Begin typing your search above and press return to search.

ఆరునెల్లలో నయిం ఇచ్చిన లంచం రూ.80 కోట్లు

By:  Tupaki Desk   |   10 Aug 2016 5:59 AM GMT
ఆరునెల్లలో నయిం ఇచ్చిన లంచం రూ.80 కోట్లు
X
గడిచిన రెండు రోజులుగా పేపర్.. టీవీ.. వెబ్ సైట్.. సోషల్ మీడియా.. ఇలా మాధ్యమం ఏది చూసినా గ్యాంగస్టర్ నయింకు చెందిన వార్తలతో నిండిపోతోంది. వాటిని చదివిన ప్రతి ఒక్కరికి వచ్చే ప్రాధమిక సందేహం ఏమిటంటే.. అంత దుర్మార్గుడ్ని చట్టం.. న్యాయం.. మీడియా.. ఏం చేయకుండా ఎందుకు ఉండిపోయింది? బ్లాక్ మొయిల్ చేస్తాడని.. బెదిరిస్తాడని.. వేలాది కోట్ల ఆస్తులు కూడగట్టుకున్నట్లుగా పేజీలకు పేజీల చొప్పున వార్తలు రాసేసిన మీడియా.. అతడు బతికి ఉన్నప్పుడు ధైర్యంగా అతడి దురాగతాల మీద ఎందుకు ఫోకస్ చేయలేదు? అన్న ప్రశ్న మదిలో మెదలక మానదు.

దీనికి సమాధానం అన్నట్లుగా తాజాగా బయటకు వచ్చిన సమాచారం చెప్పకనే చెప్పేస్తుంది. తాను చేసే అరాచకాలు బయటకు రాకుండా ఉండేందుకు.. అతడెంత పకడ్బందీగా ప్లాన్ చేయటమే కాదు.. అందుకోసం ఎంత భారీగా డబ్బులు వెదజల్లే వాడో చూస్తే షాక్ కుగురి కావాల్సిందే. గడిచిన ఆరు నెలల వ్యవధిలో పోలీసులు.. రాజకీయ నాయకులు.. మీడియాకు చెందిన వారికి దాదాపు రూ.80 కోట్ల వరకూ డబ్బు పంచినట్లుగా లెక్కలు బయటకు వస్తున్నాయి. ఇంత భారీ ఎత్తున లంచాలతో వ్యవస్థల్ని కొనేసిన నయిం వ్యవహారం ఇప్పుడు పెను సంచలనంగా మారటమేకాదు.. అతగాడి వ్యవహారంలోకి లోతుగా వెళితే మరెన్ని కొత్త కొత్త అంశాలు బయటకు వస్తాయన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారుతోంది.

పోలీసు శాఖలో అత్యున్నత స్థాయిలో ఉన్న అధికారులు మొదలు.. కింది స్థాయి అధికారుల వరకూ భారీగా డబ్బు ముట్టచెప్పటం ద్వారా తాను కోరుకున్న పనిని ఇట్టే పూర్తి చేసుకోవమే కాదు.. ఎంతటి వారినైనా భయభ్రాంతులకు గురి చేసేలా చేయగలుగుతున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. తాజాగా నయింకు చెందిన డైరీని స్వాధీనం చేసుకున్న పోలీసు అధికారులకు అందులో.. డీఎస్పీ 1.. డీఎస్పీ 2.. ఎమ్మెల్యే 1.. ఎమ్మెల్యే 2.. మీడియా 1.. మీడియా 2 అంటూ రాసి ఉండటం.. పలు లావాదేవీల పైన కొన్ని ప్రాంతాలకు చెందిన పోలీసు.. మీడియాల వ్యక్తులకు సంబంధించిన వివరాలు రాసినట్లుగా చెబుతున్నారు.

వ్యవస్థలో కీలక భూమిక పోషించే వారిని తన గుప్పిట్లో పెట్టుకొని ఎంతగా చెలరేగిపోయారో నయిం వ్యహారాన్ని చూస్తే అర్థమవుతుంది. తాజా పరిణామాల నేపథ్యంలో నల్గొండ.. కరీంనగర్ జిల్లాల్లోని పలు మీడియా ప్రతినిధులపై పోలీసులు కన్నేసినట్లు చెబుతున్నారు. ఈ జిల్లాల్లోనే నయింకు అండగా నిలిచిన మీడియా ప్రతినిధులు సుమారు 65కు మించి ఉండొచ్చని చెబుతున్నారు. కేవలం ఆరు నెలల వ్యవధిలోనే రూ.80 కోట్ల లంచాలు ఇచ్చేసిన వైనం చూస్తే.. అతగాడి కార్యకలాపాల సైజు ఎంత భారీగా ఉంటుందన్నది అర్థం చేసుకోవచ్చు. ఒక కంపెనీ తరహాలో అతగాడి చెల్లింపులు ఉండే.. అతడి లావాదేవీలు ఎంత భారీగా ఉంటాయన్న విషయంపై మరింత లోతుగా అధ్యయనం చేస్తే కొత్త సంగతులు బయటకు వచ్చే అవకాశం ఉంది. లంచాల చెల్లింపులే రూ.80 కోట్లు ఉంటే.. దాంతో వచ్చే ఆదాయం మరెంత ఉంటుందన్నది లెక్క వేయటానికి అధికారులకు సైతం కాస్త సమయం పడుతుందేమో..?