Begin typing your search above and press return to search.

టీఆర్ఎస్ కు ‘గట్టు’ గుడ్ బై.. కేసీఆర్ పై షాకింగ్ వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   26 Nov 2021 6:32 AM GMT
టీఆర్ఎస్ కు ‘గట్టు’ గుడ్ బై.. కేసీఆర్ పై షాకింగ్ వ్యాఖ్యలు
X
అవసరం అనుకోవాలే కానీ దేనికైనా సిద్ధమన్నట్లుగా ఉంటుంది టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీరు. దాదాపు ఆరేళ్ల క్రితం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన గట్టు రామచంద్రారావును స్వయంగా పార్టీలోకి ఆహ్వానించారు గులాబీ బాస్. అంతేనా.. పార్టీలోకి వస్తే సముచిత స్థానం ఇచ్చి గౌరవిస్తామన్న మాట కూడా ఇచ్చారు. టీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్న ఆయన.. తాజాగా పార్టీకి రాజీనామా చేశారు. గడిచిన ఆరేళ్లుగా పార్టీని నమ్ముకొని పని చేసిన ఆయనకు.. తాజాగా జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవకాశం ఇవ్వకపోవటాన్ని ఆయన తీవ్రంగా పరిగణించారు.

ప్రజాభిమానం అంతంతమాత్రంగా ఉంటే గట్టుకు.. పలు ప్రజా సంఘాలతో సంబంధాలతో పాటు.. వాటి మీద తన ప్రభావాన్ని చూపించే సత్తా ఉన్న వారు. పార్టీలోకి తీసుకొచ్చి ఆరేళ్లు అవుతున్నప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి నామినేటెడ్ పదవిని ఇవ్వకపోవటంపై ఆయన గుర్రుగా ఉన్నారు. పార్టీని నమ్ముకొని కష్టపడి పని చేస్తున్నా.. ఫలితం లేకపోవటాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీ అధినేత స్వయంగా గుర్తించి.. పార్టీలోకి తీసుకొచ్చిన తర్వాత కూడా తనకు ఎలాంటి పదవి దక్కకపోవటంపై ఆయన తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈసారి స్థానిక సంస్థల నుంచి ఎన్నికయ్యే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను అభ్యర్థిగా ప్రకటిస్తారని ఆయన గంపెడు ఆశలు పెట్టుకున్నారు. అయితే.. ఆయనకు అవకాశం ఇవ్వని నేపథ్యంలో.. ఆయన తన పార్టీ పదవికి రాజీనామా చేశారు. ‘‘నేను మీ అభిమానం పొందటంలోనూ.. గుర్తింపు తెచ్చుకోవటంలోనూ విఫలమయ్యాను. ఇలాంటి పరిస్థతుల్లో పార్టీలో కొనసాగటం కరెక్టు కాదని భావిస్తున్నా. అందుకే పార్టీకి.. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా. ఆమోదిస్తారని ఆశిస్తున్నా’ అంటూ రాజీనామా లేఖలో పేర్కొన్నారు.

సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆయన.. దీర్ఘకాలం వామపక్ష పార్టీలో పని చేశారు. తొలుత సీపీఎంలో పని చేసిన ఆయన తర్వాత కాంగ్రెస్ లో చేరారు. వైఎస్ మరణం తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన.. అనంతరం కేసీఆర్ ఆహ్వానం మేరకు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయన తదుపరి అడుగు ఎటువైపు అన్నది తేల్లేదు. ఈ విషయం మీద మాట్లాడిన గట్టు..తాను ఏ పార్టీలో చేరాలన్నది ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. పార్టీలో గుర్తింపు లేకనే రాజీనామా చేసినట్లు పేర్కొన్నారు.