Begin typing your search above and press return to search.

వైసీపీలో గుబులు రేపుతున్న గంగుల బ్రదర్స్

By:  Tupaki Desk   |   20 Dec 2022 4:59 AM GMT
వైసీపీలో గుబులు రేపుతున్న గంగుల బ్రదర్స్
X
గంగుల బ్రదర్స్ అంటే ఉమ్మడి కర్నూల్ జిల్లాలో ఫ్యామస్ పొలిటికల్ ఫ్యామిలీ. రాజకీయంగా వారు గట్టి నేతలు. దశాబ్దాల పాటు రాజకీయం, ఎంపీ, ఎమ్మెల్యే వంటి పదవులలో గెలుపు, తమకంటూ ప్రత్యేక వర్గం కలిగి ఉండడంతో అన్ని రాజకీయ పార్టీలు వారిని గౌరవిస్తాయి. ఇక చూస్తే గంగుల బ్రదర్స్ లో ప్రస్తుతం చీలిక వచ్చింది. గంగుల ప్రతాప్ రెడ్డి వేరు కుంపటి పెట్టేశారు. ఆయన గ్రేటర్ రాయలసీమ జెండాను ఎత్తుకున్నారు.

గ్రేటర్ రాయలసీమ నిర్మాత మాజీ మంత్రి దిగ్గజ నేత మైసూరారెడ్డి. ఆయన గ్రేటర్ రాయలసీమ అంటూ చాలా కాలంగా నినదిస్తున్నారు. దానికి రెస్పాన్స్ అయితే అపుడు రాలేదు కానీ ఇపుడు ఎన్నికలు ముంగిట్లో ఉండడం వల్ల పీక్ టైంలో అది పండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తాజాగా నంధ్యాలలో జై గ్రేటర్ రాయలసీమ ఆఫీసుని గంగుల ప్రతాపరెడ్డి నాయకత్వాన ప్రారంభించారు.

ఇది వైసీపీలో కొత్త ప్రకంపనలు పుట్టిస్తోంది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రులుగా ఉన్న మైసూరారెడ్డితో పాటు,ఏరాసు ప్రతాపరెడ్డి వంటి దిగ్గజ నేతలు హాజరయ్యారు. ఇక జై గ్రేటర్ రాయలసీమ అంటున్న గంగుల ప్రతాపరెడ్డికి నంద్యాల, ఆళ్ళగడ్డ నియోజకవర్గాలలో మంచి పట్టుంది. ఆయనకు జనంలో మంచి పలుకుబడి ఉంది. ఆయన ఫ్లాష్ బ్యాక్ చూస్తే ఆళ్లగడ్డ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక 1991 టైం లో నంద్యాల లోక్ సభ ఎంపీగా గెలిచి తరువాత పీవీ నరసింహారావు కోసం ఆ సీటుని త్యాగం చేశారు. దానికి బదులుగా ఆయన్ని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభకు పంపించింది కూడా.

అలా దశాబ్దాల తరబడి నంద్యాల పార్లమెంట్ పరిధిలో రాజకీయ కార్యకలాపాలు నిర్వహించిన నాయకుడు గంగుల ప్రతాపరెడ్డి. ఈ రోజుకీ ఆయనకు జనంలో ఆదరణ అయితే తగ్గలేదు. అయితే గంగుల ప్రతాపరెడ్డికి ఆయన తమ్ముడు గంగుల ప్రభాకరరెడ్డికి పడడంలేదని టాక్. గత ఎన్నికల్లో గంగుల ప్రతాపరెడ్డి తన తమ్ముడు ప్రభాకరరెడ్డి కుమారుడు బ్రిజేంద్రరెడ్డి గెలుపు కోసం ఆళ్ళగడ్డలో పనిచేశారు. గెలిపించుకున్నారు.

కానీ ఇపుడు తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అంటున్నారు ప్రతాపరెడ్డి. పైగా ఆయనకు కూడా పుత్ర వాత్సల్యం పెరిగింది. తన కుమారుడు ఫణి కృష్ణారెడ్డిని రాజకీయంగా పైకి తీసుకుని రావాలని చూస్తున్నారు. ఇక్కడ చూస్తే ఫణి కృష్ణారెడ్డి కడప జిల్లాకు చెందిన కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి అల్లుడు. వీరశివారెడ్డి ప్రస్తుతం టీడీపీ వైపు ఉన్నారు. దాంతో అల్లుడు కూడా తన రాజకీయం ఏంటో తేల్చుకోవాలని చూస్తున్నారని టాక్.

ఈ పరిణామాల నేపధ్యంలోనే తనయుడి రాజకీయ జీవితాన్ని చక్కబెట్టేందుకు గంగుల ప్రతాపరెడ్డి రంగంలోకి దిగారని అంటున్నారు. ఈ నేపధ్యంలోనే జై గ్రేటర్ రాయలసీమ అంటూ ప్రతాప్ రెడ్డి కొత్త నినాదాన్ని అందుకున్నారని అంటున్నారు. ఈ ఆఫీస్ ప్రారంభానికి ఆళ్ళగడ్డ నుంచి పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు అటెండ్ అయ్యారట. అలాగే నధ్యాల నుంచి కూడా కేలక నేతలు వెళ్ళారని అంటున్నారు. ఈ రెండు చోట్ల వైసీపీ బలంగా ఉంది. కానీ గంగుల ప్రతాపరెడ్డి వేరు కుంపటి పెడితే మాత్రం వైసీపీకి నంద్యాల ఆళ్ళగడ్డలలో దెబ్బపడుతుంది అని అంటున్నారు.

ఇక గంగుల ప్రభాకరరెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చిన జగన్ ప్రతాప్ రెడ్డికి ఖాళీగా ఉంచడం వల్లనే ఇలా జరిగింది అని అంటున్నారు. మరి ఈ రాజకీయాన్ని జగన్ ఎలా సెట్ చేస్తారో చూడాలి. గంగుల ఫ్యామిలీలో చిచ్చు చివరికి వైసీపీలో గుబులు పెంచుతోంది అని అంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.