Begin typing your search above and press return to search.

రంగా జపం : గంటా మార్క్ పాలిట్రిక్స్...?

By:  Tupaki Desk   |   29 Jun 2022 7:30 AM GMT
రంగా జపం : గంటా మార్క్ పాలిట్రిక్స్...?
X
వంగవీటి రంగా జనం మరచిపోలేరు. ఆయన పేదల పెన్నిధిగా పనిచేశారు. ఆయన ఒక సామాజికవర్గానికి ప్రతినిధిగా చూడడం కంటే బడుగుల కోసం పోరాడిన నేతగా గుర్తుంచుకుంటేనే బాగుంటుంది. వంగవీటి మోహన రంగా. ఈ పేరు పలుకుతూ ఉంటే ఒక రకమైన ప్రకంపనలు వస్తాయి. అంతటి పవర్ ఆ పేరులో ఉంది 1980 దశకంలో రంగా ఒక ప్రభంజనంగా కోస్తా జిల్లాలను ఊపేశారు. నాడు అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వాన్ని గడగడలాడించిన నాయకుడిగా రంగాను చెప్పుకోవాలి.

నాడు అపరిమితమైన జనాదరణతో ఎన్టీయార్ 1985లో రెండవసారి సీఎం అయ్యారు. ఆయన ఏలుబడిలో కాంగ్రెస్ సహా విపక్షాలు ఎన్ని పోరాటాలు చేసినా పెద్దగా జనాలకు ఎక్కని పరిస్థితి. అలాంటి చోట విజయవాడ నడిబొడ్డున రంగా అన్న ఒకే ఒక్క శక్తి టీడీపీని నిలువరించగలిగింది. అలా రంగా వర్సెస్ టీడీపీ అన్నట్లుగా మూడేళ్ళ పాటు సాగిన పోరాటం ఏపీ రాజకీయాన్ని కీలక మలుపు తిప్పింది. రంగా హత్య కావించబడినా నాడు ఆయన అనుకున్నట్లుగా టీడీపీని ఓడించగలిగారు, ఈ రోజుకీ ఆయన కాపులకు ఆరాధ్యదైవంగా ఉన్నారు.

రంగా వారసులుగా చాలా మంది ఎదిగేందుకు ప్రయత్నాలు చేసినా కూడా ఆ చేరువకు కూడా రాలేకపోయారు. ఇక ప్రతీ ఎన్నిక ముందు రంగా గురించి మాట్లాడడం కూడా ఒక రాజకీయ వ్యూహంగా మారుతూ వస్తోంది. ఇక రంగా గురించి ఇటీవల కాలంలో ఎక్కువగా తలుస్తున్న వారిలో మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు చురుకుగా ఉన్నారు అని చెప్పాలి. గంటా ఏకంగా విశాఖలొ రంగా 75వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.

రంగా జయంతి జూలై 4న జరగనుంది. ఈసారి ఉత్సవాలను కేవలం విశాఖతో మాత్రమే కాకుండా విజయవాడ, హైదరాబాద్ లలో కూడా నిర్వహించాలని గంటా భావిస్తున్నారు. ఒక విధంగా రంగా జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరగాలని ఆయన కోరుకుంటున్నారు. ఏపీలోని ఒక సామాజికవర్గంలో చైతన్యాన్ని తట్టి లేపేలా ఈ ఉత్సవాలు ఉండాలని కూడా ఆశిస్తున్నారు.

ఇక్కడ మరో మాట కూడా చెప్పుకోవాలి. ఇటీవల కాలంలో గంటా ఎక్కువగా రంగా గురించే ఆలోచిస్తున్నారు అని అంటారు. ఆయన ఈ మధ్యన పాయకరావుపేటలో రంగా విగ్రహాన్ని ఆవిష్కరించాలి. కాపులు తలచుకుంటే సాధించనిది ఉండదు అని కూడా అన్నారు. ఏపీలో కాబోయే సీఎం కాపుల నుంచే వస్తారు అని నాడు ఆయన అన్నారు. అపుడు ఆయన టీడీపీతో గ్యాప్ మెయింటెయిన్ చేస్తున్నారు అని ప్రచారంలో ఉంది.

ఇటీవల కాలంలో ఆయన చంద్రబాబుతో కలసి కనిపించారు. గంటా మనవడి పుట్టిన రోజు వేడుకలకు చంద్రబాబు స్వయంగా ఇంటికి వెళ్లారు. గంటా కూడా వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలిచి చంద్రబాబు సీఎం కావడం అని గట్టిగా ప్రకటించారు. మరి ఇపుడు గంటా రంగా నామస్మరణ వెనక ఉద్దేశ్యం ఏంటి అన్నది కూడా చర్చగా ఉంది. అయితే ఈసారి పెద్ద ఎత్తున కాపులను టీడీపీ వైపుగా రప్పించి ఆ పార్టీ విజయానికి తన వంతుగా కృషి చేయాలని గంటా భావిస్తున్నారు అని అంటున్నారు.

వచ్చే ఎన్నికల్లో కాపులు నిర్ణయాత్మకమైన పాత్ర పోషిస్తారు అని అంటున్నారు. దాంతో కోస్తా జిల్లాలో అతి ప్రధాన వర్గంగా పెద్ద వర్గంగా ఉన్న కాపులను టీడీపీకి సానుకూలం చేసే బాధ్యతను గంటా తీసుకున్నారు అన్న చర్చ సాగుతోంది. మొత్తానికి రంగా నామ జపం ఈసారి గంటా ద్వారా టీడీపీని గట్టెక్కిస్తుందా అన్నది చూడాలి. ఏదేమైనా రాజకీయ వ్యూహాలను రచించడంతో ఉద్ధండుడుగా పేరు గడించిన గంటా రంగా 75వ జయంతి వేడుకలను చేయడం వెనక భారీ రాజకీయ వ్యూహాలే ఉన్నాయని అంటున్నారు.