ముడి మనవడు.. ఇప్పుడితని వయసు 96 ఏళ్లు. ఈయనకు మహత్ముడి మనవడిగానే కాదు నాసా శాస్త్రవేత్తగా కూడా ఘనమైన చరిత్రే ఉంది! అయినా కూడా ఇప్పుడు పట్టించుకునేవారెవరూ లేక సూరత్‌ లోని ఓ ట్రస్టు ఆస్పత్రిలో దీనావస్థలో చివరి రోజులు గడుపుతున్నారు.

ఈయన చిన్నప్పుడు గాంధీ వ్యక్తిగత అవసరాలను చూసుకునేవారు.. అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్‌ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఉన్నతవిద్యనభ్యసించారు.. ఆ తర్వాత నాసా, అమెరికా రక్షణ శాఖలో కూడా ఉద్యోగం చేశారు. ఈ సమయంలోనే శివలక్ష్మిని వివాహం చేసుకున్నారు.. ఆమె మెడికల్ రీసెర్చర్. వీరికి సంతానం లేదు.. 40 ఏళ్లు అమెరికాలోనే ఉన్న ఈ దంపతులు 2014లోనే భారత్‌ కు తిరిగొచ్చారు. ప్రస్తుతం భారత్ లో సొంత గూడుకూడా లేక కొన్ని రోజులు ఆశ్రమాల్లో, సత్రాల్లో గడిపారు. సంపాదించిందంతా దానధర్మాలు చేయడంతో వీరి దగ్గర ప్రస్తుతం చిల్లిగవ్వ కూడా లేని పరిస్థితి నెలకొంది. గత పదిహేను రోజులుగా సూరత్‌ లోని రాధాకృష్ణన్ ఆలయం ఆధ్వర్యంలో నడుస్తున్న ఆస్పత్రిలో ఈయన చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయనకు భార్య శివలక్ష్మి(90) తప్ప నా అనేవారు ఎవరూ లేరు.

ఇంతజరుగుతున్నా ప్రభుత్వ పెద్దలు పట్టించుకోవడంలేదా.. వారికి తెలియలేదా.. జాతిపిత మనవడికి జాతి ఇచ్చే గౌరవం, ఆదరణ, చూపించే ప్రేమ ఇదేనా.. అంటే దానికీ సమాధానం ఉంది. ఏడాది క్రితం ఓ కేంద్ర మంత్రి వీరి దీనావస్థ గురించి తెలుసుకుని ప్రధాని మోడీతో మాట్లాడించారు. ఈ విషయాలపై సానుకూలంగా స్పందించిన మోడీ... సాయం చేస్తామని చెప్పినా ఇంతవరకు అటు కేంద్ర ప్రభుత్వ పెద్దలు కానీ, గుజరాత్ మంత్రులు కానీ ఎవరూ వీరిని కలవలేదట! ఇది జాతిపిత మహాత్మగాంధీ మనవడికి, ఉప్పు సత్యాగ్రహంలో జాతిపితకు కర్రపట్టుకుని సాయం అందించిన వ్యక్తిని జాతి ఇచ్చే గౌరవం. కరెన్సీ నోటుమీద తన తాన బొమ్మ ఉన్నా... అది అందనంత దూరంలో ఉండటం ఈయన పరిస్థితి!

కాగా, అక్టోబర్ 22న కానూకు తీవ్రమైన గుండెనొప్పి వల్ల పక్షవాతం వచ్చి ఎడమవైపు శరీరం పనిచేయటం లేదు. దీంతో ఆరోజునుంచీ ఆయన మంచానికే పరిమితమయ్యారు. ప్రస్తుతం వెంటిలేటర్‌ పైనే ఉన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/