Begin typing your search above and press return to search.

లోకేష్ దెబ్బకు ఆ యువనేత ఫ్యూచరేంటో... ?

By:  Tupaki Desk   |   29 Dec 2021 11:30 PM GMT
లోకేష్ దెబ్బకు ఆ యువనేత ఫ్యూచరేంటో... ?
X
తెలుగుదేశం పార్టీలో చినబాబు లోకేష్ కత్తికి ఎదురే లేదు. ఆయన తాత ఎన్టీయార్ స్థాపించిన టీడీపీకి సిసలైన వారసుడు. తండ్రి చంద్రబాబు చమటోడ్చి పెంచి పెద్దది చేసిన పార్టీకి కొత్త పెత్తందారు. భావి ముఖ్యమంత్రి ట్యాగ్ కూడా ఉందాయే. మరి ఆయన కోరుకుంటే తీరనిది పార్టీలో ఉంటుందా. ఇక కన్నేసిన సీటు ఆయన్ని కాదని పోతుందా. లోకేష్ ఇపుడు మరోసారి మంగళగిరి మీద మనసుపడుతున్నారు.

ఓడిన చోటనే గెలిచి విజయఢంకా మోగించాలన్నది లోకేష్ వారి డ్రీమ్. దానికి అనేక కారణాలు కూడా కలసివస్తాయని ఆయన భావిస్తున్నారు. మంగళగిరి నుంచి ఆర్కే అనబడే వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మీద జనాల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందని చినబాబు లెక్క కట్టారు. ఇక ఆర్కే 2014 నుంచి ఇప్పటికి రెండు తడవలుగా గెలిచి ఉన్నారు. మరో వైపు అమరావతి రాజధాని ఇష్యూ అన్నది ఈసారి కచ్చితంగా వైసీపీకి యాంటీ అవుతుంది అన్నది లోకేష్ అంచనా.

దాంతో పాటు ఆర్కేకు మంత్రి పదవి ఇస్తామని చెప్పి లోకేష్ మీద గెలిపించిన జగన్ ఆ పదవి ఇవ్వలేదు. దాంతో ఆర్కే తో పాటు ఆయన క్యాడర్ కూడా దిగాలుగా ఉన్నారుట. ఇక వైసీపీ ఏలుబడిలో అభివృద్ధి లేకపోవడం మీద కూడా జనంలో చర్చ ఉందని,అది మైనస్ అవుతుందని కూడా లోకేష్ భావిస్తున్నారుట. మొత్తానికి చూస్తే లోకేష్ అన్నీ చూసుకుని మరీ మంగళగిరిలో తిరిగి పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు.

అంతా బాగానే ఉంది అనుకున్న టైమ్ లో సొంత పార్టీలోనే దీని మీద చర్చ వస్తోంది. ఇక్కడ నుంచి యువ నేత, టీడీపీ ఇంచార్జి అయిన గంజి చిరంజీవి 2024లో పోటీ చేయడానికి అంతా సిద్ధం చేసుకున్నారట. 2014లో చిరంజీవి కేవలం 12 ఓట్ల తేడాతోనే ఆకే మీద ఓడిపోయారు. ఇక 2019 నాటికి లోకేష్ పోటీకి దిగడంతో చిరంజీవి తప్పుకున్నారు. అయితే లోకేష్ ఓటమి చెందడంతో ఆయన ఈ వైపునకు రారు, ఇక తనదే సీటు అని సంబరపడి మరీ అంతటా కలియతిరుగుతున్నారుట.

ఈ నేపధ్యంలో సడెన్ గా చినబాబు మనసు మార్చుకుని మంగళగిరి నాదే అనడంతో చిరంజీవి తెగ ఫీల్ అవుతున్నారట. నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో ఉన్న చేనేత సామాజికవర్గానికి చెందిన చిరంజీవి ఈసారి తనదే విజయం అనుకుంటున్నారు. మరి ఆయన్ని కాదని లోకేష్ నిలబడితే ఆ కులస్థులు ఎంతవరకూ సహకరిస్తారు అన్నది కూడా ఇక్కడ పాయింట్. మరో వైపు వైసీపీ కూడా ఈసారి ప్లాన్ మార్చేసేలా ఉంది.

వచ్చే ఎన్నికల్లో టికెట్ ని మాజీ మంత్రి, తాజాగా ఎమ్మెల్సీ అయిన మురుగుడు హనుమంతరావుకు ఇవ్వాలనుకుంటోంది.చేనేత సామాజికవర్గానికి చెందిన ఆయనతోనే లోకేష్ కి చెక్ చెప్పాలన్నది జగన్ ప్లాన్ గా ఉంది. మరి టికెట్ దక్కని చిరంజీవిని మంచి చేసుకునేందుకు ఆయన్ని ప్రకాశం జిల్లా చీరాల వెళ్ళి పోటీ చేయమని లోకేష్ సూచించారని టాక్. అయితే అక్కడ చూస్తే పెద్దగా కలసివచ్చే పరిస్థితులు లేవు అని చిరంజీవి అనుచరులు భావిస్తున్నారుట. మొత్తానికి లోకేష్ మంగళగిరి ఆశలతో యువ నేత చిరంజీవి దెబ్బ అయిపోయారని తమ్ముళ్ళ టాక్. మరి ఎన్నికల వేళకు ఏమైనా మార్పు ఉంటే తప్ప లోకేష్ పోటీ చేయడం ష్యూర్ అంటున్నారు కాబట్టి చిరంజీవికి హ్యాండ్ తప్పదేమో.