Begin typing your search above and press return to search.

కాక రేపుతున్న గంటా గరం గరం కామెంట్స్...?

By:  Tupaki Desk   |   21 Dec 2021 8:39 AM GMT
కాక రేపుతున్న గంటా గరం గరం కామెంట్స్...?
X
గంటా శ్రీనివాసరావు, ఏపీ రాజకీయాలకు పరిచయం అక్కరలేని పేరు అది. రెండు దశాబ్దాలకు పైగా ఆయన రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఎంపీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా ఆయన ఎన్నో ఏళ్ల పాటు పాలిటిక్స్ లో తన హవా చాటుకుంటూ వస్తున్నారు. గంటా రాజకీయ చతురత కలిగిన నేత. దానితో పాటు ఆయన ఒక బలమైన సామాజికవర్గానికి చెందిన వారు. సరైన సమయానికి తగినట్లుగా రాజకీయ వ్యూహాలు వేయడంతో దిట్ట.

దాంతో గంటా అంటేనే ఏపీ పాలిటిక్స్ లో అన్ని పార్టీలకు స్పెషల్ అటెన్షన్ ఉంటుంది. ఆయన అడుగుల మీద మాటల మీద ఎపుడూ ఫుల్ ఫోకస్ పెట్టి పార్టీల అధినేతలు ఉంచుతారు. విశాఖ జిల్లా నుంచి ఏడేళ్ల పాటు కంటిన్యూగా మంత్రిగా పనిచేసిన గంటా ప్రస్తుతానికి టీడీపీలో ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ఆ పార్టీతో అంటీముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. అలాగని ఆయన టీడీపీకి దూరమైనట్లుగా కూడా ఎక్కడా చెప్పలేదు.

వచ్చే ఎన్నికల్లో గంటా ఏ విధమైన రాజకీయ వైఖరి తీసుకుంటారు అన్నది ఎప్పటికపుడు హాట్ టాపిక్ గానే ఉంది. ఇవన్నీ ఇలా ఉంటే గంటా లేటెస్ట్ గా చేసిన కామెంట్స్ ఏపీ రాజకీయాల్లో కాక పుట్టిస్తున్నాయి. గంటా ఈ మధ్యన విశాఖ జిల్లా పాయకరావుపేటలో ఏర్పాటు చేసిన కాపులకు ఆరాధ్యనీయుడు అయిన వంగవీటి మోహన రంగా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు.

ఈ సందర్భంగా అక్కడ ఆయన చేసిన కామెంట్స్ చూసూంటే రాజకీయాల్లో కొత్త సమీకరణలు ఏమైనా స్టార్ట్ అవుతున్నాయా అన్న డౌట్లు అయితే అందరికీ రాకమానదు, ఏపీ రాజకీయాలను కాపులు శాసిస్తారని గంటా అనడం విశేషం. అంతే కాదు కాపులు అంతా ఏకం కావాల్సిన అవసరం ఉందని కూడా గంటా అంటున్నారు. తాను ఈ విషయంలో కీలకపాత్ర పోషిస్తాను అని ఆయన చెబుతున్నరు.

ఏపీలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా కాపులు ఎదగాల్సిన అవసరం ఉందని గంటా నొక్కి చెప్పడం విశేషం. కొద్ది రోజుల క్రితం ఇదే రకమైన అభిప్రాయాన్ని జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ కూడా రాజమండ్రీ సభలో చెప్పారు. దాని తరువాత కాపు సామాజికవర్గానికి చెందిన కురు వృద్ధుడు మాజీ మంత్రి హరి రామజోగయ్య వంటి వారు కూడా కాపుల ఐక్యతను బలంగా కోరుకున్నారు.

ఇవన్నీ చూస్తూంటే తెర వెనక ఏదో సాగుతోంది అన్న భావన అయితే బాగానే బలపడుతోంది. గంటా వంటి రాజకీయ చతురుడు ఖాళీగా ఉన్నారని ఎవరూ అనుకోవడంలేదు. ఆయన 2024 ఎన్నికలకు ఇప్పటినుంచే తనదైన రాజకీయాన్ని మొదలెట్టారని కూడా అంచనా కడుతున్నారు. మరి గంటా రూట్ ఎటూ అన్నదే తేలాల్సి ఉంది. ఏది ఏమైనా గంటా కాపుల ఐక్యత మీద చేసిన కామెంట్స్ మాత్రం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గానే ఉన్నాయని చెప్పకతప్పదు.