Begin typing your search above and press return to search.

గంటా మాస్టారూ... ఉన్నట్లేనా... ?

By:  Tupaki Desk   |   21 Oct 2021 1:30 AM GMT
గంటా మాస్టారూ... ఉన్నట్లేనా... ?
X
విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఎంత చురుకైన నాయకుడో అందరికీ తెలిసిందే. ఆయన ఏడేళ్ల పాటు నాన్ స్టాప్ గా కాంగ్రెస్, టీడీపీలలో వరసబెట్టి మంత్రిగా కొనసాగారు. ఏనాడూ ఆయన మీడియాకు దూరంగా లేరు. అటువంటి గంటా రెండేళ్ళుగా మౌన వ్రతం పాటిస్తున్నారు. ఆయన రాజకీయ దారి ఏంటో, ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటో ఎవరికీ అర్ధం కావడంలేదు. రకరకాల ప్రచారం అయితే ఆయన పాలిటిక్స్ మీద జోరుగా సాగుతోంది. ఇవన్నీ ఇలా ఉంటే ఆయనను టీడీపీ కూడా దూరం పెడుతోంది అన్న సంకేతాలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో వైసీపీ కార్యకర్తలు టీడీపీ కేంద్ర ఆఫీస్ మీద దాడులు చేయడంతో ఏపీ అంతా ఒక్క సారిగా ఉలిక్కిపడింది. దాంతో గంటా మాస్టార్ లో కూడా చలనం వచ్చింది అంటున్నారు.

ఆయన ఏకంగా ఈ అంశం మీద ముఖ్యమంత్రి జగన్ కే లేఖ రాశారు. శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన అధికార పార్టీకి చెందిన వారే ఇలా దాడులు చేయడమేంటి అన్న డౌట్లు వ్యక్తం చేశారు. ఏపీలో పరిస్థితి అదుపు తప్పకుండా ముఖ్యమంత్రి జగన్ జోక్యం చేసుకోవాలని కూడా ఆయన చాలా స్మూత్ గాసూచించడమే విశేషం. మొత్తానికి గంటా లేఖ సారాంశం ఏంటి అంటే దాడులు మంచిది కాదు అని మాత్రమే. ఇక్కడ ఆయన పూర్తిగా టీడీపీని గట్టిగా వెనకేసుకుని రాలేదు. అదే టైమ్ లో వైసీపీని పెద్దగా విమర్శించినదీ లేదు. మిగిలిన తమ్ముళ్ళ మాదిరిగా ఘాటుగా ధాటీగా జగన్ మీద విమర్శలు చేయలేదు.

తటస్థవాదిగా, ప్రజాస్వామ్య ప్రియునిగా మాత్రమే గంటా సూచనలు చేసినట్లుగా ఈ లేఖ అయితే చెబుతోంది. మరి అదే టైమ్ లో చొక్కాలు చింపుకుని టీడీపీ తమ్ముళ్ళు చాలా మంది రోడ్ల మీదకు వచ్చారు. జగన్ని నిందిస్తూ వారు గట్టిగానే నినాదాలు చేశారు. ర్యాలీలు తీశారు, మరో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు లాంటి వారు అయితే ఏకంగా మీడియా మీటింగులు పెట్టి మరీ జగన్ మీద పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు. కానీ గంటా మాత్రం చాలా సింపుల్ గా ఈ ఇష్యూ విషయంలో రియాక్ట్ అయ్యారు. అది కూడా పాము చావకుండా కర్ర విరగకుండా తనదైన శైలిలో స్పందించారు అంటున్నారు. మొత్తానికి టీడీపీ అధినాయకత్వం బంద్ కి పిలుపు ఇచ్చినా కూడా గంటా బయటకు వచ్చింది లేదు. అంటే గంటా తాను పార్టీలోనే ఉన్నానన్నట్లుగా తనదైన రాజకీయ స్పందన తెలియచేశారని అంటున్నారు. మరి గంటా నుంచి వచ్చిన ఈ రియాక్షన్ టీడీపీ పెద్దలకు సరిపోతుందా. ఆయన జగన్ కి లేఖ రాయడాన్ని వారు మెచ్చుకుంటారా, లేక నొచ్చుకుంటారా అన్నది తరువాత తేలే అంశం. ఏది ఏమైనా గంటా మాత్రం న్యూట్రల్ గానే రియాక్ట్ అయినట్లుగా ఆయన లేఖ చూస్తే అర్ధమవుతోంది అంటున్నారు.