Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ మెంట‌ల్ కండీష‌న్ అలా ఉంది మ‌రి..!

By:  Tupaki Desk   |   16 Dec 2015 1:42 PM GMT
జ‌గ‌న్ మెంట‌ల్ కండీష‌న్ అలా ఉంది మ‌రి..!
X
ఏపీ అధికార.. విప‌క్షాల మ‌ధ్య మాట‌ల యుద్ధం మ‌రింత ముదురుతోంది. బాక్సైట్ త‌వ్వ‌కాలు.. న‌కిలీ మ‌ద్యం.. కాల్ మ‌నీ వ్య‌వ‌హారంపై ఈ మ‌ధ్య‌కాలంలో సాగుతున్న విమ‌ర్శ‌లు.. ఆరోప‌ణ‌లు వాతావ‌ర‌ణాన్ని హాట్‌.. హాట్ గా మార్చేస్తున్నాయి. బాక్సైట్ త‌వ్వ‌కాలపై జ‌గ‌న్ పార్టీ ఎమ్మెల్యే ఒక‌రు.. ఏపీ సీఎం చంద్ర‌బాబును సంప్ర‌దాయ ఆయుధాల‌తో న‌ర‌క‌టానికైనా సిద్ధ‌మంటూ ప్ర‌క‌టించి సంచ‌ల‌నం సృష్టించారు. దీనిపై ఏపీ మంత్రులు తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డితే.. స‌ద‌రు ఎమ్మెల్యే వ్యాఖ్య‌ల‌పై కేసు న‌మోదు చేశారు. ఈ నేప‌థ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్ మాట్లాడుతూ.. త‌న తండ్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌ రెడ్డి మ‌ర‌ణం వెనుక చంద్ర‌బాబునాయుడి పాత్ర‌పై విచార‌ణ జ‌ర‌పాలంటూ వ్యాఖ్య‌లు చేయ‌టం తెలిసిందే.

త‌న తండ్రి మ‌ర‌ణంపై వ్యాఖ్య‌ల‌తో స‌రిపెట్ట‌ని జ‌గ‌న్‌.. తాజాగా గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ ను క‌లిసి.. హెలికాఫ్ట‌ర్ కూలిపోయిన ఘ‌ట‌న మీద సీబీఐ చేత విచార‌ణ జ‌ర‌పాలంటూ డిమాండ్ చేశారు. దీంతో.. వైఎస్ మ‌ర‌ణం వ్య‌వ‌హారం మ‌రోసారి వార్త‌ల్లోకి వ‌చ్చింది. గ‌తంలోనూ..త‌న తండ్రి మ‌ర‌ణం మీద జ‌గ‌న్ ప‌లు సందేహాలు వ్య‌క్తం చేయ‌టం తెలిసిందే. తాజా ప‌రిణామంపై ఏపీ మంత్రి గంటాశ్రీనివాస‌రావు.. ప‌త్తిపాటి పుల్లారావు త‌దిత‌రులు స్పందించారు.

గంటా మాట్లాడుతూ.. ఏపీ విప‌క్ష నేత‌గా జ‌గ‌న్ ఏ మాత్రం స‌రిపోద‌ని.. ఆయ‌న మెంట‌ల్‌ కండీష‌న్ ఏమిటో జ‌గ‌న్ తాజా వ్యాఖ్య‌ల‌తో అర్థ‌మైంద‌ని వ్యాఖ్యానించారు.త‌న తండ్రి మ‌ర‌ణంపై జ‌గ‌న్ ఇప్పుడు ప్ర‌శ్న‌లు వేయ‌టం.. సీబీఐ విచార‌ణ కోర‌టం.. చంద్ర‌బాబుకు సంబంధం ఉంద‌న‌టి అన‌టంపై త‌న‌కు చాలా ఆశ్చ‌ర్యంగా అనిపిస్తోంద‌ని వ్యాఖ్యానించారు.

జ‌గ‌న్ గ‌తంలోనూ ఈ త‌ర‌హా ఆరోప‌ణ‌లు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా మీదా.. కార్పొరేట్ దిగ్గ‌జాల మీదా చేసిన విష‌యాన్ని ఆయ‌న గుర్తు చేశారు. జ‌గ‌న్ వ్యాఖ్య‌లు ఆయ‌న మైండ్ సెట్‌ ను.. మెంట‌ల్‌ కండీష‌న్ ను చూపిస్తున్నాయ‌ని వ్యాఖ్యానించారు. వైఎస్ మ‌ర‌ణం త‌ర్వాత కుటుంబాన్ని ప‌రామ‌ర్శించేందుకు నాటి విప‌క్ష నేత‌గా ఉన్న చంద్ర‌బాబు వెళితే.. క‌నీసం ఆయ‌న్ను క‌లవ‌లేద‌ని.. తాను సీఎం అయ్యేందుకు ఎమ్మెల్యేల నుంచి సంత‌కాలు తీసుకునే విష‌యంలో బిజీగా ఉన్నారంటూ చెప్పుకొచ్చారు. ఇక‌.. కాల్ మ‌నీ వ్య‌వ‌హారం మీద మాట్లాడిన గంటా శ్రీనివాస‌రావు.. ఈ విష‌యంలో సీరియ‌స్ గా ఉన్నామ‌ని.. ఈ వ్య‌వ‌హారంలో త‌మ పార్టీ నేత‌ల‌కు సంబంధం ఉన్నా వ‌దిలేది లేదని వ్యాఖ్యానించారు.