Begin typing your search above and press return to search.

బాబూ.... నారాయ‌ణ ఇంకా ఫైనే క‌ట్టలేద‌ట‌!

By:  Tupaki Desk   |   14 Dec 2017 9:37 AM GMT
బాబూ.... నారాయ‌ణ ఇంకా ఫైనే క‌ట్టలేద‌ట‌!
X
న‌వ్యాంధ్ర‌లో ఇప్పుడు ఓ ప‌ది రోజుల క్రితం జ‌నాలు మ‌రిచిపోయిన ఓ ఆస‌క్తిక‌ర విష‌యాన్ని ఏపీ కేబినెట్‌ లోని కీల‌క మంత్రిగా ఉన్న మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాస‌రావు స్వ‌యంగా బ‌య‌ట‌పెట్టారు. అది కూడా ఎవ‌రో బ‌య‌టి వ్య‌క్తికి సంబందించిన వివాదాన్ని మంత్రి బ‌య‌ట‌పెట్టార‌నుకుంటే త‌ప్పులో కాలేసిన‌ట్లే. అంతేనా.. స‌ద‌రు వ్య‌క్తి గంటాకు వియ్యంకుడు కూడా. వియ్యంకుడి వివాదాన్నే గంటా బ‌య‌ట‌కు తీశార‌న‌గానే... విష‌యం అర్థ‌మైపోయింది క‌దా. ఆ వ్య‌క్తి ఎవ‌రో కాదు... గంటాకు వియ్యంకుడు - ఏపీ కేబినెట్‌ లో గంటా కంటే కూడా కీల‌క మంత్రిగా ఉన్న పొంగూరు నారాయ‌ణ‌. అయినా నారాయ‌ణ‌పై వివాద‌మేముందంటే... నేరుగా నారాయ‌ణ కాదుగానీ... నారాయ‌ణ విత్తు నాటి నీరు పోసి - ఎరువు వేసి మ‌హా వృక్షంగా చేసిన నారాయ‌ణ విద్యా సంస్థ‌ల‌కు సంబంధించిన వివాద‌మ‌ది.

ఇటీవ‌లి కాలంలో నారాయ‌ణ విద్యా సంస్థ‌ల్లో విద్య‌న‌భ్య‌సిస్తున్న ప‌లువురు విద్యార్థులు... స‌ద‌రు విద్యా సంస్థ‌ల‌కు చెందిన సిబ్బంది పెడుతున్న ఒత్తిడి త‌ట్టుకోలేక ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవ‌ల కాలంలో న‌మోదైన విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌ల్లో... మెజారిటీ ఘ‌ట‌న‌లు నారాయ‌ణ విద్యా సంస్థ‌ల్లో చోటుచేసుకున్న‌వే కావ‌డం గ‌మ‌నార్హం. ఓ మంత్రి కుటుంబం ఆధ్వ‌ర్యంలోని విద్యా సంస్థ‌ల్లో జ‌రుగుతున్న ఆత్మ‌హ‌త్య‌ల‌పై చ‌ర్య‌లు తీసుకోరా? అంటూ విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళ‌న‌ల‌కు దిగ‌డంతో ఏపీ స‌ర్కారు చ‌ర్య‌ల‌కు శ్రీ‌కారం చుట్ట‌క త‌ప్ప‌లేదు. అయితే ఆ చ‌ర్య‌లు తీసుకోవాల్సిన శాఖ‌... గంటా నిర్వ‌హిస్తున్న మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి మంత్రిత్వ శాఖే కావ‌డంతో కొన్నాళ్ల పాటు హైడ్రామా న‌డిచినా... ఓ క‌మిటీ చేత విచార‌ణ చేయించిన చంద్రబాబు స‌ర్కారు... విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌ల‌కు నారాయ‌ణ విద్యా సంస్థ‌ల‌ను బాధ్యుల‌ను చేస్తూ రూ.50 ల‌క్ష‌ల జ‌రిమానా విధించారు. దీనికి సంబంధించిన ప్ర‌క‌ట‌న‌ను స్వ‌యంగా గంటానే చేయాల్సి వ‌చ్చింది కూడా.

