Begin typing your search above and press return to search.

మ‌హాత్మా.. నీ ఖ్యాతి నిరుప‌మానం

By:  Tupaki Desk   |   2 Oct 2018 8:11 AM GMT
మ‌హాత్మా.. నీ ఖ్యాతి నిరుప‌మానం
X
బ‌క్క‌చిక్కిన దేహం. అయినా.. ప్ర‌పంచం దృష్టిని త‌న‌వైపుకు తిప్పుకున్నాడు.
ఆయుధం ముట్ట‌లేదు. అయినా.. ర‌వి అస్త‌మించ‌ని సామ్రాజ్యంగా పేరున్న బ్రిట‌న్‌ ను గ‌డ‌గ‌డ‌లాడించాడు.
అధికారం చేప‌ట్టలేదు. అయినా.. యావ‌త్ భార‌తదేశాన్ని త‌న క‌నుసైగ‌తో శాసించాడు.

జాతి పిత మ‌హాత్మా గాంధీ ప్ర‌స్తావ‌న వ‌స్తే ఇలా ఎన్నైనా చెప్పుకుంటూ పోవ‌చ్చు. ఎంతైనా కీర్తించ‌వ‌చ్చు. యావ‌త్ మాన‌వాళి ప్ర‌శంస‌ల‌కు ఆయ‌న పూర్తిగా అర్హుడు. స‌త్యం - అహింస‌ల‌నే పునాదులుగా చేసుకొని భార‌త దాస్య శృంఖ‌లాల‌ను తెంచిన ధీరుడు గాంధీ. కేవ‌లం స్వాతంత్ర్య సాధ‌న‌నే ఆయ‌న ల‌క్ష్యంగా పెట్టుకోలేదు. స‌మ‌స‌మాజ నిర్మాణం కోసం క‌ల‌లు క‌న్నాడు. దాని కోసం నిరంత‌రం ప‌రిత‌పించాడు. కుల‌మ‌తాల మ‌ధ్య భేద‌భావాల‌ను చెరిపేసేందుకు ప్ర‌య‌త్నించాడు. మురికివాడ‌లు శుభ్రం చేశాడు. అంట‌రానిత‌నాన్ని చెరిపివేసేందుకు కృషి చేశాడు.

యావ‌త్ ప్ర‌పంచ చ‌రిత్ర‌లో గాంధీ త‌ర‌హాలో మాన‌వాళిని ప్ర‌భావితం చేసిన నేత మ‌రొక‌రు ఉండ‌రంటే అతిశ‌యోక్తి కాదేమో. 1869 అక్టోబ‌రున గుజ‌రాత్‌లోని పోరుబంద‌ర్‌లో జ‌న్మించిన ఆయ‌న‌.. ఉన్నత చదువుల కోసం ఇంగ్లాండ్ వెళ్ళారు. అక్కడే న్యాయ‌ విద్యను అభ్యసించారు. తరువాత స్వ‌దేశానికి తిరిగొచ్చారు. మూడేళ్ళపాటు బొంబాయి - రాజ్‌ కోట్‌ లలో న్యాయవాదిగా ప్రాక్టీసు చేశారు. 1893లో దక్షిణాఫ్రికా వెళ్ళి 20 సంవత్సరాలకు పైగా అక్కడే నివాసమున్నారు. అక్క‌డ న‌ల్ల‌జాతీయుల‌కు ఎదుర‌వుతున్న అవ‌మానాలు గాంధీని క‌ల‌చివేశాయి. న‌ల్ల‌జాతీయుడు కావ‌డంతో రైళ్లో నుంచి త‌న‌ను గెంటివేసిన తీరు ఆయ‌న‌లో క‌సిని నింపింది. జాతి వివ‌క్ష‌పై పోరాటం చేశారు.

1915లో భారతదేశానికి గాంధీ తిరిగొచ్చారు. బ్రిటిష్ పాల‌న‌లో దేశ ప్ర‌జ‌లు ప‌డుతున్న బాధ‌ల‌ను కళ్లారా చూశారు. స్వాతంత్ర్య పోరాట‌మ‌నే స‌మ‌ర శంఖాన్ని పూరించారు. స‌త్యాగ్ర‌హం - స‌హాయ నిరాక‌ర‌ణ‌ - అహింస‌ల‌ను త‌న ఆయుధాలుగా ఎంచుకున్నారు. జాతి యావ‌త్తును ఏకతాటిపైకి తెచ్చారు. అలుపెరుగ‌ని పోరాటంతో బ్రిటిష్ పాల‌కుల‌ను తిరుగుట‌పా క‌ట్టించారు. ఇందులో ప‌లువురు ఇత‌ర యోధుల కృషి కూడా ఉంద‌న్న‌ది నిర్వివాదాంశం. అయితే, గాంధీ స్థాయిలో దేశ ప్ర‌జ‌ల‌ను ప్ర‌భావితం చేసిన వ్య‌క్తం మాత్రం ఇంకొక‌రు లేరు.

మ‌హాత్ముడి దిశా నిర్దేశ‌న‌మే స్వాతంత్ర్య పోరాటంలో భార‌త్‌ను స‌రైన దిశ‌లో న‌డిపించింది. ఉప్పు స‌త్యాగ్ర‌హం, క్విట్ ఇండియా - విదేశీ వ‌స్తువుల బ‌హిష్క‌ర‌ణ.. ఇలా ఆయ‌న చేప‌ట్టిన ఉద్య‌మాల‌న్నీ గ్రాండ్ స‌క్సెస్ అయ్యాయి. దేశ ప్ర‌జ‌ల‌ను ఏకం చేశాయి. వారిలో ఆత్మ‌విశ్వాసాన్ని నింపాయి. ప్ర‌పంచాన్ని నివ్వెర‌ప‌ర్చాయి. వ‌ల‌స పాల‌కుల‌ను గ‌ద్దె దించాయి. అహింస ముందు అన్నీ దిగదుడుపేన‌ని గాంధీ రుజువు చేశాడు.

నేటి త‌రం గాంధీ జ‌యంతిని కేవ‌లం జాతీయ సెల‌వు దినంగానే చూస్తోంది. ఆయ‌న గొప్ప‌త‌నాన్ని తెలుసుకునేందుకు ప్ర‌య‌త్నించ‌డం లేదు. ఆయ‌న అడుగుజాడ‌ల్లో న‌డిచేందుకు ప్రాధాన్య‌మివ్వ‌డం లేదు. దీనిపై ప్ర‌భుత్వం దృష్టి సారించాలి. మ‌హాత్ముడి ఖ్యాతిని న‌వ‌త‌రాల‌కు వివ‌రించే కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాలి. స‌త్యం - అహింసే పునాదులుగా జీవ‌నాన్ని కొన‌సాగించేలా ప్ర‌జ‌ల‌ను చైత‌న్య‌వంతుల‌ను చేయాలి. మ‌హాత్ముడి 150వ జ‌యంతితోనైనా ప్ర‌భుత్వం ఆ దిశ‌గా అడుగులు వేస్తుంద‌ని ఆశిద్దాం.