Begin typing your search above and press return to search.

గంటా..ఇంకా పార్టీపై అల‌క‌వీడ‌లేదంట!

By:  Tupaki Desk   |   3 July 2018 5:14 AM GMT
గంటా..ఇంకా పార్టీపై అల‌క‌వీడ‌లేదంట!
X
ఓ వైపు ఎన్నిక‌ల శంఖారావం పూరిస్తూ..ఓట్లు - సీట్ల‌పై లెక్క‌లు వేస్తూ ముందుకు సాగుతున్న ఏపీ ముఖ్య‌మంత్రి - తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడుకు సొంత పార్టీ నుంచే షాకుల ప‌రంప‌ర ఎదుర‌వుతోంది. స‌మ‌స్య‌కు ప‌రిష్కారం దొరికింద‌నే ద‌శ‌లోనే...తిరిగి అదే అస‌మ్మ‌తి బ‌య‌ట‌ప‌డుతుండ‌టంతో...అస‌లు పార్టీలో ఏం జ‌రుగుతోంద‌నే చ‌ర్చ‌ తెర‌మీద‌కు వ‌స్తోంది. ఇదంతా ఉత్త‌రాంధ్ర‌లో కీల‌క‌మైన విశాఖ జిల్లా గురించే. ఎందుకంటే జిల్లాకు చెందిన సీనియ‌ర్‌ మంత్రి గంటా శ్రీనివాసరావు పుట్టించిన సెగలు ఇంకా టీడీపీలో చల్లారలేదు. పైగా, త‌మ‌దైన శైలిలో గంటా పావులు క‌దుపుతుండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

ఓ మీడియాలో గంటాపై భీమిలి ప్రజల్లో వ్యతిరేకత ఉన్నట్లు సర్వే కథనాలు వండి వార్చడం - పార్టీలో కొంద‌రు నేత‌ల దూకుడుతో గంటా తీవ్ర మనస్తాపానికి గురయిన సంగ‌తి తెలిసిందే. ఈ క్రమంలోనే కేబినెట్‌ భేటీకి హాజరుకాకపోవడం - వెంటనే ఆయన్ను బుజ్జగించేందుకు ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప రావడం వంటి పరిణామాలు తెలిసినవే. ఆ త‌దుప‌రి ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ వచ్చిన సందర్భంగా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నా ఆయన ముభావంగానే కనిపించారు. అనంత‌రం కడపలో సీఎం రమేష్‌ ఉక్కు పరిశ్రమ కోసం చేపట్టిన దీక్షా శిబిరాన్ని సందర్శించిన గంటా ఆ త‌దుప‌రి కూడా విశాఖ జిల్లా టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పది రోజులుగా ఆయన జిల్లా టీడీపీకి సంబంధించిన కార్యక్రమాల్లో కనిపించలేదు. కేవలం ప్రభుత్వ కార్యక్రమాలకే పరిమితమవుతున్నారు. నగరంలో పార్టీ లేదా అధికారిక కార్యక్రమాలను ఆయనే దగ్గరుండి చూసుకునేవారు. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. మరో మంత్రి అయ్యన్నపాత్రుడు - ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆ బాధ్యతలను తీసుకోవడం గమనార్హం.

జిల్లా ఇన్‌ ఛార్జి మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అధ్యక్షతన జరిగిన జిల్లా టీడీపీ సమన్వయ కమిటీ సమావేశానికి గంటా హాజరు కాలేదు. ఆ సమావేశంలో నిర్ణయించిన రైల్వేజోన్‌ నిరసనకు సంబంధించిన స్థల పరిశీలన కోసం జ్ఞానాపురం రైల్వే గేటు వద్దకు సోమవారం మంత్రి అయ్యన్న పాత్రుడు - ఎమ్మెల్యే - అర్బన్‌ పార్టీ అధ్యక్షుడు వాసుపల్లి గణేష్‌ కుమార్‌ వెళ్లారు. నగరంలో ఉన్నప్పటికీ మంత్రి గంటా.. అదే సమయంలో ఏయూలో టెట్‌ ఫలితాలను విడుదల చేశారు. తర్వాత ఎయు హాస్టల్స్‌ ను పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనాలు చేశారు. టీడీపీకి సంబంధించిన కార్యక్రమాల్లో కనిపించకుండా కేవలం ప్రభుత్వ కార్యక్రమాలకే పరిమితమవుతుండ‌టం దేనికి సంకేతమన్న చ‌ర్చ స‌హ‌జంగానే జ‌రుగుతోంది. గంటా వైఖరితో టీడీపీ అధిష్టానం డైలమాలో పడినట్లు సమాచారం. ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేక.. ఆయన సంతృప్తిపర్చలేక ఇరకాటంలో పడింది. ప్రభుత్వ వ్యతిరేకత నుండి బయటపడేందుకు బీజేపీ - కేంద్రంపై నిరసనలను తీవ్రతరం చేస్తూ సెంటిమెంట్‌ ద్వారా ఎన్నికల్లో గట్టెక్కాలన్న వ్యూహరచనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈ వ్యవహారం తలనొప్పిలా మారిందన‌డంలో ఎలాంటి సందేహం లేద‌ని ప‌లువురు అంటున్నారు.