Begin typing your search above and press return to search.

బాలిక పై గ్యాంగ్ రేప్.. అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసులపైనా కాల్పులు

By:  Tupaki Desk   |   6 Feb 2022 2:07 PM GMT
బాలిక పై గ్యాంగ్ రేప్.. అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసులపైనా కాల్పులు
X
ఆరాచక నేరాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటుంది ఉత్తరప్రదేశ్. ఒకప్పుడు దారుణ నేరాలకు నెలువుగా ఉండే బిహార్.. గడిచిన కొన్నేళ్లుగా పరిస్థితుల్లో కొంత మార్పు వస్తుంటే.. ఉత్తరప్రదేశ్ లో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి. యోగి సర్కారు హయాంలో నేరస్తులకు చుక్కలు చూపించారని.. నేరాలు పాల్పడేందుకు సైతం వణుకు పుట్టేలా వారి తీరు ఉంటుందన్న మాట వినిపిస్తూ ఉంటుంది. అయినప్పటికీ నేరాలు మాత్రం కొనసాగుతూనే ఉంటాయి. తాజాగా అలాంటి దారుణ ఉదంతమే ఒకటి యూపీలో చోటు చేసుకుంది.

రాష్ట్రంలోని గోండా జిల్లాలో ఒక దళిత బాలికపై ఇద్దరు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడి.. ఆపై హత్య చేశారు.వారిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తే వారిపైనా కాల్పులు జరిపిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. గ్రామానికి చెందిన ఒక దళిత బాలిక డెడ్ బాడీని పంట పొలాల్లో గుర్తించారు. శుక్రవారం రాత్రి బహిర్భూమికి వెళ్లిన బాలిక బయటకు వచ్చిన వేళలో.. దుండగులు ఆమెను ఎత్తుకెళ్లి ఈ దారుణ హత్యాచారానికి పాల్పడినట్లుగా పోలీసులు గుర్తించారు.

సంచలనంగా మారిన ఈ దారుణానికి పాల్పడిన వారిని పట్టిస్తే రూ.25వేల బహుమతి ఇస్తామని పోలీసులు ప్రకటించారు. ఈ ప్రకటన చేసిన ఐదు గంటల వ్యవధిలోనే దుండగులకు సంబంధించిన సమాచారం పోలీసులకు అందింది. వారు చెరుకు తోటలో తలదాచుకున్నట్లుగా సమాచారం అందుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకునేందుకు వెళ్లారు. అనూహ్యంగా అరెస్టు చేయటానికి వెళ్లిన పోలీసులపై కాల్పులు జరిపారు.

దీనికి ప్రతిగా పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఉదంతంలో నిందితుడు ఒకడు పరారీ కాగా..గాయపడిన మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. పరారైన నిందితుడ్ని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. ఎన్నికల వేళ చోటు చేసుకున్న ఈ హత్యాచారం అధికార పార్టీకి తలనొప్పిగా మారుతుందన్న మాట వినిపిస్తోంది.