Begin typing your search above and press return to search.

ఈ డాక్టర్ కమిట్ మెంట్ సూపర్.. సంతకెళ్లి డెలివరీ చేశాడు

By:  Tupaki Desk   |   12 Jan 2021 7:30 AM GMT
ఈ డాక్టర్ కమిట్ మెంట్ సూపర్.. సంతకెళ్లి డెలివరీ చేశాడు
X
ఇవాల్టి రోజున డాక్టర్ దగ్గరకు వెళ్లి వైద్యం చేయించుకోవాలంటే మాటలు కాదు. ఆసుపత్రికి వెళ్లి చిట్టీ రాయించుకున్న తర్వాత ఎప్పటికో పిలుస్తారు. చూసిచూడగానే.. పరీక్షల చిట్టా రాసిస్తారు. ఆ తర్వాతే వైద్యం. అలా అని అందరూ అలాంటి వైద్యులే ఉండరు. కొందరైతే.. సేవా భావమే తప్పించి.. మరింకేమీ పట్టదు. ఇప్పుడు చెప్పబోయే వైద్యుడు కూడా ఆ కోవకు చెందిన పెద్ద మనిషే. సికింద్రాబాద్ గాంధీ దవాఖానాలో వైద్యం చేసే ఈ వైద్యుడి పేరు అర్జున్.

పని మీద కీసరకు వెళ్లారు. ఆయనకు కాస్త దూరంలోనే సంత జరుగుతోంది. అక్కడ కుషాయగూడకు చెందిన శ్యామల.. రాజేశ్ దంపతులు కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంటారు. ప్రతి వారం సంతకు వెళ్లి కూరగాయలు అమ్మటం వారికి అలవాటు. గర్భవతి అయిన ఆమెకు సంతలో హటాత్తుగా నొప్పులు వచ్చాయి. అంబులెన్సుకు ఫోన్ చేస్తే వస్తుందన్నారు కానీ రాలేదు.

ఇలాంటి సమయంలో.. అక్కడే ఉన్న డాక్టర్ అర్జున్ కు విషయం చెప్పారు. ప్రసవం చేయటానికి అందుబాటులో ఎలాంటి పరికరాలు లేవు. దీంతో.. హ్యాండ్ గ్లౌజ్ లు వేసుకొని.. సంతలోనే అప్పటికప్పుడు ్ప్రసవం చేసి.. తల్లి బిడ్డా ప్రాణాల్ని కాపాడారు. ప్రసవం చేసే సమయంలో వైద్యుడికి స్థానిక మహిళలు సాయం చేశారు. పండంటి ఆడబిడ్డకు ఆమె జన్మనిచ్చారు. ప్రసవం జరిగాక.. అంబులెన్సు వచ్చింది. అనంతరం తల్లిబిడ్డల్ని ఆసుపత్రికి తరలించారు. వారిద్దరూ క్షేమంగా ఉన్నారు. వైద్య సాయం అవసరమైన వేళ.. అది లేదు.. ఇది లేదు అని చెప్పకుండా సాయం చేసిన వైద్యుడి తీరు స్థానికుల అభినందల్ని అందుకుంటోంది. ఇలాంటి వైద్యుల్ని తప్పనిసరిగా అభినందించాల్సిందే ఏమంటారు?