Begin typing your search above and press return to search.

మెగా క్యాంప్ లో గంటా... ?

By:  Tupaki Desk   |   3 Oct 2021 1:30 AM GMT
మెగా క్యాంప్ లో గంటా... ?
X
విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మళ్లీ రాజకీయంగా యక్టివ్ అవుతున్నారు. రెండున్నరేళ్ల క్రితం ఆయన విశాఖ నార్త్ అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే రాష్ట్రంలో టీడీపీ ఓడిపోయింది. దాంతో గంటా ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. ఆయన టీడీపీ తరఫున ముందుకు వచ్చి చేపట్టిన ఉద్యమాలు లేవు. పార్టీ అధినాయకత్వం పిలుపు అందుకుని చేసిన పోరాటాలు లేవు. ఆయన ఒక విధంగా టీడీపీకి అంటీ ముట్టనట్లుగానే ఉంటున్నారు. టీడీపీ ఓడిన కొత్తల్లో గంటా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవిని కోరుకున్నారు. చంద్రబాబు తనకు ఆ పదవి ఇస్తారని కూడా ఆశించారు. కానీ ఆ పదవిని బాబు అనంతపురం జిల్లాకు చెందిన పయ్యావుల కేశవ్ కి ఇచ్చారు.

మరో వైపు చూస్తే టీడీపీ శాసన పక్ష ఉప నాయకుడి పదవి కూడా గంటాకు ఇవ్వలేదు. ఇక పార్టీని టాప్ టూ బాటం మార్చేశారు. కొత్త పదవులు ఎన్నో క్రియేట్ చేసి మరీ చాలా మందికి వాటిని పంచారు. కానీ గంటాకు ఎలాంటి పదవీ దక్కలేదు. ఇలాంటి అసంతృప్తులు ఎన్నో గంటాలో ఉన్నాయని చెబుతారు. ఇదిలా ఉంటే గంటాకు చంద్రబాబు అంటే ఈ రోజుకు గురి, గౌరవం ఉన్నాయని అంటారు. అయితే ఆయన వారసుడు లోకేష్ తోనే ఆయనకు పెద్దగా సన్నిహిత సంబంధాలు లేవు అని కూడా అంటారు.

ఇక లోకేష్ విశాఖ జిల్లాలో ఉన్న మరో మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడును చేరదీస్తారు. ఆ విధంగా గంటా టీడీపీ కొత్త పోకడల పట్ల కూడా కొంత కినుకగా ఉన్నారని అంటారు. ఇక ఈ ఏడాది మొదట్లో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వార్తల నేపధ్యంలో గంటా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేశారు. ఆ టైమ్ లో ఆయన టీడీపీ అధినాయకత్వంతో కనీసం సంప్రదించలేదు అంటారు. ఈ విధంగా ఆయన టీడీపీ హై కమాండ్ ని ఇబ్బందుల్లో నెట్టారని అంటారు. మొత్తానికి గంటా ఈ రోజుకీ బయటకు రావడంలేదు. అటువంటి గంటా మెగా ఫ్యామిలీతో మాత్రం తన రిలేషన్స్ బాగా కొనసాగిస్తున్నారు.

ఆయన తాజాగా రాజమండ్రీలో జరిగిన ఒక కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి వెంట కనిపించారు. అంటే గంటా మెగా ఫ్యామిలీకి అతి సన్నిహితం అన్నది మరో మారు రుజువైంది. నిజానికి గంటా 2019 ఎన్నికలకు ముందు వైసీపీలోకి రావడానికి చూశారని కూడా ప్రచారంలో ఉంది. ఎందుకో అది వర్కౌట్ కాలేదు. ఆ తరువాత ఆయన టీడీపీలోనే ఉండిపోయారు. మరి వచ్చే ఎన్నికల వేళ ఆయన ఏం చేస్తారు అన్నది కూడా పెద్ద ప్రశ్నగా ఉంది. అయితే గంటా మార్క్ పాలిటిక్స్ ఎపుడూ వాడిగా వేడిగానే ఉంటాయి. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా టీడీపీ జనసేనల మధ్యన పొత్తు కుదురుతుందని గంటా బాగానే ఊహిస్తున్నారు. అదే కనుక జరిగితే గంటా పంట పండినట్లే అంటున్నారు.

గంటాకు మెగా ఫ్యామిలీతో ఉన్న సత్సంబంధాల దృష్ట్య చంద్రబాబు తిరిగి ఆయన‌కు ప్రయారిటీ ఇవ్వక తప్పని పరిస్థితి ఉంటుంది అని కూడా అంటున్నారు. దాంతో తాను కోరుకున్న సీటుని సంపాదించడమే కాదు, తన వారికి కూడా సీట్లు ఇప్పించుకోవడానికి గంటా రెడీ అవుతారు అంటున్నారు. మొత్తానికి గంటా మార్క్ పాలిటిక్స్ 2023 లో స్టార్ట్ చేస్తారు అంటున్నారు. ఇక గంటా జనసేనకు, జనసేనానికి కూడా ఈసారి సహకరిస్తారా అంటే అవును అన్న మాట కూడా ఉంది. విశాఖ జిల్లా రాజకీయాలో బలమైన నేతగా ఉన్న గంటా కనుక ఒక కొమ్ము కాస్తే ఆ జిల్లాలో పవన్ రాజకీయానికి కూడా ఎదురు ఉండదని అంటున్నారు. మొత్తానికి గంటా రాజకీయం ముందు ముందు ఏపీ రాజకీయాల్లో అనేక సంచలనాలు క్రియేట్ చేస్తుంది అంటున్నారు.