Begin typing your search above and press return to search.

జనసేన టీడీపీలకు ముడేస్తున్నది ఆయనేనా... ?

By:  Tupaki Desk   |   24 Feb 2022 2:30 AM GMT
జనసేన టీడీపీలకు ముడేస్తున్నది ఆయనేనా... ?
X
ఆయన తెలివైన రాజకీయ నాయకుడు. అదే విధంగా ఓటమి ఎరుగని వీరుడు కూడా. ఆయనే విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి, టీడీపీ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. ఆయన ఈ మధ్య టీడీపీ అధినాయకత్వం మీటింగునకు వెళ్ళలేదని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దాంతోపాటుగానే ఆయన టీడీపీలో ఉంటారా లేక వెళ్తారా అన్న చర్చ కూడా బయల్దేరింది. అదే సమయంలో ఆయన వైసీపీ వైపు అడుగులు వేస్తున్నారు అని మరికొన్ని ప్రచారాలు వచ్చాయి.

అయితే ఇవేమీ నిజం కాదు అంటున్నారు. గంటా ఇపుడు నిజంగానే బిజీగా ఉన్నారు అంటున్నారు. ఆయన ఇపుడు ఒక అతి పెద్ద రాజకీయ కార్యాన్ని భుజానా వేసుకున్నారు అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ని ఓడించి ఏపీలో అధికారంలోకి రావాలీ అంటే టీడీపీకి సొంతంగా కుదిరేది కాదని ఆయన భావిస్తున్నారని అంటున్నారు.

అదే విధంగా జనసేన కూడా ఎంతలా పుంజుకున్నా ఏపీలో ఒంటరిగా దిగితే కష్టమే అన్న లెక్కలు ఉన్నాయట. ఇక ఏపీలో కాపుల కోసం కొత్త పార్టీ ఇపుడు స్టార్ట్ చేసినా రెండేళ్ళ వ్యవధిలో అది స్ట్రాంగ్ అయి బలమైన అధికార, విపక్షాలను ఢీ కొట్టలేదని ఆయన అంచనా వేస్తున్నారుట. అందుకే ఆయన ఒక మాస్టర్ ప్లాన్ వేశారు అంటున్నారు.

ఏపీలో టీడీపీ జనసేనలను కలిపితే కచ్చితంగా అధికారంలోకి రావచ్చు అన్నదే ఆ ప్లాన్. ఏపీలో టీడీపీకి గ్రౌండ్ లెవెల్ దాకా క్యాడర్ ఉంది. అలాగే చంద్రబాబు రాజకీయ వ్యూహాలు బాగా ఉంటాయి. ఇక పవన్ కళ్యాణ్ పొలిటికల్ గ్లామర్, బలమైన కాపు సామాజికవర్గం కనుక టీడీపీ వైపు మళ్ళితే 2024లో రాజకీయమే మొత్తం మారిపోతుందని గంటా లెక్కలు వేస్తున్నట్లుగా చెబుతున్నారు.

అందువల్లనే ఈ రెండు పార్టీలు కలవాలని గంటా గట్టిగా కోరుకుంటున్నారుట. అయితే అటూ ఇటూ సానుకూల సంకేతాలు ఎలా ఉన్నా మధ్యవర్తిగా తాను రంగంలోకి దిగి ఒక జట్టుగా కూర్చాలని ఆయన ఆలోచిస్తున్నారు అంటున్నారు. ఎటూ ప్రజారాజ్యం వ్యవస్థాపక బృందంలో తానూ ఒకరిగా కీలకంగా ఉన్న గంటాకు పవన్ కళ్యాణ్ తో మంచి సంబంధాలు ఉన్నాయి. అలాగే చిరంజీవి కుటుంబంలో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

దాంతో తాను జనసేనతో చర్చలు జరపడమే కాదు, అటు నుంచి నరుక్కు వచ్చి ఇటు చంద్రబాబు తో కూడా చర్చలు జరపాలని అనుకుంటున్నారుట. చంద్రబాబుతో నేరుగా ఇలాంటి రాజకీయ పొత్తుల గురించి మాట్లాడేంత చనువు అయితే గంటాకు ఉందని అంటారు. దాంతో ఆయన మంచి రోజు చూసుకుని బాబుని కలసి జనసేన టీడీపీ కలయిక గురించి చెబుతారట. ఆ బాధ్యతను తాను నెత్తిన వేసుకుని అటూ ఇటూ కీలకంగా ఉండాలని చూస్తున్నారు.

మొత్తానికి చూస్తే జగన్ కి చెక్ పెట్టే రాజకీయ వంటకాన్ని వండే పనిలో గంటా ఇపుడు బిజీగా ఉన్నారని అంటున్నారు. ఆయన ఈ రెండు పార్టీలతో తనకు ఉన్న సన్నిహిత సంబంధాలను ఉపయోగించుకుని ఏపీ రాజకీయాలను మేలి మలుపు తిప్పుతారు అని అంటున్నారు. చూడాలి మరి గంటా మార్క్ పాలిటిక్స్ ఫలిస్తే మాత్రం ఏపీలో వైసీపీకి చిక్కులూ చుక్కలూ తప్పవు అంటున్నారు.