Begin typing your search above and press return to search.

తెలంగాణ టీడీపీకి కొత్త బాస్‌

By:  Tupaki Desk   |   5 Dec 2015 5:38 AM GMT
తెలంగాణ టీడీపీకి కొత్త బాస్‌
X
తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఇపుడు క్రాస్‌ రోడ్స్‌ లో ఉంది. ప్ర‌భుత్వంపై ఘాటు విమ‌ర్ళు చేస్తూ దూసుకువెళ్దామ‌నుకున్న ఆ పార్టీ ముందరి కాళ్లకు బంధం వేస్తున్న రీతిలో బ్రేకులు ప‌డుటుండ‌టంతో నేత‌లు గంద‌ర‌గోళంలో ప‌డుతున్నారు. తెలంగాణలో క్యాడర్ పార్టీగా పేరున్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరే సైకిల్ దిగి కారెక్కుతున్న వైనం పార్టీ నేత‌ల‌ను ఆందోళనకు గురిచేస్తోంది.

తెలుగుదేశం పార్టీ అధినేత బాబు విజయవాడకే పరిమితం కావడం, ఆయన తనయుడు లోకేష్‌ కు పెద్దగా రాజకీయ అనుభవం లేకపోవడం, ఉన్న కొద్దిమంది నేతల్లో ముఠా తగాదాలతో చివరకు తమ పార్టీ నామ‌మాత్రంగా మిగిలిపోతుందా అనే ఆవేదన క్యాడర్‌ లో వ్యక్తమవుతోంది. తాజాగా కంటోన్ మెంట్ ఎమ్మెల్యే సాయన్న సైకిల్ దిగి కారెక్కడం, మరో ఎమ్మెల్యే ప్రకాష్‌ గౌడ్ కూడా సీఎంను కలవడం పార్టీని షాక్‌ కు గురిచేసింది. ఇప్పటికే ధర్మారెడ్డి - తలసాని శ్రీనివాసయాదవ్ - మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి - తీగల కృష్ణారెడ్డి - మాధవరం కృష్ణారావు - తాజాగా సాయన్న టీఆర్ ఎస్‌ లో చేరిపోయారు. అంటే సాంకేతికంగా 15 మంది సభ్యులున్న టిటిడిపిలో ఇప్పటికి 8మంది వెళ్లిపోగా, ఇంకా మిగిలిన ఏడుగురిలో ఎంతమంది పార్టీలో కొనసాగుతారో తెలియని గందరగోళం నెలకొంది. తాజా పరిణమాలపై పార్టీ నేతలతో భేటీ అయిన లోకేష్ నష్టనివారణపై చర్చించిన‌ప్ప‌టికీ...ఇంకా ఎంతమంది ఎమ్మెల్యే లు సైకిల్ దిగి వెళ్లిపోతారన్న ఆందోళన అటు నాయకత్వాన్ని - ఇటు క్యాడర్‌ నూ పట్టిపీడిస్తోంది

అసలు పార్టీకి విధేయుడయిన సాయన్న ఎందుకు టీఆర్ ఎస్ పార్టీలో చేరుతున్నారో, చాలామందిని విస్మయపరిచింది. ఓటుకునోటు సమయంలో జరిగిన ఎన్నికల్లో అధికారపార్టీ ఎంత ప్ర‌లోభ‌పెట్టినా లొంగని సాయన్న - హఠాత్తుగా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారో పార్టీ నేతలకు అంతుబట్టడం లేదు. అయితే సాయన్న స‌న్నిహితవ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం పార్టీని వీడటానికి నాయకత్వమే కారణమని చెప్తున్నారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయినప్ప‌టికీ చంద్ర‌బాబు ఆయనకు గతంలో మంత్రి పదవి ఇవ్వలేదని, కనీసం కార్పొరేషన్ చైర్మన్ కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు. తాజాగా ప్రకటించిన టీడీపీ జాతీయ కమిటీలో తనకు స్థానం కల్పించాలన్న కోరికను కూడా చంద్రబాబు పట్టించుకోకపోవడం వంటి కారణాలు సాయన్న గీత దాటడానికి కారణాలని చెప్తున్నారు. తాను కూడా మిగిలిన వారి మాదిరిగా బెదిరించనందుకే తనకు న్యాయం జరగలేదని క‌మిటీ ఏర్పాటుచేసిన సందర్భంలోనే సాయన్న ఆవేదన వ్యక్తం చేశారని వారు గుర్తుచేస్తున్నారు.ఇంతేకాకుండా సాయన్న సిఫార్సులను బాబు పట్టించుకోలేదని, మిగిలిన తెలంగాణ నేతలకు ఇచ్చిన ప్రాధాన్యం ఆయనకు ఇవ్వలేదంటున్నారు.

