Begin typing your search above and press return to search.

విరాట్ కోహ్లీ ప్రవర్తన పై గంగూలీ సంచలన వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   19 Dec 2021 10:32 AM GMT
విరాట్ కోహ్లీ ప్రవర్తన పై గంగూలీ సంచలన వ్యాఖ్యలు
X
బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ , టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి మధ్య వివాదం ముదురుతోంది. వన్డే కెప్టెన్సీ విషయంలో ఉన్న ఫళంగా కోహ్లీని పక్కనపెట్టి రోహిత్ శర్మకు పగ్గాలు ఇవ్వడం వివాదాస్పదమైంది. ఈ విషయంలో కోహ్లీ అభిప్రాయం తీసుకోలేదనే ఆరోపణలు వచ్చాయి. కానీ తాజాగా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళుతున్న సందర్భంగా విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ప్రెస్ కాన్ఫరెన్స్ లో టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన సంచలన వ్యాఖ్యలు బీసీసీఐని, గంగూలీని ఇరుకునపెట్టారు. వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడానికి ముందు బీసీసీఐ అధికారులు తనతో ఎలాంటి ముందస్తు చర్చలు జరపలేదని పేర్కొన్నాడు.

కోహ్లీ చేసిన వ్యాఖ్యలను బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ కొట్టిపారేసింది. వన్డే ఫార్మాట్ నాయకత్వ మార్పునకు సంబంధించి సెలక్షన్ కమిటీ చైర్మన్ చేతన్ శర్మ ముందుగానే కోహ్లీతో చర్చించాడని వెల్లడించింది. ‘విరాట్ కోహ్లీ ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండాల్సింది కాదు.. టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని ప్రకటించిన సమయంలోనే అతడితో చర్చలు జరిపాం. మా ఆలోచనతో ఏకీభవించిన కోహ్లీ.. టీ20 పగ్గాలను వదులుకునేందుకు సిద్ధపడ్డారు. దీంతో పరిమిత ఓవర్ల క్రికెట్లో రెండు ఫార్మాట్లకు ఇద్దరు కెప్టెన్లు ఉంటే.. జట్టులో సమన్వయం లోపిస్తుందని బీసీసీఐ భావించింది. దీంతో వన్డే కెప్టెన్సీ నుంచి కూడా కోహ్లీని తప్పించాలని నిర్ణయించింది. ఈ విషయంపై సెలక్షన్ కమిటీ చైర్మన్ చేతన్ శర్మతో కోహ్లీ ముందుగానే చర్చించాడు’ అని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ తెలిపాయి.

గంగూలీ కూడా టీమిండియా వన్డే కెప్టెన్సీ మార్పు గురించి రెండు రోజుల ముందే కోహ్లీకి సమాచారం ఇచ్చినట్లు పేర్కొన్న విషయం తెలిసిందే.. కోహ్లీ వ్యాఖ్యలపై ఎటువంటి ప్రకటన ఇవ్వకుండా బీసీసీఐనే అంతా చూసుకుంటుందని చెప్పాడు. కానీ కోహ్లీ వైఖరిపై ప్రస్తుతం గంగూలీ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

బీసీసీఐకి, సౌరవ్ గంగూలీకి వ్యతిరేకంగా విరాట్ కోహ్లీ మాట్లాడడంపై బోర్డు పెద్దలు గుర్రుగా ఉన్నారు. టీమిండియాకు కెప్టెన్ అయ్యిండి ఇలా పరిణితి లేకుండా బహిరంగంగా లుకలుకలు బయటపెట్టడంపై కోహ్లీపై చర్యలు తీసుకునేందుకు బోర్డు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. బోర్డు పరిధిలోనే ఉండాల్సిన విషయాలను ఎందుకు బయటకు మాట్లాడాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలని కోహ్లీకి షోకాజ్ నోటీ జారీ చేసినట్లు తెలుస్తోంది.

కోహ్లీ తాజా వ్యాఖ్యలపై బోర్డులో చాలా అసంతృప్తి ఉందని.. గంగూలీ స్వయంగా చాలా కోపంగా ఉన్నాడని నివేదికలు వచ్చాయి. అయితే టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు ఈ వివాదాన్ని కొనసాగించడానికి బీసీసీఐ ఇష్టపడడం లేదు. ఏదిఏమైనా కోహ్లీ-బీసీసీఐ మధ్య దూరం పెరిగినట్లే కనిపిస్తున్నది. దక్షిణాఫ్రికా పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత కోహ్లీ వ్యాఖ్యలపై తప్పకుండా వివరణ అడుగుతానని బీసీసీఐ అధికారి తెలిపారు.