అయితే నారాయ‌ణ విద్యా సంస్థ‌ల‌కు ఫైన్ వేశామ‌ని - ఇక‌పై ఆ సంస్థ‌ల్లో విద్యార్థుల మ‌ర‌ణాల‌కు దాదాపుగా చెక్ ప‌డిన‌ట్టేన‌న్న వాద‌న‌ను గంటా వినిపించారు. ఆ త‌ర్వాత దానిని అంతా మ‌రిచిపోయార‌నే చెప్పాలి. అయితే అనుకోని ప‌రిణామాల నేప‌థ్యంలో మొన్న తిరుప‌తిలోని నారాయ‌ణ విద్యా సంస్థ‌ల్లో చ‌దువుతున్న ఓ విద్యార్థి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. దీంతో మ‌రోమారు గంటా మీడియా ముందుకు రాక త‌ప్ప‌లేదు. అయితే ఈ సారి త‌న వియ్యంకుడిని మ‌రింత‌గా ఇబ్బంది పెట్టేలా గంటా మాట్లాడక త‌ప్ప‌లేద‌ట‌. నిన్న మీడియా ముందుకు వ‌చ్చిన గంటా... త‌న వియ్యంకుడు అయిన నారాయ‌ణ కుటుంబానికి చెందిన నారాయ‌ణ విద్యా సంస్థ‌ల‌పై కాస్తంత ఘాటు కామెంట్లు చేశారు. ఇప్ప‌టికే నారాయ‌ణ విద్యా సంస్థ‌ల్లో జ‌రిగిన పిల్ల‌ల ఆత్మ‌హ‌త్య‌ల‌కు సంబంధించి విచార‌ణ జ‌రిపి... రూ.50 ల‌క్ష‌ల మేర జరిమానా విధించామ‌ని ఆయ‌న తెలిపారు.

అంతేకాకుండా... తాను వేసిన ఫైన్‌ ను... త‌న వియ్యంకుడు ఇంకా క‌ట్ట‌నే లేద‌న్న చేదు వాస్త‌వాన్ని కూడా గంటా మీడియా ముందు ఒప్పుకోక త‌ప్ప‌లేదు. ఓ బాధ్య‌తాయుతమైన మంత్రి ప‌ద‌విలో ఉన్న నారాయ‌ణ‌... తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కేబినెట్ వేసిన ఫైన్‌ ను ప్ర‌భుత్వానికి క‌ట్ట‌లేదన్న విష‌యం నిజంగా క్ష‌మించ‌రానిదే. అంతేనా క‌నీసం స‌ద‌రు ఫైన్‌ ను ఖ‌రారు చేసిన వ్య‌క్తి త‌న వియ్యంకుడు అన్న విష‌యాన్ని కూడా నారాయ‌ణ మ‌రిచిన‌ట్టున్నారు. గంటా వేసిన ఫైన్‌ ను తాను చెల్లించ‌కుంటే... త‌న‌తో పాటు త‌న వియ్యంకుడికి కూడా చెడ్డ పేరు వ‌స్తుంద‌న్న విష‌యాన్ని నారాయ‌ణ ఎలా మ‌రిచిపోయార‌న్న కొత్త వాద‌న వినిపిస్తోంది. ఈ వ్య‌వ‌హారం ఇప్ప‌టికిప్పుడు వియ్యంకుల మ‌ధ్య కోల్డ్ వార్ తెర తీయ‌కున్నా... నారాయ‌ణ చేస్తున్న జాప్యంతో అది నేడో - రేపో పెద్ద విష‌యంగానే మారిపోయినా ఆశ్య‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేద‌న్న వాద‌న వినిపిస్తోంది.