Begin typing your search above and press return to search.

గంటా జనసేనలోకేనా.. పవన్ ఏమంటున్నారు...?

By:  Tupaki Desk   |   12 Oct 2022 8:06 AM GMT
గంటా జనసేనలోకేనా.. పవన్ ఏమంటున్నారు...?
X
విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి, తెలుగుదేశం పాటీ ఎమ్మెల్యే అయిన గంటా శ్రీనివాసరావు మరోసారి జెండా మర్చేయడానికి రెడీ అవుతున్నారా అంటే చర్చ మాత్రం ఆ వైపుగానే సాగుతోంది అంటున్నారు. ఆయన తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్ళి మరీ ఆయన్ని కలసి పుష్ప గుచ్చం ఇచ్చారు. దాంతో మళ్లీ రాజకీయ వార్తల్లోకి గంటా వచ్చారు. ఆయన జనసేన వైపు పూర్తిగా టర్న్ అవుతున్నారు అని కూడా ప్రచారం పెద్ద ఎత్తున మొదలైపోయింది.

దీనికి కారణం ప్రజారాజ్యంలో కూడా గంటా అప్పట్లో కీలకమైన పాత్ర పోషించారు. చిరంజీవికి ఆయన బాగా సన్నిహితుడు. కాంగ్రెస్ లో చిరంజీవి ప్రజారాజ్యాన్ని విలీనం చేసినపుడు గంటా లాంటి వారి సలహా సూచనలు కూడా ఉన్నాయని అంటారు. ఫలితంగా ఆయనకు రాష్ట్రంలో మంత్రి పదవి దక్కింది అని కూడా ప్రచారంలో ఉన్న విషయం.

గంటా విభజన తరువాత టీడీపీలోకి వచ్చి అక్కడ గెలిచి మంత్రి అయ్యారు. అయిదేళ్ల పాటు ఆ మంత్రి పదవిని ఆయన ఎంజాయ్ చేశాక 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడింది. గంటా గెలిచినా కూడా ఫుల్ సైలెంట్ అయ్యారు. ఇపుడు చూస్తే ఆయన మళ్లీ కొత్త నియోజకవర్గం, కొత్త పార్టీ అని అడుగులు వేస్తున్నారు అని అంటున్నారు.

ఆ కొత్త పార్టీ జనసేన అని గుసగుసలు వినిపిస్తున్నాయి. గంటాను జనసేనలోకి తీసుకోవడానికి తాను సుముఖంగా లేనని విశాఖ నడిబొడ్డునే చాలా కాలం క్రితం పవన్ కళ్యాణ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. తనకు గంటా గురించి బాగా తెలుసు అని ఆయన మీద వ్యక్తిగతంగా తమకు ఎలాంటి కోపం లేదని, కానీ ఆయన రాజకీయాలకు తనకు అసలు పొంతన కుదరదని పవన్ తేల్చేశారు. దాంతో గంటా జనసేన వైపు వెళ్లడం అన్నడి డైలామలో పడింది.

ఇపుడు గంటా పనిగట్టుకుని మరీ చిరంజీవి దగ్గరకు వెళ్లారు అంటే తమ్ముడి పార్టీలో చేర్చుకునేలా రికమండేషన్ చేయమని కోరేందుకే అని అంటున్నారు. చిరంజీవి కూడా జనసేన అధికారంలోకి రావాలని కోరుకుంటూ ఈ మధ్య ప్రకటన చేశారు. పవన్ కి తన అండదండలు ఉంటాయని ఆయన చెప్పుకొచ్చారు. దాంతో చిరంజీవి ద్వారా జనసేనలో చేరాలని గంటా కొత్త రూట్ వేసుకుంటున్నారు అని అంటున్నారు.

అయితే పవన్ గతంలో అన్న మాటలను బట్టి చూస్తే గంటాను చేర్చుకోరనే అని చెబుతున్నారు. పైగా ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయించిన వారిలో గంటా కూడా ఉన్నారని పవన్ గట్టిగా అభిప్రాయపడుతున్నారని అంటున్నారు. అయితే ఇది రాజకీయం. పైగా నిన్నటి మాట నేడు ఉండదు, ఎవరి అవసరాలు వారివి ఇక్కడ. అందువల్ల పవన్ గతంలో అన్న మాటలకు ఇపుడు కట్టుబడి ఉంటారా అన్నది కూడా ఆలోచించాల్సిన విషయమే అంటున్నారు.

ఇక జనసేనకు వచ్చే ఎన్నికలు చాలా కీలకం. ఏపీలో పొలిటికల్ గా కాళ్ళూనుకొనాలంటే గంటా లాంటి సీనియర్ల అవసరం చాలా ఉంది. గంటా కనుక జనసేనలోకి ఎంట్రీ ఇస్తే ఉత్తరాంధ్రా నుంచి ఉభయగోదావరి జిల్లాల దాకా ఆయనకు ఉన్న పూర్తి పరిచయాలు జనసేనకు బాగా ప్లస్ అవుతాయని అంటున్నారు. పైగా అర్ధం బలం, అంగబలం పూర్తిగా ఉన్న గంటా రాకతో జనసేనలో మరింతమంది సీనియర్లు చేరే అవకాశం ఉంటుంది అని లెక్కలేస్తున్నారు. ఇదిలా ఉంటే చిరంజీవి కూడా ఈ విషయంలో గంటాను చేర్చుకోవాలనే తమ్ముడికి చెబుతారా అన్న దాని మీద చర్చ ఒకటి సాగుతోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.