కాగా,ఇప్పటికే కొనసాగుతోన్న అగ్రనేతల మధ్య అధిపత్యపోరు మరో తలనొప్పిలా మారింది. పార్టీ ముఖ్యుల‌యిన‌ రేవంత్‌రెడ్డి-ఎర్రబెల్లి మధ్య ఇంకా పోరు కొనసాగుతూనే ఉంది. నల్లగొండలో జిల్లా ఏర్పాటు అంశం ఉమా మాధవరెడ్డి-మోత్కుపల్లి మధ్య చిచ్చు పెట్టింది. సీనియర్ నేత ఇనుగాల పెద్దిరెడ్డిలో ఇంకా అసంతృప్తి తగ్గలేదు. రాజ్య‌స‌భ స‌భ్యుడు దేవేందర్ గౌడ్ ఇంత జ‌రుగుతున్నా పార్టీ ఆఫీసు వైపు రావ‌డంలేదు. మొత్తంగా చివరకు త‌మ‌ పార్టీ తెలంగాణ‌లో ఘోరంగా దెబ్బ‌తినే ప్ర‌మాదం ఉంద‌ని అంచ‌నావేస్తున్నారు.పార్టీలో అసంతృప్త నేతలను గుర్తించి, వారితో మాట్లాడే యంత్రాంగమే లేకుండా పోయిందంటున్నారు. కాగా, తెలంగాణ పార్టీ బాధ్యతలు చూస్తున్న లోకేష్‌ కు ఈ పరిణామాలు మరింత భారంగా మారాయి. పెద్దగా అనుభవం లేకపోవడం, సలహాదారులు కూడా ఆయన వయసున్న వారే కావడం, క్షేత్రస్థాయిలో అనుభవం తక్కువగా ఉండటం, బాబు మాదిరిగా కాకుండా కార్పొరేట్ ఆలోచనలు, విధానాలు ఎక్కువగా ఉండటంతో ఈ సమ స్యలు పరిష్కరించడం, ఆయనకు తలకుమించిన భారమేనని సీనియర్లు చెబుతున్నారు.

ఇదిలాఉండగా, ప్రస్తుత సంక్షోభ సమయంలో టీడీపీ సీనియ‌ర్ నేత‌ - రాజ్యసభ సభ్యుడు - హైదరాబాద్ మాజీ ఇన్చార్జి గరికపాటి మోహన్ రావుకు మళ్లీ హైదరాబాద్ పార్టీ బాధ్యతలు అప్పగించే అవ‌కాశాలున్నాయ‌ని చెప్తున్నారు. గతంలో పదేళ్లు ఆయన ఇన్చార్జిగా ఉన్నప్పుడు పార్టీ నాయకుల వ్యవహారశైలి, వారి బలాబలాల గురించి బాగా అధ్యయనం చేశారు. అన్ని డివిజన్లపైనా ఆయనకు అవగాహన ఉన్నందున, గ్రేటర్‌ కు ఇన్చార్జి బాధ్యతలు ఆయనకే కట్టబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో మోత్కుపల్లి - వర్ల రామయ్యకు అవకాశం ఇచ్చినప్పుడు ఆ ఇద్ద‌రు నేత‌లు కొందరినే ప్రోత్సహించారన్న విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. నగర నేతల నాడి తెలిసిన గరికపాటికి బాధ్యతలు ఇస్తే మళ్లీ పార్టీ కొంతమేరకయినా గాడిలో పడుతుందంటున్నారు. త్వ‌ర‌లో ఈ విష‌యంలో స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం ఉంది.