Begin typing your search above and press return to search.

అమ‌రావ‌తి గ‌రుడ.. అదో అద్భుత‌మ‌ట‌

By:  Tupaki Desk   |   23 March 2018 5:41 AM GMT
అమ‌రావ‌తి గ‌రుడ.. అదో అద్భుత‌మ‌ట‌
X
కొన్ని విష‌యాల్ని ఉన్న‌ది ఉన్న‌ట్లుగా మాట్లాడుకోవాలి. బాగుందంటే బాగుంద‌ని.. బాగోలేదంటే బాగోలేద‌నాలి. విభ‌జ‌న కార‌ణంగా ఆర్థికంగా చితికిపోయిన ఏపీ.. నిధుల కోసం ప‌డే క‌ష్టాలు అన్నిఇన్ని కావు. ఇలాంటి ప్ర‌తికూల‌త‌ల్లోనూ కొన్ని అంశాలపై ప్ర‌భుత్వం తీసుకునే శ్ర‌ద్ధ ఇప్పుడు అంద‌రిని ఆక‌ర్షించ‌ట‌మే కాదు.. అవాక్కు అయ్యేలా చేస్తోంది. సాంకేతిక‌త విష‌యంలో దేశంలో మ‌రే రాష్ట్రంలోనూ లేని స‌రికొత్త విధానాన్ని ఏపీ అమ‌రావ‌తిలో అమ‌లు చేస్తున్న వైనం గురించి అంద‌రూ తెలుసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది.

ఏదైనా కొత్త విష‌యాన్ని త‌న రాష్ట్రంలో అమ‌లు చేయ‌టానికి తెగ ఉత్సాహాన్ని ప్ర‌ద‌ర్శించే తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ .. అమ‌రావ‌తిలోని గ‌రుడ క‌మాండ్ కంట్రోల్ రూం గురించి తెలుసుకోవాలంటున్నారు. నిన్న‌టి నుంచి టీవీ ఛాన‌ల్స్ ఉద‌ర‌గొడుతున్న ఆప‌రేష‌న్ గ‌రుడ‌కు.. ఇప్పుడిక్క‌డ ప్ర‌స్తావిస్తున్న గ‌రుడ క‌మాండ్ కంట్రోల్ రూంకు సంబంధం లేదు.

ఇంత‌కీ.. ఈ గ‌రుడ క‌మాండ్ కంట్రోల్ రూం ఏం చేస్తుంది? అస‌లు ఎందుకు స్టార్ట్ చేశారు? ఇదెలాంటి ప‌ని తీరును ప్ర‌ద‌ర్శిస్తోంది? లాంటి అంశాల్ని చూస్తే.. కాసేపు ఇంగ్లిషు సినిమా చూసిన‌ట్లుగా అనిపించ‌క మాన‌దు. ఇందుకు ఉదాహ‌ర‌ణ‌గా కొన్ని ఉదంతాల్ని ప్ర‌స్తావిస్తే.. అమ‌రావ‌తి గ‌రుడ ఏం చేస్తుందో ఇట్టే అర్థ‌మైపోతుంది. ఆ మ‌ధ్య‌న ఏపీ సీఎం కాన్వాయ్ వ‌స్తోంది. రోడ్డుకు ఎదురుగా ఒక ఎమ్మెల్సీ వాహ‌నం ఎదురు వ‌స్తోంది. అంతే.. గ‌రుడ కంట్రోల్ రూంలోని అధికారులు గుర్తించేశారు. వెంట‌నే అక్క‌డి ద‌గ్గ‌ర్లోని పోలీసుల‌ను అప్ర‌మ‌త్తం చేశారు. ఎలాంటి స‌మ‌స్యా ఎదురుకాకుండా.. ఎమ్మెల్సీ వాహ‌నాన్ని ఆపేయ‌ట‌మే కాదు.. ఆ కారుకు ఫైన్ వేశారు. మ‌రో ఉదంతంలో సీఎం కాన్వాయ్ వెళుతున్న వేళ‌.. అదే మార్గంలో ఓ గ్యాస్ సిలిండ‌ర్ల‌తో కూడిన ఆటో అడ్డుగా వ‌స్తున్న‌ది గ‌రుడ కంట్రోల్ రూంలో గుర్తించారు. క్ష‌ణాల్లో పోలీసులు అప్ర‌మ‌త్త‌మై.. దాన్ని ఆపేసి ప‌క్క‌కు నిలిపేశారు. దీంతో.. పెను ప్ర‌మాదం త‌ప్పిన‌ట్లైంది. ఇలా.. ముఖ్య‌మంత్రి మొద‌లు రాష్ట్ర ఎమ్మెల్యే వ‌ర‌కూ ప్ర‌తి ఒక్క ప్రజాప్ర‌తినిధిని కంటికి రెప్ప‌లా కాపాడుకోవ‌ట‌మే గ‌రుడ క‌మాండ్ కంట్రోల్ రూం ప్ర‌త్యేక‌త‌గా చెప్పాలి.

