Begin typing your search above and press return to search.

టీడీపీ పధకానికి వైసీపీ లెబిల్ : జగన్ కి గంటా కౌంటర్

By:  Tupaki Desk   |   10 July 2022 7:55 AM GMT
టీడీపీ పధకానికి వైసీపీ లెబిల్  : జగన్ కి గంటా కౌంటర్
X
వైసీపీ ఆర్భాటంగా ప్రకటించుకుంటున్న నాడు నేడు పధకం టీడీపీ సృష్టి అని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అంటున్నారు. తాను విద్యాశాఖ మంత్రిగా ఉన్నపుడు ఆ పధకానికి స్వయంగా డిజైన్ చేశాను అని చెప్పుకుంటున్నారు. ఆ పధకానికి నిధులు సమకూర్చిన ఘనత కూడా తమ‌దే అన్నారు. తమ పధకానికి వైసీపీ సర్కార్ పెద్దలు లేబులేసుకోవడం ఏమీ బాగా లేదని ఆయన ఏకంగా జగన్ కే కౌంటరేశారు.

జగన్ వైసీపీ ప్లీనరీలో జరిగిన ముగింపు సమావేశంలో మాట్లాడుతూ నాడు నేడు పధకాన్ని చాలా గురించి గొప్పగా చెప్పారు. దానికి ముందు మంత్రులు కూడా విద్యా రంగం మీద చర్చ సందర్భంగా నాడు నేడు కార్యక్రమంతో సమూలమైన మార్పులకు, సంస్కరణలకు తమ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు.

అయితే నాడు నేడు పధకం గురించి వైసీపీ వారికి మాట్లాడే అర్హత లేదని గంటా అంటున్నారు. తాను విద్యా మంత్రిగా ఉన్నపుడు తనకు పుట్టిన ఆలోచనే ఆ పధకం అని అంటున్నారు. తమ పధకాన్ని వైసెపీ తనదిగా ఎలా చెప్పుకుంటుందని నిలదీస్తున్నారు. ఇది నిజంగా దారుణమని కూడా ఆయన పేర్కొంటున్నారు.

ఈ విషయంలో ప్లీనరీలో సుదీర్ఘ ఉపన్యాసం చేసిన జగన్ కి చిత్తశుద్ధి ఉంటే ఆలోచించాలని కోరారు. లేక ఇంకా తమదే పధకం అని చెప్పుకుంటామంటే అది వారి విచక్షణకే వదిలేస్తామని కూడా అన్నారు. ఇక విద్యారంగంలో అనేక విప్లవాత్మకమైన మార్పులకు టీడీపీ శ్రీకారం చుట్టింది అని గంటా చెప్పుకున్నారు.

అకాడమిక్ క్యాలండర్ ని తయారు చేసి ప్రతీదీ క్రమం తప్పకుండా అమలు చేసిన ఘనత తమదని ఆయన అన్నారు. అలాంటి విద్యారంగాన్ని మూడేళ్ళ కాలంలో వైసీపీ సర్వనాశనం చేసింది అని ఆయన విమర్శించారు. విద్యా రంగం మీద గొప్పలు చెప్పుకుంటున్న వైసీపీ పెద్దలు ఒక్కసారి టీచర్ల వద్దకు వెళ్లి అడిగితే అసలు కధ ఏంటో తెలుస్తుంది అని గంటా సూచించారు.

విద్యా వ్యవస్థను అన్ని విధాలుగా ఇబ్బందుల పాలు చేసి కూడా అంతా తమ క్రెడిట్ అని చెప్పుకోవడం వైసీపీకే చెల్లింది అని ఆయన అంటున్నారు. ఇదిలా ఉండగా గంటా మూడేళ్ళుగా మౌనంగా ఉండి ఇపుడే ఇలా బిగ్ సౌండ్ చేయడం పట్ల వైసీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

మూడేళ్ళుగా నాడు నేడు పేరిట తాము అనేక కార్యక్రమాలు చేపడుతూంటే మాట్లాడని గంటా ఇపుడే ఎందుకు గొంతు విప్పారని కూడా ప్రశ్నిస్తున్నారు. ఆయన రాజకీయ పరిస్థితుల కారణంగానే ఆనాడు సైలెంట్ అయ్యారని, ఇపుడు టీడీపీలో చురుకైన పాత్ర పోషించడానికి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారని అంటున్నారు.

మొత్తానికి గంటా చంద్రబాబు మానసపుత్రిక నాడు నేడు పధకమని చెప్పడం, ఇది తమ పధకం అని మాట్లాడడం వెనక గంటా మార్క్ వ్యూహాలు ఉన్నాయని అంటున్నారు. జగన్ మీద చాలా కాలానికి విమర్శలు చేసిన గంటా ఇక మీదట ఈ రాజకీయ దూకుడు కంటిన్యూ చేస్తారా లేదా అన్నది కూడా చూడాలని అంటున్నారు.