Begin typing your search above and press return to search.

బాబు సైకిల్ కి గాలి తీసేస్తున్న గంటా....?

By:  Tupaki Desk   |   23 Dec 2022 5:04 PM GMT
బాబు సైకిల్ కి గాలి తీసేస్తున్న గంటా....?
X
ఆయన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత. మాజీ మంత్రి. సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే. ఆయనే గంటా శ్రీనివాసరావు. ఆయన తాజాగా చేసిన కొన్ని కామెంట్స్ ఇపుడు మంట పుట్టిస్తున్నాయి. అదే టైం లో ఉత్తరాంధ్రాలో టీడీపీకి ఊపిరిలూదాలని నానా తంటాలు పడుతున్న చంద్రబాబుకు ఇబ్బందికరంగా మారుతున్నాయని అంటున్నారు. ఇంతకీ గంటా అన్నారని ప్రచారంలో ఉన్న కామెంట్స్ ఏంటి అని చూస్తే అవి ఏపీలో కాపులను ఇబ్బంది పెట్టేవిగా ఉన్నాయనే అంటున్నారు.

గంటా తాజాగా కాపుల్లో ఐక్యత లేదంటూ కామెంట్స్ చేశారని విశాఖ కాపునాడు ప్రెసిడెంట్ తోట రాజీవ్ విమర్శించారు. కాపులను తన రాజకీయం కోసం గంటా వాడుకుంటున్నారని ఆయన దుయ్యబెట్టారు. కాపులలో ఐక్యత లేకపోతే గంటా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎలా గెలిచారు అని ఆయన ప్రశ్నించారు. కాపునాడు పేరిట విశాఖలో గంటా ఆద్వర్యాన నిర్వహిస్తున్న సదస్సు వెనక కూడా ఆయన రాజకీయ ఉద్దేశ్యాలు ఉన్నాయని తోట రాజీవ్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

కాపునాడు పెద్దలకు టీడీపీ, వైసీపీ, జనసేన టికెట్లు ఇప్పిస్తాను అని చెప్పి గంటా వారిని తనతో తిప్పుకుంటున్నారని రాజీవ్ హాట్ కామెంట్స్ చేశారు. గంటా శ్రీనివాసరావు కాపులలో చీలిక తెచ్చి తన పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. కాపునాడుని గంటా భ్రష్టు పట్టిస్తున్నారు అని కూడా మండిపడ్డారు.

ఇదిలా ఉండగా గంటా చంద్రబాబుకు గత మూడున్నరేళ్ళుగా ట్రబుల్స్ నే క్రియేట్ చేస్తున్నారు అని అంటున్నారు. ఆ మధ్యన గంటా వైసీపీలోకి వెళ్తారు అంటూ వచ్చిన ప్రచారాలు టీడీపీని కలవరపెట్టాయని అంటారు. దాంతో నేరుగా చంద్రబాబు రంగంలోకి దిగి ఆయన్ని బుజ్జగించారు అంటున్నారు. ఇపుడు గంటా కాపు కార్డు వాడుతున్నారని అంటున్నారు.

ఈ కాపు కార్డుతో టీడీపీకి మరో మారు ఇబ్బందికరమైన పరిస్థితులను ఆయన తీసుకొస్తారా అన్న చర్చ కూడా సాగుతోంది. కాపులలో ఐక్యత లేదని గంటా ఎవరిని ఉద్దేశించి అన్నారో ఏ సందర్భంలో అన్నారో తెలియదు కానీ కాపునాడు నాయకులు మాత్రం మండుతున్నారు. ఉత్తరాంధ్రా జిల్లాలలో కాపులు ఎక్కువగా ఉన్నారు.

చంద్రబాబు తన తాజా టూర్ లో వారిని ప్రసన్నం చేసుకుంటున్నారు. బీసీలను కూడా దగ్గరకు తీస్తున్నారు. తాను అధికారంలోకి వస్తే అందరికీ మేలు చేస్తాను అని బాబు చెబుతున్నారు. మరి బాబు ఇంతలా కష్టపడుతూంటే గంటా కాపుల ఐక్యత గురించి కామెంట్స్ చేశారని వార్తలు రావడం, వాటి మెద కాపు నాయకులు మండిపడడం మాత్రం బాబుకు తలనొప్పిగా మారే పరిస్థితి ఉంది అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.