Begin typing your search above and press return to search.

బాబు ఇంటివ‌ద్ద సూసైడ్ అటెంప్ట్‌

By:  Tupaki Desk   |   8 Sep 2017 7:22 AM GMT
బాబు ఇంటివ‌ద్ద సూసైడ్ అటెంప్ట్‌
X
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప‌రువు ప‌లుచ‌న అయ్యే ప‌రిణామం ఇది. స‌మ‌స్య ప‌రిష్కారం కోసం ఏకంగా ఒక వ్య‌క్తి సుదూరం నుంచి వ‌చ్చి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నివాసం దగ్గర ఆత్మాహత్యాయత్నం చేయ‌డమే క‌ల‌క‌లం రేగే సంఘ‌ట‌న అయితే...అందులోనూ సాక్షాత్తు చంద్ర‌బాబు మంత్రి వ‌ర్గ స‌హ‌చ‌రుడు వియ్యంకుడి ఘ‌న‌కార్యం వ‌ల్ల ఆయ‌న ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం మ‌రో కార‌ణం!! వెర‌సి ప్ర‌జ‌లే దేవుళ్లు అనే పార్టీ ర‌థ‌సార‌థిగా ప్ర‌జ‌ల సొమ్మును నొక్కేసిన వ్య‌క్తి విష‌యంలో బాబు స‌ర్కారు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరువ‌ల్ల ఓ వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య చేసుకోవాల్సి వ‌చ్చింది అని విమ‌ర్శ‌కుల నింద‌లు భ‌రించాల్సి వ‌స్తోంది బాబు స‌ర్కారు.

ఇంత‌కూ విష‌యం ఏమిటంటే...అమ‌రావ‌తిలో సీఎం చంద్ర‌బాబును క‌లిసేందుకు కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన శ్రీనివాస్‌ రెడ్డి అనే వ్య‌క్తి ప‌దిరోజులుగా ప్ర‌యత్నం చేస్తున్న‌ప్ప‌టికీ ఫ‌లితం లేదు. తాజాగా ఈ రోజు సైతం సీఎం చంద్ర‌బాబును ఆయ‌న నివాసంలో కలిసేందుకు శ్రీ‌నివాస్‌ రెడ్డి వచ్చాడు. అయితే ప‌ది రోజుల వ‌లే ఈ రోజు సైతం అపాయింట్‌ మెంట్ దొర‌క్క‌పోవ‌డంతో...సీఎం నివాసం ఎదుట బలవన్మరణానికి యత్నించాడు. ఇది గుర్తించిన పోలీసులు అతన్ని అడ్డుకొని అతని వద్ద నుంచి పురుగుల మందు డబ్బాను స్వాధీనం చేసుకున్నారు. ఈ ప‌రిణామం ఒక్క‌సారిగా క‌ల‌క‌లం రేపింది. అస‌లేమైంద‌ని మీడియా ఆరాతీసేందుకు ప్ర‌య‌త్నించ‌గా శ్రీనివాస్‌ రెడ్డి త‌న ఆవేద‌న‌ను పంచుకున్నారు.

ఏపీ మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డి వియ్యంకుడు కేశవరెడ్డి మోసం చేసిన జాబితాలో తాను ఉన్న‌ట్లు వాపోయారు. కేశ‌వ‌రెడ్డి విద్యాసంస్థలో రూ.5 లక్షలు పెట్టుబడి పెట్టానని అయితే ఇప్ప‌టికీ ఆ సొమ్ములు తిరిగి రాలేద‌ని, ఎప్పుడు వ‌స్తాయో తెలియ‌ని ప‌రిస్థితి ఉంద‌ని వాపోయారు. త‌న‌ ఇద్దరు పిల్లలు గుండెజబ్బుతో బాధపడుతున్నారని మీడియా ముందు కంటతడిపెట్టారు. తన కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని ఆయన వేడుకున్నాడు.కేశవరెడ్డికి అప్పుగా ఇచ్చిన రూ. 5 లక్షలను ఇప్పిస్తే.. వాటితో పిల్లలకు చికిత్స చేయించుకుంటానని అతడు వేడుకుంటున్నాడు. కాగా, ఆత్మహత్యాయత్నం చేసిన శ్రీనివాసరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని తాడేపల్లి పోలీస్‌ స్టేషన్‌ కు తీసుకెళ్లారు.

కాగా, ఆక‌ర్ష‌ణీయమైన ఫ‌లితాల ఆశ చూపించి పెద్ద ఎత్తు పెట్టుబ‌డులు సేక‌రించిన కేశ‌వ‌రెడ్డి అనంతరం బిచాణా ఎత్తేశాడు. ఈ విష‌యంలో బాధితుల‌కు న్యాయం చేయ‌డంపై ఏపీ ప్ర‌భుత్వం వైఫ‌ల్యం చెందింద‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. సుదీర్ఘకాలంగా బాధితులు త‌మ సొమ్ము కోసం ఎదురుచూస్తున్నారు. అందులో తాజాగా సీఎం చంద్ర‌బాబు ఇంటి వ‌ద్ద ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసుకున్న‌ శ్రీ‌నివాస్‌ రెడ్డి ఒక‌రు.