Begin typing your search above and press return to search.

వైసీపీకి గండి కొట్టే హీరో ఆయనే...?

By:  Tupaki Desk   |   4 Jan 2022 1:30 AM GMT
వైసీపీకి గండి కొట్టే హీరో ఆయనే...?
X
వైసీపీకి రాష్ట స్థాయిలో, జిల్లాల‌ స్థాయిలో అప్రతిహత విజయాలు ఎన్ని అయినా దక్కవచ్చు. కానీ కొన్ని చోట్ల మాత్రం ఈ రోజుకీ పాగా వేయలేకపోతోంది. అయితే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలన్న వైసీపీ సంకల్పానికి టీడీపీ సరికొత్త వ్యూహం గండి కొట్టబోతోందిట. ఇంతకీ ఏమా కధా కమామీషూ అంటే విశాఖ సిటీలోని ఆ సీటు వైపు లుక్కేసుకోవాల్సిందే.

విశాఖ సౌత్ లో వైసీపీకి రెండు సార్లూ పరాజయం పలకరించింది. పార్టీ పెట్టాక విశాఖ నడిబొడ్డున మాత్రం ఆ పార్టీకి సక్సెస్ దక్కడంలేదు. 2014 లో కోలా గురువులు ఇక్కడ నుంచి పోటీ చేస్తే టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ చేతిలో ఓడిపోయారు. ఇక 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ద్రోణం రాజు శ్రీనివాస్ ని తెచ్చి పోటీకి నిలిపినా కూడా వైసీపీ జెండా మాత్రం ఎగరలేదు.

దాంతో ఎన్నికల తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ఏకంగా గెలిచిన టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లికే కండువా కప్పేసింది. ఆయన ఇపుడు వైసీపీలో అనధికార ఎమ్మెల్యేగా ఉన్నారు. అన్నీ అనుకూలిస్తే వచ్చే ఎన్నికల్లో ఆయనే పోటీ చేస్తారు. బలమైన మత్య్సకార సామాజికవర్గానికి చెందిన గణేష్ కుమార్ హ్యాట్రిక్ కొట్టడానికి తనదైన శైలిలో పావులు కదుపుతున్నారు.

ఆయనకు లోకల్ వైసీపీ నేతలతో కొన్ని ఇబ్బందులు ఉన్నా హై కమాండ్ నుంచి పూర్తి సహకారం ఉంది. ఒక విధంగా ఆయనకు టికెట్ కన్ ఫర్మ్ అయినట్లే అంటున్నారు. ఈ నేపధ్యంలో టీడీపీకి చూస్తే అక్కడ గట్టి క్యాండిడేట్ నిన్నటిదాకా లేరు. అయితే సడెన్ గా టీడీపీ తీసుకున్న ఒక నిర్ణయంతో మంచి దూకుడు మీద ఉన్న మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ ఇంచార్జి అయిపోయారు. ఆయనే వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ అని చెబుతున్నారు.

గండి బాబ్జీ 2004లో పరవాడ నుంచి తొలిసారి కాంగ్రెస్ టికెట్ మీద గెలిచారు. 2009లో అది పెందుర్తిలో కలసిపోవడంతో అక్కడ నుంచి మరోమారు కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడారు. 2014 నాటికి వైసీపీలో చేరినా టికెట్ అయితే దక్కలేదు. దాంతో ఆయన అసంతృప్తితో ఆ పార్టీని వీడారు. ఆ తరువాత టీడీపీలో చేరి 2019 ఎన్నికల్లో పెందుర్తి టికెట్ ట్రై చేసినా మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తికి దక్కింది. 2024లో ఆయన కొడుకు అప్పలనాయుడుకి టికెట్ ఇస్తారని అంటున్నారు.

దాంతో గండి బాబ్జీ ఎమ్మెల్యే ఆశలను తీర్చేదిగా విశాఖ సౌత్ గేట్ ని ఓపెన్ చేసి పంపారని అంటున్నారు. ఆయన ఎటూ సిటీలో ఉంటారు కాబట్టి పట్టు సాధించగలరు అన్న ఆలోచనలతోనే విశాఖ సౌత్ కి ఇంచార్జిని చేశారు అంటున్నారు. గండి బాబ్జీ అయిదేళ్ల పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉండగా విశాఖ సిటీలో బాగానే హల్ చల్ చేశారు. ఆయనకు ఒక బలమైన వర్గం ఉంది. దాంతో పాటు దూకుడు ఉన్న నేత. ఇక టీడీపీకి మంచి క్యాడర్ ఉంది. అన్నీ కలసివస్తే వాసుపల్లిని 2024లో ఢీ కొట్టి గెలుస్తారు అని తమ్ముళ్ళు అంటున్నారు. వైసీపీకి విశాఖ సౌత్ లో మూడవసారి కూడా గెలుపు ఆశ లేకుండా ఈ మాజీ ఎమ్మెల్యే గండి కొట్టగలారా అన్నది మరి చూడాలి.