Begin typing your search above and press return to search.

ఏపీ అసెంబ్లీ నిర్మాణంలో 'తుమ్మల' గొడవ

By:  Tupaki Desk   |   16 Oct 2015 10:14 AM GMT
ఏపీ అసెంబ్లీ నిర్మాణంలో తుమ్మల గొడవ
X
తుళ్లూరులో ఏపీ కొత్త అసెంబ్లీని నిర్మించబోతున్న సంగతి తెలిసిందే. ఈసారి సమావేశాలను అక్కడే నిర్వహించనుండడంతో ఆగమేఘాల మీద అక్కడ అసెంబ్లీని నిర్మించబోతున్న సంగతి తెలిసిందే. అయితే... ఈ కాంట్రాక్టుపై టీడీపీలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తొలుత ఈ కాంట్రాక్టు దాదాపుగా గరికపాటి మోహనరావుకు ఖరారు చేశారని వినిపించింది... ఆయన దీనిపై స్పీకరుకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ కూడా ఇచ్చారు. అయితే... గరికపాటి తెలంగాణకు చెందిన నేత కావడంతో టీడీపీలో కొందరు నాయకులు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. గరికపాటి అసెంబ్లీ నిర్మాణ కాంట్రాక్టు ఇస్తే అది తప్పుడు సంకేతాలు పంపిస్తున్నందన్న వాదన వినిపిస్తున్నారు.

...అంతేకాదు, గరికపాటికి తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నవారితో బంధుత్వాలు ఉన్నాయన్నా వాదనా వినిపిస్తున్నారు. తెలంగాణలో మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావుకు గరికపాటి వియ్యంకుడు. ఆది నుంచి తెలుగుదేశంలో ఉండి మంచిమంచి పదవులు అనుభవంచిన తుమ్మల కొద్దికాలం కిందట టీఆరెస్ లో చేరిపోయి అక్కడా మంత్రి పదవి దక్కించుకున్నారు. ఈ కారణాల వల్ల గరికపాటికి కాంట్రాక్టు ఇవ్వడం తప్పుడు సంకేతాలు పంపిస్తుందని కొందరు టీడీపీ నేతలు చంద్రబాబుతో అన్నట్లు తెలుస్తోంది.

అయితే, గరికపాటి ఈ వాదనలను కొట్టిపారేస్తున్నారు. తాను తుమ్మలకు వియ్యంకుడినైనంత మాత్రాన తనకు టీఆరెస్ తో సంబంధాలు ఉంటాయా ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు... తుమ్మల టీడీపీలో ఉన్నప్పుడే తమ మధ్య బంధుత్వం కలిసింది కానీ ఆ తరువాత కాదని అంటున్నారు. ఆయన పార్టీ మారితే తాను దానికెలా బాధ్యుడినవుతానని గరికిపాటి అంటున్నారు.

కాగా దీనిపై ఎవరి వాదన ఎలా ఉన్నా తొలుత టెండరు ప్రక్రియ నిర్వహిస్తే ఆ తరువాత ఆలోచించవచ్చని సీఎం చంద్రబాబు, స్పీకర్ కోడెల తెలుగుదేశం నేతలను శాంతపరుస్తున్నారట.