Begin typing your search above and press return to search.

గ్యాంగ్ స్టర్ నయీం ఆస్తుల రిటర్న్ కేసులో బాధితులకు షాక్

By:  Tupaki Desk   |   13 Oct 2022 5:30 PM GMT
గ్యాంగ్ స్టర్ నయీం ఆస్తుల రిటర్న్ కేసులో బాధితులకు షాక్
X
కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్, మాజీ నక్సలైట్ నయీం ఎంతో మంది ప్రజలు, నేతలు, అమాయకులను బెదిరించి కోట్ల విలువైన ఆస్తులను కొల్లగొట్టారు. కిడ్నాప్ లు, హత్యలతో కోట్లు వెనకేసుకున్నాడు. అతడికి లెక్కలేనన్న భూములు, ఆస్తులు, నగదు ఉంది. నయీం దోచుకున్న ఆస్తులను స్వాధీనం చేసుకొని బాధితులకు తిరిగి ఇవ్వాలని ప్రభుత్వం యోచించింది. బినామీ ఆస్తుల (నిరోధక) చట్టం కింద వాటిని స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నించింది.

అయితే బాధితులకు తిరిగి ఇచ్చే ఈప్రక్రియకు కోర్టులో బ్రేక్ పడింది. ఆస్తులను స్వాధీనం చేసుకోవడం కుదరదని అడ్జ్యూడికేటింగ్ అథారిటీ తేల్చిచెప్పింది. దీంతో దర్యాప్తు సంస్థలు ప్రత్యామ్మాయ మార్గాలపై దృష్టి పెట్టారు.నయాం దందాలతో భూములు, ఇళ్ల స్థలాలు పోగొట్టుకున్న వేల మంది బాధితుల పరిస్థితి ఈ పరిణామంతో అగమ్యగోచరంగా తయారైంది.

నక్సలైట్ ఉద్యమం నుంచి బయటకు వచ్చిన నయీం పోలీసులకు లొంగిపోయి వారి అండదండలతో చీకటి గ్యాంగ్ స్టర్ స్రామాజ్యాన్ని నెలకొల్పాడన్న ఆరోపణలు ఉన్నాయి. దీనికి అధికార పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు సహకరించారని ప్రచారం ఉంది. సెటిల్ మెంట్లు, బెదిరింపులు, కిడ్నాపులు, హత్యలతో బెంబేలెత్తిస్తూ వందలకోట్ల విలువైన భూములను ఆక్రమించాడని.. ప్రాణభయంతో బాధితులు ఫిర్యాదు చేసేందుకు భయపడ్డారు.

అయితే నయీం ఆగడాలు ఎక్కువైపోవడం.. ప్రజాప్రతినిధులను అధికార పార్టీ నేతలనే బెదిరించే స్థాయికి చేరడంతో 2016 ఆగస్టు 8న షాద్ నగర్ లో తెలంగాణ పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. నయీం మరణించాక బాధితులంతా పోలీసులకు ఫిర్యాదులు చేశారు. దాదాపు 250కి పైగా కేసులు నమోదయ్యాయి. 1019 ఎకరాల వ్యవసాయ భూములు, 2 లక్షల గజాల ఇళ్ల స్థలాలు, 29 భవనాలను నయీం తన అనుచరులు, బంధువులు పేర్లతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు దర్యాప్తులో తేలింది.

దీంతో ప్రభుత్వం బినామీ ఆస్తుల నిరోధక చట్టం ప్రకారం నయీం ఆస్తుల స్వాధీన ప్రక్రియ మొదలుపెట్టింది. రెండు దఫాలుగా అటాచ్ చేసింది. అయితే నయీం ఆస్తులపై అతడి కుటుంబ సభ్యులు కోర్టును ఆశ్రయించారు.తమవే ఆస్తులని వాదించారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు నయీం ఆస్తులపై బినామీ చట్టాన్ని ప్రయోగించడాన్ని కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది. స్వాధీన ప్రక్రియ ప్రారంభించిన తర్వాత ఆస్తులన్నీ చేతులు మారినందున వాటిపై బినామీ చట్ట ప్రయోగం కుదరదని స్పష్టం చేసింది.

దీంతో పోలీసులు ఈ ఆస్తుల స్వాధీనం విషయంలో ప్రత్యామ్మాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. నయీం దోచుకున్న ఆస్తులను బాధితులకు అందించే ప్రయత్నాలు ఆగవని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.