Begin typing your search above and press return to search.

సైనా..సింధు మధ్య గ్యాప్ ఎందుకు? వారిద్దరూ మాట్లాడుకోరా?

By:  Tupaki Desk   |   5 Aug 2021 1:30 AM GMT
సైనా..సింధు మధ్య గ్యాప్ ఎందుకు? వారిద్దరూ మాట్లాడుకోరా?
X
సైనా నెహ్వాల్.. పీవీ సింధు.. వీరిద్దరిని కొత్తగా పరియం చేయాల్సిన అవసరం లేదు. వీరిద్దరిది బ్యాడ్మింటన్ స్టార్లే. వీరిద్దరి మధ్య మరో పోలిక ఉంది. వీరిద్దరికి ఒకరే గురువు. గోపీచంద్ వద్దే వీరు శిష్యరికం చేశారు. సింధు ఇప్పుడు వేరే కోచ్ దగ్గర శిక్షణ తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇక.. సింధుతో పోలిస్తే.. సైనా ముందే రావటం.. తన సత్తాతో భారత్ కీర్తి పతాకాన్ని ఎగురవేయటం తెలిసిందే. ఈ ఇద్దరు స్టార్ షెట్లర్లు మాట్లాడుకోరా? వీరి మధ్య మాటలు లేవా? అన్నది ఆసక్తికరంగా మారింది. దీనికి కారణం.. తాజాగా జరుగుతున్న టోక్యో ఒలింపిక్స్ లో సింధు సింగిల్స్ లో కాంస్య పతకాన్ని సొంతం చేసుకోవటం.. భారత్ నుంచి వరుసగా రెండుసార్లు ఒలింపిక్స్ లో పతకం సాధించిన ఏకైన క్రీడాకారిణిగా నిలవటం తెలిసిందే.

వాస్తవానికి సింధు స్వర్ణం సాధిస్తుందన్న అంచనాలు ఉండగా.. అనూహ్యంగా సెమీస్ లో ఓటమి పాలైన ఆమె.. క్యాంస్య పతకం కోసం జరిగిన మ్యాచ్ లో విజయం సాధించి.. తన మీద ఆశలు పెట్టుకున్న వారిని నిరాశకు గురి చేయలేదు. దీంతో.. ఆమెకు పెద్ద ఎత్తున అభినందలు వెల్లువెత్తాయి. రియో ఒలింపిక్స్ తర్వాత తన కోచ్ గోపిచంద్ కు గుడ్ బై చెప్పేసిన సింధు.. కొత్త కోచ్ వద్ద శిక్షణ పొందుతున్నారు. అప్పటి నుంచి వారిద్దరి మధ్య మాటలు లేవంటారు. అలాంటిది సింధు పతకం సాధించిన తర్వాత ఆమెను అభినందించారు. ఇదే విషయాన్ని సింధు కూడా ప్రస్తావించారు.

అందరూ సింధుకు అభినందనలు తెలుపుతుంటే.. సైనా మాత్రం అందుకు భిన్నంగా మౌనంగా ఉండటం ఆసక్తికరంగా మారింది. సింధు కంటే సైనా ముందు వచ్చి.. పలు అంతర్జాతీయ టోర్నీల్ని గెలుచుకొంది. బ్యాడ్మింటన్ కు క్రేజ్ తీసుకొచ్చిన వారిలో సైనాను కూడా చెప్పుకోవాల్సిందే. దాన్ని సింధు మరో స్థాయికి తీసుకెళ్లింది.

ఒకే గేమ్ ఆడుతూ.. ఒకే గురువు వద్ద శిష్యరికం చేసినప్పటికీ సైనా.. సింధుల మధ్య మొదట్నించి మాటలు తక్కువనే చెబుతారు. ఒకే దేశానికి ప్రాతినిధ్యం వహించినా.. ఎవరి దారి వారిదన్నట్లుగా ఉండేవారే తప్పించి.. ఇద్దరు మాట్లాడుకోవటానికి కూడా ఆసక్తి చూపరంటారు. ఒలింపిక్స్ కు సింధు అర్హత సాధిస్తే సైనా మాత్రం ఆ విషయంలో విఫలమైంది. టోక్యో ఒలింపిక్స్ కు అర్హత సాధించాలంటే టాప్ 16 లోపు ర్యాంకు తప్పనిసరి. సింధు ర్యాంక్ ఏడు కాగా.. సైనాది 22వ ర్యాంక్. ఈ కారణంతోనే ఆమె ఒలింపిక్స్ కు అర్హత సాధించలేకపోయారు.

తమ మధ్య ఉన్న రిలేషన్ మీద సైనా.. సింధులు తమదైన శైలిలో స్పందించారు. తమది వ్యక్తిగతంగా ఆడే ఆట అని.. విజయమే తమ లక్ష్యమని చెబుతూ.. కొన్నిసార్లు మాట్లాడుకుంటాం.. కొన్నిసార్లు మాట్లాడుకోమంటూ ఉన్న విషయాన్ని ఉన్నట్లు కాకున్నా.. అందరికి అర్థమయ్యేట్లుగా చెప్పారని చెప్పాలి. అంతేకాదు.. తామిద్దరి మధ్య ఎలాంటివిభేదాలు లేవంటూ.. అపార్థం చేసుకోవద్దన్నట్లుగా వ్యాఖ్యానించారు. మరి.. ఏమీ లేనప్పుడు దేశం తరఫున ఆడి.. పతకాన్ని తీసుకొచ్చిన సింధుకు సైనా విషెస్ చెబితే పోయేదేమిటి? అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం రాని పరిస్థితి. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అన్నది సింధు.. సైనా విషయంలో అతికినట్లుగా ఉంటుందని చెప్పక తప్పదు.