Begin typing your search above and press return to search.

గ్రౌండ్ రిపోర్ట్: 'గంగాధర నెల్లూరు' ఎవరిది?

By:  Tupaki Desk   |   2 April 2019 2:30 PM GMT
గ్రౌండ్ రిపోర్ట్: గంగాధర నెల్లూరు ఎవరిది?
X
అసెంబ్లీ నియోజకవర్గం: గంగాధర నెల్లూరు

టీడీపీ: అనగంటి హరికృష్ణ
వైసీపీ: కళత్తూరు నారాయణస్వామి

చిత్తూరు జిల్లా రాజకీయాల గురించి తెలియని వారుండరు. టీడీపీ అధినేత - ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు - కాంగ్రెస్‌ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఈ జిల్లాలోని నియోజకవర్గాల్లో పోటీ చేసి ముఖ్యమంత్రి పీఠాలనెక్కారు. ఈ ఎన్నికల్లోనూ ఈ జిల్లాలో సార్వత్రిక పోరు రసవత్తరంగా మారుతోంది. ముఖ్యంగా జిల్లాలోని గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో పోటీ టైట్‌ గానే కనిపిస్తోంది. 2014 ఎన్నికల్లో వైసీపీ ఈ నియోజకవర్గాన్ని గెలుపొందింది. వైసీపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన నారాయణస్వామి మరోసారి పోటీ చేస్తుండగా టీడీపీ నుంచి అనగంటి హరికృష్ణ బరిలో నిలుచున్నారు. జనసేన పార్టీ - ఇతర పార్టీల నుంచి అభ్యర్థులో రంగంలో ఉన్నా ప్రధానంగా మాత్రం వైసీపీ - టీడీపీ మధ్యే పోటీ నెలకొంది

* గంగాధర నెల్లూరు నియోజకవర్గం చరిత్ర

మండలాలు: జీడీనెల్లూరు - పాలసముద్రం - కార్వేటినగరం - పెనుమూరు - వెదురుకుప్పం - ఎస్‌ ఆర్‌ పురం -

ఓటర్లు :లక్షా 93వేలు

నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా గంగాధర నెల్లూరు నియోజకవర్గం 2009లో ఏర్పడింది. 2014లో ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కుతూహలమ్మపై వైసీపీ అభ్యర్థి కళత్తూరు నారాయణస్వామి 20 వేల ఓట్లతో గెలుపొందారు. ప్రస్తుతం టీడీపీ తరుఫున ఆమె కుమారుడు హరికృష్ణ బరిలో దిగారు. అటు వైసీపీ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే నారాయణ స్వామినే పోటీలో నిల్చున్నారు.

* రెండోస్సారి నారాయణస్వామి..

నారాయణస్వామి 2004లో కాంగ్రెస్‌ తరుపున సత్యవేడు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలుపొందారు.2009లో పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత కాంగ్రెస్‌ నుంచి వైసీపీలోకి చేరి కొత్తగా ఏర్పడిన గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో పోటీ చేసి గెలుపొందారు. రాష్ట్రంలో పార్టీ అధికారంలో లేకున్నా అభివృద్ధి విషయంలో పట్టించుకోవడంతోపాటు ప్రజలతో కలిసిపోవడం ఆయనకు సొంత ఇమేజ్‌ ఏర్పడింది. అటు పార్టీ పరంగా రాష్ట్ర నాయకులతో సత్సంబంధాలు కొనసాగిస్తూ వస్తున్నారు నారాయణస్వామి. రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన రాజకీయ అనుభవంతో మూడోసారి విజయం సాధిస్తానని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

*అనుకూలతలు:

-సిట్టింగ్‌ ఎమ్మెల్యే కావడం
-పార్టీ బలంగా ఉండడం
-కార్యకర్తలను కలుపుకుపోవడం

*ప్రతికూలతలు:

-వర్గవిభేదాలు పోషించడం
-బలమైన సామాజిక వర్గానికి దూరంగా ఉండడం

* మొదటిసారి బరిలోకి అనగంటి హరికృష్ణ:

మొదటిసారి ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతున్న హరికృష్ణ రాజకీయాలకు కొత్తయినా రాజకీయ నేపథ్యం బాగానే ఉంది. ఆయన తల్లి కుతూహలమ్మ వేపంజేరి నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తరువాత శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ గా కూడా పనిచేశారు. ప్రస్తుతం అనారోగ్యాల దృష్ట్యా ఆయన కుమారుడికి బాధ్యతలను అప్పగించింది. దీంతో తన తల్లి రాజకీయానుభవంతో రంగంలోకి దిగాడు హరికృష్ణ. రాత్రింభవళ్లు తేడా లేకుండా విస్తృతంగా పర్యటిస్తున్నాడు. టీడీపీ అధికారంలో ఉండడం.. సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని ఆశతో ఉన్నారు.

* అనుకూలతలు:

-పార్టీ ఇన్‌ చార్జిగా పనిచేసి పరిచయాలు పెంచుకోవడం
-టీడీపీ ప్రవేశపెట్టిన పథకాలను నియోజకవర్గంలో ప్రచారం చేయడం
-మాజీ మంత్రి తనయుడు కావడం

* ప్రతికూలతలు:

-కొత్తగా రాజకీయాల్లోకి
-ప్రత్యర్థి సిట్టింగ్‌ ఎమ్మెల్యే కావడం

*టఫ్ ఫైట్ లో గెలిచేదెవరు.

నియోజకవర్గంలో మరోసారి వైసీపీ జెండా ఎగురవేయాలని నారాయణస్వామి - ఈసారి టీడీపీని గెలిపిస్తానని హరికృష్ణలో పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. రాజకీయ అనుభవమున్నవారు ఒకరైతే.. రాజకీయాలకు కొత్తగా మరొకరు బరిలోకి దిగుతున్నారు. మొత్తంగా నియోజకవర్గ ప్రజలు ఎవరిని గెలిపిస్తారో చూడాలి.