దేశంలో మ‌రెక్క‌డా లేని రీతిలో అమ‌రావ‌తిలో ఈ సెంట‌ర్ ను ఏర‌పాటు చేశారు. ఏపీకి చెందిన ముఖ్య‌మంత్రి.. మంత్రులు.. ఎంపీలు.. మంత్రులు.. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీల స‌హా ప్ర‌జాప్ర‌తినిధులంతా త‌మ ఇళ్ల వ‌ద్ద నుంచి అసెంబ్లీకి సుర‌క్షితంగా చేరుకునేందుకు వీలుగా ఈ హైటెక్ ర‌క్ష‌ణ‌ను సిద్ధం చేశారు.

గ‌రుడ పక్షి ఆకాశంలో తిరుగుతూనే.. త‌న ల‌క్ష్యాన్ని ఏ రీతిలో అయితే మిస్ కాదో.. ఈ సెంట‌ర్ తీరు కూడా ఇలానే ఉంటుంది. ఆకాశంలో డ్రోన్ల రూపంలో తిరుగుతూ.. కిలోమీట‌ర్ల కొద్దీ దూరాన్ని త‌న నిఘా క‌ళ్ల‌తో ఫాలో అవుతూ ఉంటుంది. అనుకోని రీతిలో ఏదైనా ప్రమాదాన్ని గుర్తిస్తే.. వెంట‌నే జీపీఎస్ ద్వారా ట్రాక్ చేసి.. ఇష్యూ త‌లెత్త‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటారు. ఈ హైటెక్ సెంట‌ర్లో.. ఒక్క ర‌క్ష‌ణ‌కు సంబంధించిన నిఘా మాత్ర‌మే కాదు.. సోష‌ల్ మీడియాకు సంబంధించిన పోస్టులు.. అభ్యంత‌ర‌కర వ్యాఖ్య‌ల‌తో పాటు.. అస‌లేం జ‌రుగుతుంద‌న్న విష‌యాన్ని నిత్యం ప‌రిశీలిస్తుంటారు. అదే రీతిలో ఈ సెంట‌ర్లో ఉప‌యోగించే మ‌రో సాంకేతిక‌త ఏమిట‌టే.. ఆర్ ఐవో. రేడియో ఓవ‌ర్ ఇంట‌ర్నెట్ కాల్ తో వైర్ లెస్ సెట్ ల‌కు కిలోమీట‌ర్ నుంచి 10 కిలోమీట‌ర్ల ప‌రిధి వ‌ర‌కూ స‌మాచారాన్ని చేర‌వేస్తారు. జిల్లాల ఉంచి వ‌చ్చే ఆందోళ‌న‌ల్ని ముందే ప‌సిగ‌ట్టి మ‌ధ్య‌లోనే ఆపేసే వీలుంది. ఏపీ అసెంబ్లీ మొత్తాన్ని నిఘా నీడ‌లోకి తెచ్చేశారు అంతేకాదు.. అసెంబ్లీకి చుట్టుప‌క్క‌ల ఉన్న గ్రామాల్లోని ప్ర‌తి క‌దలిక‌ను నిఘా నేత్రం ద్వారా ఎప్ప‌టిక‌ప్పుడు మానిట‌రింగ్ చేస్తుంటారు. ఏ చిన్న అనుమానాస్ప‌ద క‌ద‌లిక చోటు చేసుకున్నా.. వెంట‌నే గుర్తించేలా ఈ క‌మాండ్ సెంట‌ర్ ను రూపొందించారు. ఇప్ప‌టికి ఏ మాత్రం అభివృద్ధి చెంద‌ని అమ‌రావ‌తిలో.. ర‌క్ష‌ణ ప‌రంగా ఇలాంటి నిఘా వ్య‌వ‌స్థ అవ‌స‌ర‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.