Begin typing your search above and press return to search.

జగన్ కు గంటా రిక్వెస్ట్...ఓ మంచి మార్పునకు సంకేతం!

By:  Tupaki Desk   |   31 Jan 2020 8:31 AM GMT
జగన్ కు గంటా రిక్వెస్ట్...ఓ మంచి మార్పునకు సంకేతం!
X
ఏపీకి మూడు రాజధానులపై తనదైన శైలి గట్టి నిర్ణయమే తీసుకున్న వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెనక్కు తగ్గేలా కనిపించడం లేదన్న వాదన గట్టిగానే వినిపిస్తోంది. విశాఖకు ఎగ్జిక్యూటివ్ కేపిటల్ ను తరలించేసి, కర్నూలుకు జ్యూడిషియల్ కేపిటల్ మార్చేసి... అమరావతిని కేవలం లెజిస్లేటివ్ కేపిటల్ కు పరిమితం చేసే దిశగా జగన్ చాలా దూకుడుగా వెళుతున్నారని చెప్పాలి. ఈ విషయంలో తనకు ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా వెనకడుగు వేసేది లేదన్న రీతిలో జగన్ సర్కారు వ్యూహాలు రచిస్తోంది. ఈ విషయాన్నీ గమనించారో, ఏమో... తెలియదు గానీ... విశాఖ సిటీలో ఓ ఎమ్మెల్యేగా ఉన్న టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు.. ఇప్పుడు జగన్ రాసిన ఓ లేఖ ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ లేఖలో గంటా అభ్యర్థించింది కేవలం సింగిల్ అంశమే అయినా... దానికి జగన్ ఓకే అంటే... ఉభయకుశలోపరి అన్న చందంగా విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ కు గంటా నుంచి కూడా పూర్తి సహకారం అందనునందన్న వాదన వినిపిస్తోంది.

అయినా జగన్ కు రాసిన లేఖలో గంటా ఏమని విజ్ఝప్తి చేశారన్న విషయానికి వస్తే... ‘‘వైజాగ్‌లో మంచి వాతావరణం ఏర్పడే దిశగా ఆలోచించి, రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని విశ్వసిస్తున్నా. వాల్తేరు క్లబ్ విషయంలో ప్రభుత్వం సానుకూల ఆలోచనాదృక్పథం అవలంబిస్తే మంచిది. వైజాగ్ కి ప్రాచీన నామం అయిన వాల్తేరు పేరుతో 1883 లో ప్రారంభం అయినప్పటినుంచి ఈ క్లబ్ వైజాగ్ ప్రజల జీవన విధానంలో మమేకమైంది, వైజాగ్ బ్రాండ్ లో భాగమైంది. అందరికీ ఆహ్లాదాన్ని, ఆతిథ్యాన్ని ఇచ్చే మచ్చికైన ప్రాంతం కావడంతో దీనితో అనుబంధం పెరిగింది. ఇందులో ఎందరో విద్యావేత్తలు, సామాజిక వేత్తలు, దేశభక్తులు, వివిధ రంగాలలో ప్రావీణ్యం పొందిన నిపుణులు, దేశ విదేశాలలో తమ తమ రంగాలలో అగ్రస్థానంలో ఉన్న తెలుగు వారు చాలా మంది సభ్యులుగా ఉన్నారు. ఈ సున్నితత్వాన్ని, ప్రజల భావోద్వేగాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం దీనిని యథాతథంగా ఉంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటే... వైజాగ్ లో మంచి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించి, కృషి చేస్తుందని విశ్వసిస్తున్నాను'’ అంటూ గంటా తన వాదనను వినిపించారు.

మొత్తంగా గంటా వాదన ఏమిటంటే... వాల్తేరు క్లబ్ ను యథాతథంగా ఉంచేసి.. విశాఖలో రాజధాని ఏర్పాటు చేసుకుంటే... ఎవరికీ ఇబ్బంది లేదన్నది ఆయన అభిప్రాయంగా తెలుస్తోంది. అంతేకాకుండా వాల్తేరు క్లబ్ ప్రస్థానం, అందులో సభ్యులుగా ఉన్న వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, వారందరి విన్నపాన్ని గంటా తెలియజేస్తే... దానిని జగన్ సర్కారు గనుక సానుకూల దృక్పథంతో ఆలోచించి వాల్తేరు క్లబ్ ను యథాతథంగా ఉంచేస్తే... క్లబ్ లోని సభ్యులంతా కూడా విశాఖ కేపిటల్ కు సహకారం అందించేందుకు ముందుకు వచ్చే అవకాశాలున్నాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. జగన్ కు గంటా విన్నపం కూడా ఇదేనన్న వాదన కూడా వినిపిస్తోంది. మొత్తంగా జగన్ అభీష్టానికి అనుకూలంగానే ఉన్న గంటా ప్రతిపాదనపై ఇప్పుడు జగన్ ఏమంటారన్న విషయమే ఆసక్తి రేకెత్తిస్తోంది.