Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ కోట‌లో గంట మోగ‌లేక‌పోయిందా?

By:  Tupaki Desk   |   17 Sep 2016 4:01 PM GMT
జ‌గ‌న్ కోట‌లో గంట మోగ‌లేక‌పోయిందా?
X
క‌డ‌ప జిల్లా... ద‌శాబ్దాలుగా వైయ‌స్ కుటుంబానికి కంచుకోట‌గా ఉంటోంది. ఆ కంచు కోట‌ను ప‌గులుకొట్టి పాగా వేసేందుకు తెలుగుదేశం ఎప్ప‌టి నుంచో ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉంది. కానీ ఇంత‌వ‌ర‌కూ ఫ‌లించిన దాఖ‌లాలు లేవు. గ‌డ‌చిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కూడా క‌డ‌ప జిల్లాలో ఒక్క‌టంటే ఒక్క సీటును మాత్ర‌మే తెలుగుదేశం ద‌క్కించుకోగ‌లిగింది. దీంతో ఇప్ప‌టి నుంచే జిల్లాపై స్పెష‌ల్ ఫోక‌స్ పెడ‌దామ‌న్న ఆలోచ‌న‌తో మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావును ఆ జిల్లాకి ఇన్ ఛార్జ్ మంత్రిని చేశారు. పార్టీ బ‌లోపేతం కోసం అలుపెరుగ‌ని కృషి చేస్తా అని రంగంలోకి దిగిన గంటాకు క‌డ‌ప‌లో చుక్క‌లు క‌నిపిస్తున్నాయ‌ని స‌మాచారం! ఎర‌క్క‌పోయి క‌డ‌ప‌లో ఇరుక్కుపోయాను అని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నార‌ట‌.

క‌డ‌ప‌లో తెలుగుదేశం విస్త‌ర‌ణ సంగ‌తి ప‌క్క‌న పెడితే.. ముందుగా సొంతం పార్టీలో ఉన్న గ్రూపుల‌ను డీల్ చేయ‌డమే క‌త్తిమీద సాముకు మించిన ప్ర‌య‌త్నం. తెలుగుదేశం పార్టీలో జిల్లావ్యాప్తంగా దాదాపు 30 గ్రూపులు ఉన్న‌ట్టు స‌మాచారం! ఈ గ్రూపుల‌న్నింటినీ ఒకే తాటిపైకి తీసుకొచ్చి పార్టీని బ‌లోపేతాం చేయాల‌ని గంటా చేయ‌ని ప్ర‌య‌త్నం అంటూ ఏదీ లేదు! అలాగ‌ని ఫ‌లించిన వ్యూహం అంటూ ఒక్క‌టీ లేదు. ఆయ‌న ఎన్నో ప్లాన్ల‌తో జిల్లాలో నాయ‌కుల్ని సంప్ర‌దిస్తూ ఉంటే... వాటిని ఏ ఒక్క‌రూ ప‌ట్టించుకోవ‌డం లేద‌ట‌. దీంతో ఆయ‌న తీవ్ర మ‌న‌స్తాపానికి గురౌతున్న‌ట్టు ఆ జిల్లాకు చెందిన దేశం వ‌ర్గాలే చెబుతున్నారు.

ఈ మ‌ధ్య‌నే నారా లోకేష్ ఓ కార్య‌క్ర‌మం కోసం జిల్లాకు వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా గ్రూపు రాజ‌కీయాలు భ‌గ్గుమ‌న్నాయి. క‌డ‌ప‌లో ఏర్పాటు చేసిన పార్టీ కార్య‌క్ర‌మంలో గ్రూపుల నేత‌ల చొక్కాలు ప‌ట్టుకున్నారు. రాయ‌చోటి - బ‌ద్వేలు ప్రాంతాల్లోని గ్రూపు త‌గాదాలు ఈ సంద‌ర్భంగా బ‌య‌ట‌ప‌డ్డాయి. దీంతో మంత్రి గంటా త‌ల‌ప‌ట్టుకున్నార‌ట‌! వీళ్లంద‌రినీ ఒక తాటి మీదికి తేవ‌డం సంగ‌తి దేవుడికి ఎరుక‌... కానీ, క‌డ‌ప బాధ్య‌త‌లు నెత్తికెత్తుకున్న‌ గంటాకు తాట తెగుతోంద‌ని ఆ జిల్లా దేశం వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. ఆయ‌న మాట‌ను ఎవ్వ‌రూ ల‌క్ష్య‌పెట్ట‌క పోవ‌డంతో విష‌యాన్ని అధినేత చంద్ర‌బాబు దృష్టికి తీసుకెళ్లిన‌ట్టు స‌మాచారం. క‌డ‌ప జిల్లా బాధ్య‌త‌ల నుంచి విముక్తి పొందేందుకు బాగానే ప్ర‌య‌త్నిస్తున్నార‌ట‌! ఇంట గెల‌వ‌డ‌మే ఇంత ర‌చ్చ‌గా ఉంటే... క‌డ‌ప‌లో వైయ‌స్ అభిమానుల‌ను ప్ర‌భావితం చేయ‌డం అనే ఆలోచ‌నే అన‌వ‌స‌రం క‌దా!