Begin typing your search above and press return to search.

కేసీఆర్‌, చంద్రబాబు కలవనున్నారా...?

By:  Tupaki Desk   |   26 May 2015 10:38 AM GMT
కేసీఆర్‌, చంద్రబాబు కలవనున్నారా...?
X
పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయి విభేదాలతో పరస్పరం మాటల ఈటెలు విసురుకుంటున్న ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్‌ లు కలవనున్నారా....? అంటే అవుననే అంటున్నారు ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు. ఉన్నత విద్యామండలి వ్యవహారంలో ఈ ఇద్దరు సీఎంలూ త్వరలో భేటీ అవుతారని గంటా చెబుతున్నారు. అయితే.... ఇది ఎంతవరకు సాధ్యమన్న ప్రశ్న మాత్రం అందరి నుంచి ఉత్పన్నమవుతోంది. ఉన్నత విద్యామండలి విషయంలో గవర్నరు వద్ద రెండు రాష్ట్రాల విద్యా శాఖ మంత్రులు భేటీ జరిగిన అనంతరం గంటా ఈ విషయం చెప్పినప్పటికీ ప్రస్తతు పరిస్థితుల్లో చంద్రబాబు, కేసీఆర్‌ ల భేటీ ఉండకపోవచ్చన్న వాదనే బలంగా వినిపిస్తోంది.

ఏపీ ఉన్నత విద్యా మండలి వ్యవహారంలో చర్చించేందుకు రాజ్‌భవన్‌ లో గవర్నరు నరసింహన్‌ సమక్షంలో తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఏపీ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సమావేశమయ్యారు. సమావేశంలో ఉన్నత విద్యామండలి, ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ విషయమై గవర్నర్‌తో చర్చించారు. సమావేశ అనంతరం ఇద్దరు మంత్రులు భిన్న రకాలుగా మీడియాతో మాట్లాడడం విశేషం. ఉన్నత విద్యామండలి, ఎంసెట్‌ పరీక్ష ప్రవేశాలకు సహకారంపై చర్చిస్తామని... మంగళవారం మధ్యాహ్నమే గంటా శ్రీనివాసరావు, రెండు రాష్ట్రాల అధికారులు సమావేశమవుతారని కడియం చెప్పారు. అయితే గంటా మాత్రం... మంగళవారం సాయంత్రం కానీ బుధవారం కానీ భేటీ ఉంటుందని చెప్పారు. అంతేకాదు.... మంత్రులు, అధికారుల స్థాయిలో చర్చలు జరిపిన తర్వాత ఇద్దరు సీఎంల మధ్య చర్చలు ఉంటాయనీ ఆయన చెప్పేశారు. కడియం మాత్రం దీనిపై ఏ విధమైన సమాచారం ఇవ్వలేదు. ఇక కడియం, గంటాల మధ్య సమావేశం విషయానికొస్తే... ఎంసెట్‌ కౌన్సెలింగ్‌కు సహకరించాలని, సిబ్బందిని కేటాయించాలని మంత్రి గంటా కోరగా తెలంగాణ మంత్రి కడియం శ్రీహరి అందుకు సానుకూలంగానే స్పందించారు. మొత్తానికి ఈ ఇద్దరి మధ్య భేటీ మాత్రం సాఫీగానే సాగింది. గతంలో టీ విద్యా శాఖ మంత్రిగా జగదీశ్‌ రెడ్డి ఉన్నప్పుడు పలు అంశాలపై గంటా, జగదీశ్‌ లు సమావేశమయ్యారు. వారిద్దరి మధ్య సమావేశాలు కాస్త వాడివేడిగానే ఉండేవి. అందుకు భిన్నంగా ఈసారి గంటా కడియంల సమావేశం మాత్రం సానుకూల వాతావరణంలో జరగడం విశేషం.