Begin typing your search above and press return to search.

గ‌రిక‌పాటి సూత్రం అప్లై కాదా బాల‌య్య‌?

By:  Tupaki Desk   |   19 Dec 2017 6:57 AM GMT
గ‌రిక‌పాటి సూత్రం అప్లై కాదా బాల‌య్య‌?
X
ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌లు అత్య‌ద్బుతంగా జ‌రుగుతున్న వేళ‌.. కొన్ని విమ‌ర్శ‌లు కూడా తెర మీద‌కు వ‌చ్చాయి. సీఎం కేసీఆర్ నిర్వ‌హిస్తున్న‌వి ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌లు ఎంత‌మాత్రం కావ‌ని.. తెలంగాణ తెలుగు స్వాభిమాన స‌భ‌లుగా త‌ప్పు ప‌ట్టిన వారున్నారు. సోద‌ర రాష్ట్ర‌మైన ఏపీ ముఖ్య‌మంత్రిని ఆహ్వానించ‌ని వైనాన్ని చాలామంది త‌ప్పు ప‌ట్టారు. అప్పుడెప్పుడో ఉమ్మ‌డి రాష్ట్రంలో ఎవ‌రో.. ఏదో అవ‌మానించార‌న్నది మ‌న‌సులో పెట్టుకొని క‌క్ష సాధింపు చ‌ర్యల‌కు పాల్ప‌డ‌టం ఏ మాత్రం మంచిది కాద‌న్న స‌ల‌హాలు.. సూచ‌న‌లు ప‌బ్లిక్‌ గా కేసీఆర్‌ కు ఆయ‌న స‌న్నిహితులే చెప్ప‌టం క‌నిపించింది.

ఇలాంటి వేళ‌.. ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌ల సంద‌ర్భంగా నిర్వ‌హించే కార్య‌క్ర‌మానికి హాజ‌రు కావాలంటూ స‌హ‌స్రావ‌ధాని గ‌రిక‌పాటి న‌ర‌సింహారావును తెలంగాణ ప్ర‌భుత్వం ఆహ్వానించింది. అయితే.. సాటి తెలుగు రాష్ట్రానికి చెందిన సీఎంను తెలుగు మ‌హాస‌భ‌ల‌కు ఆహ్వానించ‌క‌పోవ‌టంపై ఆవేద‌న వ్య‌క్తం చేసిన ఆయ‌న‌.. కుటుంబ పెద్ద‌ను పిల‌వ‌కుండా మ‌హాస‌భ‌ల‌కు త‌న లాంటి వారిని ఆహ్వానించ‌టాన్ని త‌ప్పు ప‌ట్టి.. రాష్ట్ర ముఖ్య‌మంత్రిని పిల‌వ‌కుండా త‌మ లాంటి వారిని పిలిచే కార్య‌క్ర‌మానికి తాను హాజ‌రు కాలేన‌ని ఓపెన్ గా చెప్పేసి సంచ‌ల‌నం సృష్టించారు.

సుత్తి కొట్ట‌కుండా సూటిగా త‌న అభిప్రాయాన్ని మూడు ముక్క‌ల్లో చెప్పేసిన గ‌రిక‌పాటి వారి వాద‌న‌ను తెలంగాణకు చెందిన ప‌లువురు స‌మ‌ర్థించ‌టం క‌నిపించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం చేసిన ఉద్య‌మంలో వినిపించిన ప్ర‌ముఖ నినాదాల్లో ఒక‌టి.. విడిపోయి క‌లిసి ఉందామ‌ని.

మ‌రి.. ఆ మాటే నిజ‌మైతే.. ఇంత ఘ‌నంగా ఎక్క‌డెక్క‌డో ఉన్న విదేశాల్లోని తెలుగువారిని పిలిచి పండ‌గ చేస్తున్న వేళ‌.. ప‌క్క రాష్ట్రానికి చెందిన ముఖ్య‌మంత్రిని పిలిచి ఉంటే ఎంత బాగుండేద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మైంది. గ‌రికపాటి మాట జ‌నం నోట నానుతున్న వేళ‌లోనే.. మ‌రికొన్ని విమ‌ర్శ‌లు తెర మీద‌కు రావ‌టంతో తెలంగాణ స‌ర్కారు ఇబ్బందికి గురైంది. ఈ విమ‌ర్శ‌ల‌కు చెక్ చెప్పేందుకు వీలుగా తెలుగు సినిమా ఇండ‌స్ట్రీకి చెందిన ప్ర‌ముఖుల్ని ఒక వేదిక మీద‌కు తెచ్చే ప్ర‌య‌త్నం చేశారు.

దీనికి ఫ‌లితంగానే సోమ‌వారం రాత్రి కాస్త ఆల‌స్యంగా అయినా భారీగా టాలీవుడ్‌కు చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. వీరంతా ఒక ఎత్తు అయితే ఏపీ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే.. ఏపీ సీఎం చంద్ర‌బాబుకు బావ‌మ‌రిది క‌మ్ వియ్యంకుడైన బాల‌కృష్ణ హాజ‌రు కావ‌టం విశేషం. తాను ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వ‌హిస్తున్న రాష్ట్రానికి చెందిన ఒక ప్ర‌ముఖ సాహితీవేత్త వినిపించిన అభిప్రాయానికి భిన్నంగా హాజ‌రు కావ‌టంపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

కుటుంబ పెద్ద‌గా.. రాష్ట్ర ముఖ్య‌మంత్రిని పిల‌వ‌ని కార్య‌క్ర‌మానికి తాను రాలేన‌ని ఒక పండితుడు తేల్చి చెబితే.. అదే ముఖ్య‌మంత్రి కుటుంబానికి చెందిన కీల‌క వ్య‌క్తి ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌ల‌కు హాజ‌రు కావ‌ట‌మా? అన్న ప్ర‌శ్న ప‌లువురి నోట వినిపిస్తోంది. రాజ‌కీయ నాయ‌కుడిగా కాదు.. సినిమా క‌ళాకారుడిగా తాను హాజ‌రైన‌ట్లు బాల‌కృష్ణ చెప్పుకున్నా.. ఆయ‌న ఏపీ అసెంబ్లీలో స‌భ్యుడ‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు. ఒక‌వేళ గ‌రిక‌పాటి వారి మాట త‌ప్పు అయితే.. ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఇప్ప‌టికే ఖండ‌న విడుద‌ల చేయాల్సి ఉంది. ఏమైనా.. గ‌రిక‌పాటి వారి లాజిక్కుకు భిన్నంగా బాల‌య్య స‌భ‌కు హాజ‌రు కావ‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.