Begin typing your search above and press return to search.

మాజీ కావడం కోసం గంటా న్యాయ పోరాటం...?

By:  Tupaki Desk   |   27 March 2022 10:33 AM GMT
మాజీ కావడం కోసం గంటా న్యాయ పోరాటం...?
X
అదేంటో అంతా అధికారం కోరుకుంటారు. ఎంతో కష్టపడి ఎమ్మెల్యే అవుతారు. అసెంబ్లీ లోపలికి వస్తారు. కానీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మాత్రం తనకీ ఎమ్మెల్యే పదవి వద్దు అనేస్తున్నారు. ఆయన తక్షణం మాజీ ఎమ్మెల్యే కావాలని కోరుకుంటున్నారు. విపక్ష ఎమ్మెల్యేగా, తెలుగుదేశం నేతగా ట్యాగ్ వద్దు అనుకుంటున్నారని టాక్.

మరి గంటా దీని మీద ఏడాది క్రిత్రమే కచ్చితమైన నిర్ణయం తీసుకున్నారు. గంటా తొందరప‌డరు, తడబాటు అన్నది అంతకంటే ఆయనలో ఉండదు, ఆయన వ్యూహకర్త. అన్నీ ఆలోచించే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయడానికి కేంద్రం తీసుకుంటున్న చర్యలకు వ్యతిరేకంగా తాను రాజీనామా చేయాలనుకుంటున్నట్లుగా ఆయన చెప్పుకున్నారు.

మరి గంటా రాజీనామా చేసి ఏడాది గడుస్తున్నా స్పీకర్ తమ్మినేని సీతారాం అయితే ఆమోదించడంలేదు. దీని మీద గంటా చాలా ప్రయత్నాలు చేశారు. స్పీకర్ ఫార్మెట్ లో తన రాజీనామాను ఆయన స్పీకర్ ఆఫీస్ కు పంపారు. ఆముదాలవలసలో ఉంటున్న స్పీకర్ తమ్మినేని సీతారాం ఇంటికి స్వయంగా వెళ్లి రాజీనామా అమోదించాలని కోరారు.

అయినా ఏ రకమైన కదలికా లేదు. దాంతో గంటా రీసెంట్ గా బడ్జెట్ సమావేశాల వేళ కూడా తన రాజీనామాను ఆమోదించాలని కోరుతూ గంటా స్పీకర్ కి లెటర్ రాశారు. అందులో ఏడాదిగా తన రాజీనామా విషయం పెండింగులో ఉన్న దాన్ని కూడా గుర్తు చేశారు. అయినా కూడా ఏమీ జరగలేదు. బడ్జెట్ సెషన్ అయితే ముగిసిపోయింది.

దీంతో ఇపుడు గంటా కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు అని తెలుస్తోంది. తన రాజీనామాను ఆమోదించేలా చూడాలని ఆయన హై కోర్టుని ఆశ్రయించబోతున్నట్లుగా తెలుస్తోంది. మరి గంటా కోర్టుకు వెళ్తే కనుక అది సంచలనమే అవుతుంది. మరి కోర్టు దాని మీద ఎలాంటి ఆదేశాలు ఇస్తుంది అన్నది కూడా చూడాలి.

మరో వైపు చూస్తే గంటా రాజీనామాను స్పీకర్ ఎందుకు ఆమోదించడం లేదు అన్న దాని మీద చర్చ సాగుతోంది. గంటా విపక్ష పార్టీకి చెందిన వారు. ఆయన రాజీనామా చేస్తే విశాఖ నార్త్ లో జరిగే ఉప ఎన్నికల్లో వైసీపీ గెలుచుకోవచ్చు. గతంలో కూడా స్వల్ప తేడాతోనే ఆ సీటుని వైసీపీ కోల్పోయింది.

మరి ఇలాంటి అవకాశాలు ఉండగా గంటా రాజీనామాను స్పీకర్ ఆమోదించకపోవడం అంటే అధికార పార్టీ లెక్కలు ఏంటో అర్ధం కావడం లేదు అంటున్నారు. మరి గంటా అయితే పక్కా ప్లాన్ తోనే ముందుకు సాగుతున్నారు. ఎంత తొందరగా రాజీనామా ఆమోదం పొందితే అంత తొందరగా తన భవిష్యత్తు ప్రణాళికను కూడా సిద్ధం చేసుకుని ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.చూడాలి మరి ఏం జరుగుతుందో.