Begin typing your search above and press return to search.

చిరంజీవితో వివాదం.. వెన‌క్కి త‌గ్గిన గ‌రిక‌పాటి!

By:  Tupaki Desk   |   7 Oct 2022 10:43 AM GMT
చిరంజీవితో వివాదం.. వెన‌క్కి త‌గ్గిన గ‌రిక‌పాటి!
X
ద‌స‌రా పండుగ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లో అక్టోబ‌ర్ 6న హ‌రియాణా గ‌వ‌ర్న‌ర్ బండారు ద‌త్తాత్రేయ కుమార్తె విజ‌య‌ల‌క్ష్మి నిర్వ‌హించిన అల‌య్ బ‌ల‌య్ కార్య‌క్ర‌మం ర‌సాభాస‌కు కార‌ణ‌మైన సంగ‌తి తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప‌లువురు బీజేపీ నేత‌ల‌తోపాటు ప్ర‌ముఖ సినీ న‌టుడు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. అలాగే ప్ర‌ముఖ ప్ర‌వ‌చ‌న‌క‌ర్త గ‌రిక‌పాటి న‌ర‌సింహారావు సైతం పాల్గొన్నారు.

ఈ క్ర‌మంలో గ‌రిక‌పాటి న‌ర‌సింహారావు మాట్లాడుతున్న‌ప్పుడు చిరంజీవి ఆ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన చిన్నారులు, మ‌హిళ‌లతో ఫొటోలు దిగుతుండ‌టంపై గ‌రిక‌పాటి న‌ర‌సింహారావు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే. చిరంజీవిని ఉద్దేశించి.. ఫొటోలు ఆపి వ‌చ్చి త‌న ప‌క్క‌న కూర్చోక‌పోతే తాను ఇక్క‌డి నుంచి వెళ్లిపోతానంటూ హెచ్చ‌రిక‌, బెదిరింపు ధోర‌ణిలో గ‌రిక‌పాటి న‌ర‌సింహారావు మైకులో వ్యాఖ్యానించ‌డం క‌ల‌క‌లం రేపింది. దీనిపై తీవ్ర విమ‌ర్శలు వ్య‌క్త‌మ‌య్యాయి.

గ‌రిక‌పాటి ప‌ద్మ‌శ్రీ అవార్డు గ్ర‌హీత అయిన‌, ప్ర‌ముఖ ప్ర‌వ‌చ‌న‌క‌ర్త‌, అవధాని అయినా అవ‌త‌ల వ్య‌క్తి (చిరంజీవి) స్థాయి తెలుసుకోకుండా ఏదో చిన్న పిల్లాడిని ద‌బాయించిన‌ట్టు ద‌బాయించ‌డం స‌రికాద‌ని మెగాభిమానుల నుంచి విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌య్యాయి.

మ‌రోవైపు చిరంజీవి సోద‌రుడు నాగ‌బాబు.. గ‌రిక‌పాటి న‌ర‌సింహారావుపై ఘాటుగా స్పందించారు. ఏపాటివారికైనా చిరంజీవి గారి ఇమేజ్‌ను చూస్తే ఆ పాటి అసూయ ప‌డ‌టం ప‌రిపాటే అంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా మండిప‌డ్డారు.

మ‌రోవైపు ఈ వ్య‌వ‌హారంపై చిరంజీవి అభిమాన సంఘాలు సైతం ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాయి. ప‌ద్మ‌భూష‌ణ్ అవార్డు పొంది కేంద్ర మంత్రిగా ప‌నిచేసి కొన్ని కోట్ల మంది ఆరాధిస్తున్న హీరోను కించ‌ప‌రిచేలా గ‌రిక‌పాటి వ్యాఖ్య‌లు ఉన్నాయ‌ని నిప్పులు చెరిగారు.

ఈ క్ర‌మంలో చిరంజీవి యువ‌త అధ్యక్షుడు భ‌వానీ ర‌వికుమార్.. గ‌రిక‌పాటి న‌ర‌సింహారావుకు ఫోన్ చేసి ఈ విష‌యంపై మాట్లాడార‌ని తెలుస్తోంది. అభిమానులు మీపై సీరియ‌స్‌గా ఉన్నార‌ని ఆయ‌న‌కు తెలిపారు. చిరంజీవితో మాట్లాడాల‌ని ర‌వికుమార్ కోరారు. దీంతో చిరంజీవితో ఈ రోజే తాను మాట్లాడ‌తాన‌ని గ‌రిక‌పాటి న‌ర‌సింహారావు ఆయ‌న‌కు చెప్పిన‌ట్టు స‌మాచారం. దీంతో ఈ వివాదం స‌ద్దుమ‌ణిగిన‌ట్టే.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.