Begin typing your search above and press return to search.

జైల్లో గంగిరెడ్డి భార్యకు ఏం చెప్పారు..?

By:  Tupaki Desk   |   22 Nov 2015 4:21 AM GMT
జైల్లో గంగిరెడ్డి భార్యకు ఏం చెప్పారు..?
X
స్టేట్ లెవల్లో నేరాలు చేసి.. అనతి కాలంలో జాతీయ స్థాయి నేరస్తుల సరసన చోటు సంపాదించి.. విదేశాలకు పారిపోయి.. మారిషస్ పోలీసులకు చిక్కి.. ఆపై భారత్ కు.. తాజాగా ఆంధ్రప్రదేశ్ కు వచ్చిన గంగిరెడ్డి ప్రస్తుతం జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులతో పాటు.. పలు నేరారోపణలు ఉన్న ఇతగాడికి ప్రాణహాని ఉందని చెబుతోంది గంగిరెడ్డి సతీమణి మాళవిక. తాజాగా మీడియా ముందుకు వచ్చిన ఆమె.. పలు విషయాల గురించి మీడియాతో చెప్పుకొచ్చారు.

తన భర్త మీద ఉన్న కేసుల్లో రెండు మినహా.. మిగిలినవన్నీ కక్షసాధింపు కేసులుగా ఆమె అభివర్ణించారు. తన భర్త తలకు తుపాకీ గురి పెట్టి బెదిరించటంతో.. తనకు ప్రాణహాని లేదని చెప్పారని.. కానీ.. ఆయనకు ప్రాణహాని ఉందన్న విషయం తనకు చెప్పినట్లుగా గంగిరెడ్డి భార్య తాజాగా వెల్లడించారు. తాను జైలుకు వెళ్లి భర్తను కలిసిన సందర్భంగా తనకా విషయాన్ని గంగిరెడ్డి చెప్పినట్లుగా ఆమె చెబుతున్నారు.

తన భర్త ప్రాణాలకు ముప్పు ఉందని.. జైల్లో కానీ.. కోర్టుకు తరలించే సమయంలో కానీ.. ఆహారం ద్వారా కానీ ఆయన ప్రాణాల్ని తీసే అవకాశం ఉందని.. గంగిరెడ్డి ప్రాణాలకు ఏం జరిగినా దానికి చంద్రబాబు బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పుకొచ్చారు. విదేశాల నుంచి తన భర్తను తీసుకొచ్చే మార్గమధ్యంలోనే బెదిరించారని.. తాము చెప్పినట్లుగా వినకపోతే.. భార్య..పిల్లల్ని చూసుకునే అవకాశం లేదని చెప్పటం వల్లే.. గంగిరెడ్డి తన ప్రాణాలకు హాని లేదని చెప్పినట్లుగా ఆమె చెబుతున్నారు.

తాము మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నామని.. రాజకీయంగా తమను దెబ్బ తీసేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నట్లు ఆమె చెప్పుకొచ్చారు. బెరైటీస్ ఎగుమతులకు సంబంధించిన పర్మిషన్ల కోసం గంగిరెడ్డి దుబాయ్ వెళ్లారని.. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు.. గవర్నర్ ను కలిసి లేఖ ఇవ్వటం.. లుక్ అవుట్ నోటీసులు.. రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయని.. అందుకే భయపడి అక్కడే ఉండిపోయి ఉంటారని చెప్పుకొచ్చారు. తన భర్త మీద మోపిన కేసులకు సంబంధించి.. అసలు ఆయనకు సంబంధమే లేదని చెప్పుకొచ్చారు.