Begin typing your search above and press return to search.

విశాఖలో రాజధాని..మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన గంటా !

By:  Tupaki Desk   |   25 Dec 2019 7:31 AM GMT
విశాఖలో రాజధాని..మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన గంటా !
X
ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం ముదిరిపోతోంది. అమరావతితో పాటుగా - కర్నూలులో హైకోర్టు - విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ రాజధాని అని ప్రభుత్వం ప్రకటించడంతో ఆ ప్రాంత ప్రజలు స్వాగతిస్తున్నారు. కానీ , మూడు రాజధానుల ప్రభుత్వ ప్రకటనపై ఇప్పటికే అమరావతిలో తీవ్ర ఆందోళనలు నెలకొన్న విషయం తెలిసిందే. ప్రకటన చేసిన నాటి నుంచి నేటి వరకు రాజధాని అమరావతి ప్రాంత రైతులు నిరసన తెలుపుతున్నారు. రైతులకు రాజకీయ నాయకులు - న్యాయవాదులు కూడా మద్దతు తెలుపుతున్నారు. హైకోర్టును తరలించవద్దంటూ న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు. రాజధాని ప్రాంత రైతులకి పలువురు మద్దతు తెలుపుతున్నారు.

ఇకపోతే, ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖపట్నంను చేస్తామంటూ చేసిన ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటనను స్వాగతించిన టీడీపీ నేత - మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తాజాగా మరోసారి సంచలన కీలక వ్యాఖ్యలు చేసారు. విశాఖపట్నంలో గంటా సహా టీడీపీ నేతలు సమావేశమై రాజధాని విషయంపై చర్చించారు. ఈ సందర్బంగా విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ రాజధాని కావడం సంతోషం కలిగించే విషయమే అని - అయితే, అమరావతిలో రాజధానికి భూములిచ్చిన రైతులకు న్యాయం చేయాలని స్పష్టం చేశారు.

గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కోసమే ఎగ్జిక్యూటివ్ రాజధాని అనే ఆలోచన చేశారని అనుమానం కూడా ఉందని గంటా శ్రీనివాసరావు అన్నారు. రాజధాని పేరుతో ప్రశాంతమైన విశాఖ నగరంలో అరాచక శక్తులు ప్రవేశించే ప్రమాదం ఉందని - దీనిపై ప్రభుత్వం స్పందించి - సరైన నిర్ణయం తీసుకోవాలి అని కోరారు. మెట్రో - రోడ్లు వేస్తే విశాఖపట్నం విశ్వనగరం అయిపోదని.. మాస్టర్ ప్లాన్ తీసుకోవాలని - ట్రాఫిక్ - హౌసింగ్ లాంటి అంశాలపై జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో చర్చించిన అంశాలను చంద్రబాబుకి కూడా తెలియజేస్తున్నామని తెలిపారు.