Begin typing your search above and press return to search.

ఎవరీ ఎప్ స్టీన్.. గేట్స్ మెలిందా విడాకుల్లో అతడే కారణమట!

By:  Tupaki Desk   |   11 May 2021 4:38 AM GMT
ఎవరీ ఎప్ స్టీన్.. గేట్స్ మెలిందా విడాకుల్లో అతడే కారణమట!
X
ప్రపంచాన్ని నివ్వెర పరిచే ఘటనగా బిల్ గేట్స్ దంపతుల విడాకుల ఉదంతాన్ని చెప్పక తప్పదు. ఒక్కసారి తమ నిర్ణయంతో షాకిచ్చిన ఈ ఉదంతం ప్రపంచ ప్రజల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది. అనోన్య దాంపత్యానికి కేరాఫ్ అడ్రెస్ గా.. ముగ్గురు పిల్లలకు తల్లిదండ్రులుగా.. వారిని స్ఫూర్తివంతమైన దంపతులుగా భావించిన వారంతా అవాక్కైన పరిస్థితి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఇంతకీ వారిద్దరు విడిపోవటానికి దారి తీసిన కారణం ఏమిటన్న దానిపై ఇప్పటికే రెండు అంశాలు చూపిస్తూ కథనాలు పబ్లిష్ అయ్యాయి. అయితే.. ఈ రెండు కథనాలు ‘ఆమె’ చుట్టూ నడవగా.. తాజాగా ప్రఖ్యాత వాల్ స్ట్రీట్ జర్నల్ మాత్రం అందుకు భిన్నమైన కథనాన్ని వెల్లడించింది.

విడాకుల విషయంలో గేట్స్ పాత ప్రేయసి పాత్ర ఉందని.. కాదు చైనాకు చెందిన తన ఉద్యోగితో గేట్స్ కున్న సంబంధమే కారణమన్న వాదనలు తప్పని.. వారిద్దరి విడాకుల వెనుక ‘ఆమె’ కాదు ‘అతడు’ కారణంగా వాల్ స్ట్రీట్ విశ్లేషించింది. గేట్స్ దంపతుల విడాకుల వెనుక.. జెఫ్రీ ఎడ్వర్డ్ ఎప్ స్టీన్ అనే వ్యక్తి ఉన్నట్లుగా పేర్కొంది.

ఇంతకూ ఇతడు ఎవరు? అన్న విషయంలోకి వెళితే.. ప్రొఫెషనల్ గా ఫైనాన్షియర్ గా అతడు సుపరిచితం. అయితే.. అథ్యాత్మిక విషయాలు మాట్లాడే ఇతడి మీద బాలికలు.. మహిళల్ని అక్రమంగా రవాణా చేస్తారన్న ఆరోపణలు ఉన్నాయి. వ్యభిచారం చేయిస్తారన్న అభియోగాలు ఉన్నాయి. ఈ తరహా కేసుల్లోనే ఇతడు 2019లో జైలుపాలయ్యాడు. కోర్టులో కేసు విచారణ జరుగుతుండగానే.. 2019 ఆగస్టులో జైల్లోనే మరణించాడు. ఇతడితో గేట్స్ కు ఉన్న సన్నిహిత సంబంధాల్ని మెలిందా జీర్ణించుకోలేకపోయేవారిన చెబుతారు.
ఎప్ స్టీన్ తో స్నేహాన్ని ఆమె అంగీకరించలేదని.. ఈ విషయంపై వారి మధ్య విభేధాలు ఎక్కువై.. చివరకు విడాకుల వరకు వచ్చారని చెబుతున్నారు. 2013లో నిర్వహించిన ఒక ఛారిటీ కార్యక్రమంలో గేట్స్ కు తొలిసారి ఎప్ స్టీన్ పరిచయమయ్యారు. అయితే.. అతడి ప్రవర్తన మిలిందాకు నచ్చలేదు. కానీ.. గేట్స్ మాత్రం అతడితో సంబంధాలు కొనసాగించటమే కాదు.. పలుమార్లు కలిసేవారని చెబుతారు. మిలిందా అభ్యంతరాల్ని పట్టించుకోకుండా గేట్స్ వ్యవహరించిన తీరు కూడా విడాకులకు కారణమైంది.

గేట్స్.. ఎప్ స్టీన్ ఒక రాత్రంతా గేట్స్ నివాసంలో ఉన్నట్లుగా 2019లో అమెరికా పత్రికలు రాశాయి. అయితే.. తాను ఎప్ స్టీన్ తో కలిసిన మాట వాస్తవేనని.. అతనితో ఎలాంటి బిజినెస్ సంబంధాలు లేవని స్పష్టం చేశారు. అయితే.. ఇతడితో ఉన్న స్నేహం.. చివరకు గేట్స్ దంపతుల విడాకుల వరకు వెళ్లటానికి ప్రధాన కారణమైందని చెప్పక తప్పదు.