Begin typing your search above and press return to search.

సమావేశానికి గంటా డుమ్మా ?

By:  Tupaki Desk   |   18 Feb 2022 4:31 AM GMT
సమావేశానికి గంటా డుమ్మా ?
X
చాలాకాలంగా స్తబ్దుగా ఉన్న ఎంఎల్ఏలు, నియోజకవర్గాల ఇన్ చార్జీల పై స్పష్టత కోసమే చంద్రబాబునాయుడు సమావేశం పెట్టుకున్నారు. విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లోని పార్టీ ఎంఎల్ఏ లు, నియోజకవర్గాల ఇన్ చార్జీలతో శుక్రవారం పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ సమావేశానికి రావాలంటూ ఎంఎల్ఏలు, ఇన్ చార్జీలకు కబురంపారు.

పార్టీ వర్గాల ప్రకారం ముఖ్యంగా ఇద్దరు ఎంఎల్ఏలు గంటా శ్రీనివాసరావు, గణబాబుల కోసమే సమావేశం నిర్వహించబోతున్నారట. ఎందుకంటే విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి గెలిచిన గంటా అసలు పార్టీలో ఉన్నారో లేదో కూడా తెలీటంలేదు. వైసీపీలో చేరబోతున్నారని కాదు కాదు జనసేనలో చేరుతున్నారని అదీ కాదు బీజేపీలోకి వెళిపోతున్నారంటు రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలోనే ఈమధ్యనే లోకేష్ పుట్టినరోజు కార్యక్రమంలో పాల్గొన్నారు.

అంతకుముందు చాలా కాలంగా పార్టీ కార్యక్రమాల్లో గంటా పాల్గొనటం లేదు. దాంతో ఆయనపై నాయకత్వంలో అయోమయం పెరిగిపోతోంది. పార్టీ కార్యక్రమాల్లోనే కాదు చంద్రబాబుతో భేటీల్లో కూడా కనబడటం లేదు. ఇక వైజాగ్ పశ్చిమ ఎంఎల్ఏ గణబాబు కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈయన కూడా తొందరలోనే వైసీపీలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వీళ్ళ సంగతి పక్కనపెట్టేస్తే చాలామంది ఇన్చార్జీలు యాక్టివ్ గా లేరు.

సో, గంటా, గణబాబుల కథేంటో తేల్చేందుకే చంద్రబాబు సమావేశం పెట్టినట్లున్నారు. అయితే సమావేశానికి రాలేనని గంటా చెప్పేశారట. ముందుగా ఫిక్సయిపోయిన కార్యక్రమాలతో బిజీగా ఉన్న కారణంగా మరోసారి వచ్చి కలుస్తానని సమాచారమిచ్చారట. ఇక గణబాబు సంగతిపై క్లారిటి లేదు. మొత్తం మీద గంటా విషయంపై పార్టీలో అయోమయమైతే కంటిన్యూ అవుతోందన్నది వాస్తవం. మరెప్పటికి క్లారిటి వస్తుందో ?