Begin typing your search above and press return to search.

ఢిల్లీలో గంటా చక్రం.. బీజేపీలో చేరటమే తరువాయి

By:  Tupaki Desk   |   8 Nov 2019 5:07 AM GMT
ఢిల్లీలో గంటా చక్రం.. బీజేపీలో చేరటమే తరువాయి
X
గోడ మీద పిల్లుల మాదిరి టీడీపీ నేతల తీరు ఉందన్న విమర్శలకు తగ్గట్లే వారు వ్యవహరిస్తున్నారు. అధికారం ఎక్కడ ఉంటే అక్కడ కు చేరిపోయే నేతల గణానికి నిలువెత్తు రూపంగా ఇప్పుడు వారు కనిపిస్తున్నారు. ఎన్నికల్లో టీడీపీ దారుణ పరాజయం మొదలు.. పార్టీ మారేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కు సన్నిహితంగా ఉండే గంటా చేసిన ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు.

అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు విపరీతంగా తపించినా.. అక్కడ నుంచి సానుకూల సంకేతాలు రాక పోవటంతో దిక్కు తోచని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికే పార్టీ నుంచి బీజేపీ లోకి జంప్ అయిన సుజనా చౌదరి.. సీఎం రమేశ్ లతో దేశ రాజధానిలో అదే పనిగా చర్చలు జరిపిన గంటా.. తాజాగా కమల నాథుల్లోకి కలిసిపోయేందుకు సిద్ధమవుతున్నారు.

తాజాగా ఢిల్లీ లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ ను కలిసి కీలక మంతనాలు జరిపినట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్యే అయిన గంటా.. తాను పార్టీ మారితే తన మీద అనర్హత వేటు పడుతుందని.. దానికి సంబంధించి న్యాయపరమైన ఇబ్బందులు ఎదురుకాకుండా ఏం చేయాలన్న అంశం మీద చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. ఏది ఏమైనా.. త్వరలోనే బీజేపీ లోకి గంటా వారు రావటం ఖాయమన్న మాట బలంగా వినిపిస్తోంది. రాజ్యసభలో ఏ రీతిలో అయితే తెలుగు తమ్ముళ్లు బీజేపీ లో విలీనం అయ్యారో.. ఏపీలోని ఎమ్మెల్యేలు పలువురు బీజేపీ పేరుతో ఒక వర్గంగా మారతారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.