Begin typing your search above and press return to search.

కొత్త రాజధానికి గంట కొట్టిన గంటా!

By:  Tupaki Desk   |   29 Aug 2019 10:05 AM GMT
కొత్త రాజధానికి గంట కొట్టిన గంటా!
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తి మార్పు విష‌యంలో ప‌ది రోజులుగా రోజుకో స‌రికొత్త వార్త తెర‌మీద‌కు వ‌స్తోంది. ఎవ‌రికి ఇష్టం వ‌చ్చిన‌ట్టు.. ఎవ‌రి రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగా వాళ్లు మాట్లాడేస్తున్నారు. వైసీపీ సీనియ‌ర్ నేత‌ - మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ చేసిన వ్యాఖ్య‌ల‌తో ఎక్క‌డా లేని గంద‌ర‌గోళం నెల‌కొంది. దీంతో దీనిని క్యాష్ చేసుకునేందుకు, ప్ర‌జ‌ల్లో ఉన్న హీట్‌ను పెంచేసేందుకు ఒక్క‌సారిగా టీడీపీ - బీజేపీ - జ‌న‌సేన నేత‌లు వైసీపీపై విమ‌ర్శ‌లు చేశాయి.

ఇక రాజ‌ధాని దొన‌కొండ‌కు వెళ్లిపోతుంద‌న్న ప్ర‌చారం కూడా ఊపందుకుంది. టీడీపీ సైతం వైసీపీ అమ‌రావ‌తిని రాజ‌ధానిగా మార్చేస్తుందంటూ ప్ర‌చారం చేసి ప్ర‌జ‌ల్లో ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త వ‌చ్చేలా చేసేందుకు తీవ్ర ప్ర‌య‌త్నాలు చేసింది. ఇదిలా ఉంటే టీడీపీకే చెందిన మాజీమంత్రి - విశాఖ జిల్లా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విశాఖ విషయంలో సరికొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చారు. విశాఖ‌ను ఆర్థిక రాజ‌ధాని చేయాల‌ని ఆయ‌న స‌రికొత్త డిమాండ్ తెర‌మీద‌కు తీసుకు వ‌చ్చారు.

గంటా ప్ర‌క‌ట‌న‌తో టీడీపీ వాళ్లే ఇప్పుడు డిఫెన్స్‌ లో ప‌డిన‌ట్ల‌య్యింది. ఇప్ప‌టికే వైసీపీ వాళ్లు రాజ‌ధాని విష‌యంలో చేసిన ప్ర‌క‌ట‌న‌ల‌తో విపక్షాల‌ను క‌న్‌ ఫ్యూజ్ చేస్తూనే.. వికేంద్రీక‌ర‌ణ అంశాన్ని కూడా తెర‌మీద‌కు తెస్తున్నారు. ఈ టైంలో గంటా చేసిన ప్ర‌క‌ట‌న ఇప్పుడు టీడీపీకే పెద్ద షాక్ ఇచ్చిన‌ట్ల‌య్యింది. అస‌లు ఆయ‌న ఈ ప్ర‌క‌ట‌న చేయ‌డం వెన‌క టీడీపీ అమ‌రావ‌తి మార్పు విష‌యంలో మాన‌సికంగా సిద్ధ‌మైందా ? లేదా గంటా పార్టీతో సంబంధం లేకుండా టీడీపీ ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న పెట్టి త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తు కోసం కొత్త‌దారులు వెతుక్కుంటున్నారా ? అన్న సందేహాలు కూడా రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి.

రాజ‌ధాని విష‌యంలో గ‌తంలో ప‌లు క‌మిటీలు - ప‌ర్యావ‌ర‌ణ వేత్త‌లు ఇచ్చిన నివేదిక‌ల‌ను తుంగ‌లో తొక్కేసి మ‌రీ ముంపు ప్రాంత‌మైన అమ‌రావ‌తి ఏర్పాటు చేసిన టీడీపీకి ఇప్పుడు వ‌ర‌ద‌ల నేప‌థ్యంలో తాము చేసిన త‌ప్పులు తెలిసి వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో రాజ‌ధాని అక్క‌డ ఏర్పాటు చేస్తే భ‌విష్య‌త్తులో వ‌చ్చే ముప్పుపై కూడా చాలా మందికి రాజ‌ధాని మార్పు గురించి జోరుగా చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. అదే టైంలో ఇక్క‌డ వికేంద్రీక‌ర‌ణ అంశం కూడా తెర‌మీద‌కు వ‌స్తుండ‌డంతో టీడీపీ వాళ్ల‌కు అమ‌రావ‌తి ఇక్క‌డే ఉంటుంద‌న్న న‌మ్మ‌కాలు కూడా స‌న్నిగిల్లిన‌ట్టే క‌న‌ప‌డుతోంది. ఈ క్ర‌మంలోనే గంటా వ్యాఖ్య‌లు ప్రాధాన్య‌త సంత‌రించుకున్నాయి.