Begin typing your search above and press return to search.

నయిం ఆస్తులతో పెద్ద ప్రాజెక్టే కట్టొచ్చట

By:  Tupaki Desk   |   9 Aug 2016 5:12 PM GMT
నయిం ఆస్తులతో పెద్ద ప్రాజెక్టే కట్టొచ్చట
X
గ్యాంగస్టర్ నయింను ఎన్ కౌంటర్లో పోలీసులు కాల్చి చంపిన సంగతి తెలిసిందే. ఎన్ కౌంటర్ అనంతరం.. నయిం బస చేసిన ఇంట్లో ఉన్న వారి నుంచి సేకరించిన సమాచారంతో పలుచోట్ల తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. తన నేర చరితతో వేలాది కోట్ల రూపాయిలు పోగేసినట్లుగా అంచనా వేస్తున్నారు. అల్కాపురి కాలనీలో ఉన్న నయిం చెల్లెలు ఇంట్లో సోదాలు నిర్వహించిన సమయంలో.. అక్కడ పట్టుబడిన నగదును లెక్కించేందుకు ఏకంగా క్యాష్ కౌంటింగ్ మెషీన్లను తీసుకెళ్లి మరీ లెక్కించినప్పుడే పలువురు ఆశ్చర్యానికి గురయ్యారు. ఎన్ కౌంటర్ ఘటన జరిగిన 24 గంటలు దాటిన తర్వాత కూడా.. నయిం ఆస్తుల్ని లెక్కేసేందుకు అధికారులు కిందామీదా పడుతుండటం గమనార్హం. ఆస్తుల మదింపు లెక్క ఒక కొలిక్కి రావటం లేదని.. మొత్తం ఆస్తి విలువ లెక్క తేల్చేందుకు మరికొన్ని రోజులు పడుతుందన్న మాట వినిపిస్తోంది.

తొలుత వెయ్యి కోట్ల ఆస్తులు ఉన్నట్లుగా ప్రచారం జరగ్గా.. తర్వాత ఆ మొత్తం రూ.2వేల కోట్లుగా వినిపించింది. అయితే.. అదేమీ కాదని రూ.5వేల కోట్లన్న మాట అధికార వర్గాల్లో వినిపించాయి. తాజాగా.. ఆ లెక్కలు ఒక మూలకు రావన్న చందంగా తాజా లెక్కలు వినిపిస్తున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం నయిం ఆస్తుల విలువ రూ.10వేల కోట్ల మేరకు ఉండొచ్చని చెబుతున్నారు. మరికొందరి అంచనా ప్రకారం.. మరికాస్త పెరిగినా ఆశ్చర్యం లేదని కూడా చెప్పటం గమనార్హం.

ఒక ప్రాజెక్టును కట్టేందుకు సరిపోయేంత ఆస్తుల్ని నయిం కూడబెట్టినట్లుగా తాజాగా లభిస్తున్న ఆస్తుల వివరాల్ని చూస్తుంటే అర్థం కాక మానదు. కోట్లాది రూపాయిల నగదు.. వజ్రాలు.. బంగారం.. ఆస్తులు.. భూమలు భారీగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటివరకూ బయటకు వచ్చిన ఆస్తుల వివరాల్ని చూస్తున్న అధికారులకు నోటి వెంట మాట రాని పరిస్థితి. నయిం ఇంత సంపన్నుడా? అని విస్మయం వ్యక్తమవుతోంది. నయిం ఎంత భారీగా ఆస్తులు కూడబెట్టిందీ ఇట్టే అర్థమవుతుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే భారీగా ఆస్తులే కాదు.. రివాల్వర్లతో పాటు 258 సెల్ ఫోన్లు అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

= కొండాపూర్‑లో ఒకే చోట 69 ఎకరాల భూమి ఉన్నట్లుగా తేలింది. దీని విలువే రూ.1000 కోట్లు ఉంటుందని అంచనా

= పుప్పాలగూడ.. మణికొండల్లో 40 చోట్ల ఖరీదైన ఫ్లాట్లు. వాటి విలువ రూ.వెయ్యి కోట్లు

= నల్గొండ జిల్లా భువనగిరి సమీపంలోని బొమ్మలరామరంలో 500 ఎకరాలు

= హైదరాబాద్ మహానగరంలో పదుల కొద్దీ ఫ్లాట్లు (వీటిల్లో పలు ఫ్లాట్లు బినామీ పేర్ల మీద ఉన్నట్లుగా తెలుస్తోంది)

= ఎయిర్ పోర్టు పరిసర ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో భూములు

= ఘట్ కేసర్.. రామంతపూర్.. గౌలిపుర.. అమీన్ పుర ప్రాంతాల్లో భూమి పత్రాలు

= సరూర్ నగర్ లోని ఎన్టీఆర్ నగర్ లో 1180 గజాల సైటు

= అత్తాపూర్ లో తొమ్మిది ఫ్లాట్లు.. షేక్ పేటలో సర్వే 87కు సంబంధించిన పత్రాలు.. జూబ్లీహిల్స్ లో 1365 గజాల స్థలం (కబ్జా చేసిందిగా చెబుతున్నారు)

= భువనగిరిలో 175 ఫ్లాట్ల డాక్యుమెంట్లు

= గుంటూరు జిల్లా చినకాకానిలో ల భూములు

= ఆడి.. హోండా సీఆర్వీ.. ఫోర్డ్ ఎండీవర్ కార్లు