Begin typing your search above and press return to search.

చనిపోయిన ఐటీ ఉద్యోగులే ఈ కేటుగాళ్ల టార్గెట్

By:  Tupaki Desk   |   9 Feb 2020 6:30 AM GMT
చనిపోయిన ఐటీ ఉద్యోగులే ఈ కేటుగాళ్ల టార్గెట్
X
రోడ్డు ప్రమాదంలో కానీ.. మరేదైనా కారణంతో కానీ ఐటీ ఉద్యోగులు మరణించటం.. అందుకు సంబంధించిన వార్తలు పేపర్లో రావటం చూస్తుంటాం. ఇలాంటి వార్తల్ని చూసి.. చదివినంతనే అయ్యో అనుకుంటాం. అందరూ అలా అనుకుంటే.. ఇప్పుడు చెప్పే కేటుగాళ్లు మాత్రం అందుకు పూర్తి భిన్నం. అయ్యో అనుకునే దాన్లోనే భారీ ఎత్తున సొమ్ములు కొల్లగొట్టొచ్చన్న దుర్మార్గమైన ప్లాన్ వేయటమే కాదు.. బ్యాంకుల్ని బురుడి కొట్టించి దోచేస్తున్న సంచలన నిజం తాజాగా బయటకు వచ్చింది.

హైదరాబాద్ ను అడ్డాగా చేసుకొని ప్రమాదవశాత్తు చనిపోయిన ఐటీ ఉద్యోగుల పేర్లతో బ్యాంకుల్ని మోసం చేసి.. లక్షలాది రూపాయిల్ని దండుకునే దుర్మార్గపు బ్యాచ్ ను సైబరాబాద్ పోలీసులు తాజాగా పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఒళ్లు గగుర్పాటుకు గురి చేసే విషయాలు వెల్లడయ్యాయి. హైటెక్ సిటీలో ఐటీ ఇంజినీర్ గా పని చేసే రఘురాం కొన్ని నెలల క్రితం (గత ఏడాది అక్టోబరు 14న) కంపెనీ బిల్డింగ్ మీద నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఇది జరిగిన కొన్నాళ్లకు రఘురాం ఇంటికి హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు అధికారులు వచ్చారు. అతగాడు మరణించిన రోజునే క్రెడిట్ కార్డుపై రూ.2.76 లక్షల రుణం తీసుకున్నట్లు చెప్పటంతో అతడి సతీమణి అవాక్కు అయ్యారు. వెంటనే ఆమె సైబరాబాద్ పోలీసుల్ని ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు తమ విచారణలో విస్తుపోయే వాస్తవాల్ని గుర్తించారు.

ఎవరైనా ఐటీ ఉద్యోగి చనిపోయినట్లుగా వార్తలు వచ్చినంతనే.. వారికి సంబంధించిన ప్రాధమిక సమాచారాన్ని సిద్ధం చేసుకోవటం.. వారి పేరుతో దొంగ ఐడీ ఫ్రూపుల్ని తయారు చేసి.. బ్యాంకులకు ఫోన్లు చేసి బోల్తా కొట్టించి వారి పేరు మీద రుణాలు పొందే దుర్మార్గ ప్లాన్ ను అమలు చేస్తున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన ఆరుగురు ఈ స్కాంలో కీలక నిందితులుగా పోలీసులు గుర్తించారు. గతంలోనూ కొందరు ఐటీ ఉద్యోగుల పేరుతో ఇదే రీతిలో డబ్బులు దండుకున్నట్లుగా గుర్తించారు. ఇప్పటివరకూ అందిన సమాచారం ప్రకారం రూ.54 లక్షల వరకూ చనిపోయిన వారి పేరుతో సొమ్ము చేసుకున్నట్లుగా చెబుతున్నారు.